తెలంగాణ మున్సిపాలిటీలకు ఎల్ఈడీ కాంతులు | LED Lights for Telangana Municipalities | Sakshi
Sakshi News home page

తెలంగాణ మున్సిపాలిటీలకు ఎల్ఈడీ కాంతులు

Published Tue, Mar 1 2016 3:50 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

LED Lights for Telangana Municipalities

హైదరాబాద్ : తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ కాంతులు విరజిమ్మనున్నాయి. తెలంగాణలోని 25 మున్సిపాలిటీల్లో రాబోయే 100రోజుల్లో ఎల్ఈడీ బల్బుల బిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐటీ, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఇందనశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ మరియు డిస్కమ్ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ఎల్ఈడీ బల్బులు సరఫరా చేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఈఎస్ఎస్ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి కె.తారకరామరావు ఈ సంస్ధ ఎండీని సాధ్యమైనంత తక్కువకి ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 25 మున్సిపాలిటీల్లోని 6లక్షల గృహాలకు 12 లక్షల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. త్వరలోనే మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ బల్బులను అందిస్తామన్నారు. గ్రామపంచాయితీల్లోనూ ఈ తరహా ప్రయత్నానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పంచాయితీరాజ్ శాఖ అధికారులను అదేశించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీధి దీపాల్లో ఎల్ఈడీ బల్బుల ఉపయోగాన్ని ప్రారంభిస్తామన్నారు. ఆ కార్యక్రమాన్ని రెండో దశలో చేపట్టనున్నట్లు తెలిపారు. మూడో దశలో ప్రజలకు  సబ్సిడీ ద్వారా ఎల్ఈడీ బల్బుల సరఫరా అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.

సమావేశానంతరం మాట్లాడిన ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంధన వినియోగాన్ని పొదుపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తమ విద్యుత్ శాఖా  సిబ్బంది బల్బులను బిగించే భాద్యత తీసుకుంటారన్నారు. త్వరలోనే నల్లగొండ, మెదక్ , నిజామాబాద్ జిల్లాల్లో మెత్తం ఎల్ఈడీ బల్బుల బిగింపును చేపట్టనున్నట్లు తెలిపారు. మెత్తం రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల గృహాల్లో ఎల్ఈడీ బల్బుల బిగింపే లక్ష్యమన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి ఇంధన ఖర్చు తగ్గుతుందని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 9 వాట్ల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు బల్బులను ప్రజలకు పూర్తి ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి  చేసే ఖర్చు విద్యుత్ సరఫరా సంస్ధలకు కరెంట్ ఆదా రూపంలో తిరిగి వస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మున్సిపల్ శాఖాధికారులు, డిస్కమ్ , విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement