విజయనగరం కంటోన్మెంట్: ఉద్యోగం దొరకడం కష్టమవుతోంది. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేకపోతున్నాం. కనీసం బీసీ కార్పొరేషన్ రుణమైనా అందితే చిన్న వ్యాపారమైనా పెట్టుకుని బతుకుబండి లాగించొచ్చు. అని ఆశపడుతున్న నిరుద్యోగులకు రుణాల కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ పొంది నిరుద్యోగ సమస్యను రూపుమాపుకుందామనీ, సొంత కాళ్లపై నిలబడదామని యోచిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దీనికి కార ణం తెలుగు తమ్ముళ్ల రాజకీయమేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ముఖ్యంగా లబ్ధిదారులకు మంజూరైన రుణాలను అందించడంలో మున్సిపాలిటీలు, మండలాల్లో జన్మభూమి కమిటీలకు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువవతున్నాయి. జిల్లాలో పదివేల మంది నిరుద్యోగులు రుణ సబ్సిడీ పొందొచ్చని ఆశపడితే ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలు రాజకీయంగా కొన్ని యూనిట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చాయి.
జిల్లాలోని మూడు మండలాలకు చెందిన కమిటీలు మాత్రమే లబ్ధిదారుల వివరాలు ఇచ్చాయి. నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీతో పాటు మిగతా మండలాల నుంచి ఒక్క దర ఖాస్తుకు కూడా కమిటీలు ఆమోద ముద్ర వేయలేదు. దీంతో జిల్లాలోని నిరుద్యోగులు, చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మా కెందుకీ రాజకీయ రుణాల పితలాటకమంటూ ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది డిసెంబర్‌లో 9393 మంది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం యూనిట్లు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ ద్వారా బీసీ కార్పొరేషన్ ప్రకటించింది. దీనికి గడువు తేదీగా జనవరి 5ను నిర్ణయించారు. అనంతరం లబ్ధిదారులకు ఆన్‌లైన్ దరఖాస్తుల విషయంలో సాంకేతిక పొరపాట్లు రావడంతో మరో దఫా గడువు పెంచారు.
చివరికి ఫిబ్రవరి నెలలోగా ఆన్‌లైన్ దరఖాస్తులు రావాలని గడువు విధించారు. అయితే జిల్లాలో 18 లక్షల మంది ఉన్న బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేసిన నాయకులు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ రుణ సబ్సిడీలను తమ కార్యకర్తలకు ఇచ్చుకునేందుకు పన్నాగం పన్నుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు దాటిపోయినప్పటికీ రుణాల దరఖాస్తులను ఇవ్వడంలో ఇప్పటికీ ముందుకు రాకపోవడం విచారకరం. ఎమ్మెల్యే స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకూ తమ పార్టీ చోటా నాయకులు, కార్యకర్తలకు ఇచ్చేందుకు భిన్నమైన వాటాలు వేసుకున్నారన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే నాలుగు మున్సిపాలిటీల నుంచీ ఇంకా ఒక్క దరఖాస్తు కూడా బీసీ కార్పొరేషన్‌కు చేరలేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కారణంగా వెనక్కి పోయిన బీసీ కార్పొరేషన్ రుణాలు, ఈ ఏడాది కూడా జిల్లాకు కేటాయించిన దాదాపు రూ. 100 కోట్లు బడ్జెట్ కారణంగా వెనక్కి మళ్లిపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు. మున్సిపాలిటీలు,మండలాల్లో మా వాళ్లకు రుణాలు ఇవ్వాలంటే మా వాళ్లకు ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతుండడంతో జన్మభూమి కమిటీలు ఈ జాబితాలను ఆమోదించకుండా వదిలేశాయి.
బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు
జిల్లాలో బీసీల అభివృద్ధి పట్ల ఎవరికీ చిత్తశుద్ధి లేదు. గతేడాది కూడా ఓ సారి ఎన్నికల కారణంగా నిలిచిపోయిన రుణాలు ఈ సారి రాజకీయంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొం ది. కుల సమాఖ్యలకు ఇంకా వెబ్‌సైట్ కూడా ఇప్పటివరకూ ప్రారంభించకపోవడం దారుణం. వెంటనే బీసీ రుణాల దరఖాస్తు దారులకు రుణమంజూరు పత్రాలు ఇచ్చి యూనిట్లు గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
పొట్నూరు భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ బీసీ సంక్షేమ సంఘం, విజయనగరం.
ఆమోదించిన దరఖాస్తులు రావాల్సి ఉంది.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, పలు మండలాల్లో ఆన్‌లైన్ దరఖాస్తులను మంజూరు చేస్తూ కమిటీలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని మూడు మండలాల నుంచి మాత్రమే పూర్తిగా పంపించారు. మిగతావి కూడా ఆయా మండలాల నుంచి పంపిస్తే కలెక్టర్ అప్రూవల్‌కు పంపిస్తాం.
ఆర్ నాగరాణి, ఈడీ బీసీ కార్పొరేషన్
ఇదేం దారుణం?
Published Tue, Feb 24 2015 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement