అక్రమ నిర్మాణాలు అడ్డగోలు
ముగిసిన క్రమబద్ధీకరణ గడువు
నోటీసులు జారీచేసినా స్పందన కరువు
అనుమతుల్లేని భవనాలపై సీరియస్
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో లెక్కకుమించి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. రెండు కార్పొరేషన్‌లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయితీల్లో వేలసంఖ్యలో అనుమతులు లేని భవనాలు నిర్మించారు. వీటిని గుర్తించిన అధికారులు సగం భవనాలకు మాత్రమే నోటీసులు జారీచేశారు. అయినా ఆయా భవనాల యజమానుల నుంచి స్పందన కరువైంది. భవనాల క్రమబద్ధీకరణ పథకం నాలుగు నెలలపాటు కొనసాగినా 30 శాతం మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇంకా 70శాతం భవనాలు అక్రమంగా ఉన్నట్టేనని తేలింది. వీటిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా అధికారుల్లో ఉన్న మెతకవైఖరితో ఎంతమేరకు చర్యలు చేపడతారనే ప్రశ్నగానే ఉంది.
మున్సిపాలిటీలకు రూ.కోట్లలో నష్టం
పట్టణాల్లో జరిగే ప్రతీ అక్రమ కట్టడం వెనుక ఒక రాజకీయ నేత అండ ఉండడం సాధారణమైంది. అనుమతులు అసలు తీసుకోకుండా కొన్నినిర్మాణాలు జరిగితే, జీ+1 అనుమతి తీసుకుని జీ+4 భవనాలు నిర్మాణం చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నివాసయోగ్యమైన, వాణిజ్య, బహుళ అంతస్తుల నిర్మాణాల్లో నిబంధనలు కానరావడంలేదు. దీంతో కోట్లాది రూపాయలు మున్సిపాలిటీలు నష్టపోవాల్సి వస్తోంది. అయితే టౌన్‌ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిర్మాణం ప్రారంభమైనప్పుడే నిలువరించాల్సింది పోయి మామూలుగా చూస్తూ ఊరుకోవడంతో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి.
30 శాతమే దరఖాస్తులు..
తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశపెట్టాక అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు 13,300 నోటీసులను అందజేశారు. ఇంకా పెద్దమొత్తంలోనే ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని నోటీసులు జారీచేశారు. అయితే నోటీసులు అందుకున్న యజమానులనుంచి స్పందన కరువైంది. 13,300 నోటీసుల్లో 4,715 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. మిగతావన్నీ అక్రమ నిర్మాణాలుగానే మిగిలిపోనున్నాయి.
అక్రమ నిర్మాణాలపై సీరియస్..
క్రమబద్ధీకరణ గడువు ఇదే చివరిసారి.. అక్రమ నిర్మాణాలు సక్రమం చేసుకోవాలంటూ.. ప్రభుత్వం పదేపదే ప్రకటించింది. గడువు ముగిశాక అక్రమ నిర్మాణాలపై సీరియస్‌గా వ్యవహరించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు సూచించింది. మరోసారి సర్వేచేసి గుర్తించి నోటీసులు జారీచేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి కూల్చివేతకు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ నుంచి ఆదేశాలందారుు.