పల్లెలకు పట్నం కళ
♦ మున్సిపాలిటీలుగా బోడుప్పల్, మీర్‌పేట?
♦11 గ్రామాలతో కొత్తగా రెండు నగర పంచాయతీలు
♦ ప్రతిపాదనలు పంపాలని సర్కారు ఆదేశం
♦ కసరత్తు ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా యంత్రాంగం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పల్లెలకు పట్నం కళ రానుంది. నగరానికి ఆనుకొని ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలికలుగా మార్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. శివార్లలోని 11 గ్రామాలను రెండు నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని రంగారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. నగరీకరణ నేపథ్యంలో శివారు పంచాయతీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రాజధాని పరిసరాల్లోని 52 పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం లేదా నగరపంచాయతీలుగా స్థాయి పెంచాలని గత ప్రభుత్వం భావించింది.
గ్రేటర్‌లో విలీనం చేసే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం.. పురపాలక సంఘాలుగా మార్చడంలో ప్రభుత్వం శాస్త్రీయత పాటించలేదని ఉన్నతన్యాయస్థానం తప్పుబట్టడంతో విలీన ప్రతిపాదనలపై వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలను నగర పంచాయతీలుగా మారుస్తూ 18 గ్రామాలను ఇందులో విలీనం చేసింది. ఈ క్రమంలోనే మిగతా గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించింది.
బోడుప్పల్ కేంద్రంగా..
నగరానికి చేరువలో ఉన్న బోడుప్పల్ దాని సమీపంలోని నాలుగు గ్రామాలను గ్రేటర్‌లో కలిపే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించింది. అదే సమయంలో సరూర్‌నగర్ మండలంలోని మీర్‌పేట సహా ఐదు గ్రామాలను కూడా జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని యోచించింది. దీన్ని అప్పటి గ్రేటర్ కౌన్సిల్ వ్యతిరేకించింది. దీంతో విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే, అప్పటికే సర్పంచ్ ఎన్నికలు జరిగిపోవడంతో వీటికి ఎన్నికలు నిర్వహించలేదు. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం యథావిధిగా నిర్వహించారు.
2011 ఆగస్టులో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ఇవి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. దీనిపై ఇటీవల కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అటు గ్రేటర్‌లో విలీనం చేయకుండా.. ఇటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడిందని కోర్టుకు నివేదించారు. దీనిపై వాదన వినిపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో గ్రామ పంచాయతీల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఈ క్రమంలోనే వీటిని మళ్లీ మున్సిపాలిటీలుగా మార్చే అంశం తెరమీదకు వచ్చింది.
సీఎం ఆదేశాలతో చకచకా...
ఘట్‌కేసర్ మండలంలోని బోడుప్పల్ పేరిట ఫీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్, చెంగి చర్ల.. సరూర్‌నగర్ మండల పరిధిలోని మీర్‌పేట కేంద్రంగా బాలాపూర్, జిల్లెలగూడ, జల్‌పల్లి, కొత్తపేట్, పహాడీషరీఫ్ గ్రామాలను నగర పంచాయతీలుగా మార్చేలా ప్రతిపాదనలు తయారు చేయాలని పట్టణ, పురపాలకశాఖ కార్యదర్శిని తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో 11 గ్రామాలను రెండు కొత్త పురపాలికలుగా ఏర్పాటు చేసే అంశంపై శుక్రవారం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. బోడుప్పల్ పరిధిలో 99,765, మీర్‌పేట పరిధిలో 1,88,864 జనాభా ఉన్న ఈ గ్రామాలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఆ తర్వాత నగర పంచాయతీల ఏర్పాటుపై పురపాలకశాఖ నిర్ణయం తీసుకోనుంది.
చిక్కులు తప్పవా!
శివారు పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే అంశం ప్రభుత్వానికి న్యాయపర చిక్కు లు తెచ్చిపెట్టేలావుంది. ఈ 11 గ్రామాల పరి ధిలో కొలువుదీరిన 74 మంది ఎంపీటీసీలు ఈ ప్రక్రియకు అడ్డుగా మారనున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వీరి పదవీ కాలం ముగిసేందుకు మరో మూడున్నరేళ్లుం ది. ఈ క్రమంలో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలను మున్సిపాలిటీలుగా మారిస్తే ఎంపీటీసీల పదవులు ఊడినట్లే. సరూర్‌నగర్ మండల పరిషత్ పూర్తిగా కనుమరుగుకానుం ది.
ఇప్పటికే సగం గ్రామాలు బడంగ్‌పేట నగర పంచాయతీలో కలిసిపోగా.. మిగిలిన ఆరుగ్రామాలను కలుపుతూ కొత్త నగరపంచాయతీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు ఎసరొస్తుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యే అవకాశముంది. శుక్రవారం జరిగిన అత్యున్నతస్థాయి అధికారుల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. పాలనలో భాగంగా గ్రామాలను ఎప్పుడైనా మున్సిపాలిటీలుగా మార్చే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉందని గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తున్న అధికారులు.. న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.