సాక్షి, హైదరాబాద్ : పాలనా సంస్కరణల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేటి నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సోమవారం (24వ తేదీ) నుంచి మార్చి 4 వరకు రాష్ట్రవ్యాప్తం గా తొలి విడత పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని నిర్వహించబోతున్నారు. పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేసీఆర్ ప్రకటించారు. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కొత్తగా జిల్లా అదనపు కలెక్టర్లుగా (స్థానిక సంస్థలు) నియమితులైన అధికారులు పూర్తిగా ఈ కార్యక్రమంపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించి అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను రానున్న 10 రోజుల్లోగా పూర్తి చేయనున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేయనున్నారు. మూడు నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధింత సమస్యలన్నీ పరిష్కారం కావాలని సీఎం కేసీఆర్ టార్గెట్ నిర్దేశించారు. విఫలమైతే చైర్‌పర్సన్‌లు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పట్టణ ప్రగతి అమలు తీరును పరిశీలించేందుకు కేసీఆర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశముంది. సీనియర్ అధికారులతో రూపొందించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
ప్రగతి ప్రణాళిక..
కౌన్సిలర్/కార్పొరేటర్ల సమన్వయంతో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు వార్డుల వారీగా ప్రణాళికలు రూపొందించనున్నారు. వార్డుల వారీగా నియామకమైన ప్రజాసంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రతీ వార్డుకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకాధికారి పనిచేయనున్నారు. పారిశుద్ధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులపై గుంతల మరమ్మతులకు సంబంధించిన పనులను తక్షణమే చేపట్టనున్నారు. పట్టణ ప్రగతి కింద తక్షణమే చేయాల్సిన పనులకు కలెక్టర్, మేయర్/చైర్‌పర్సన్ నుంచి అనుమతి పొంది మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా నిర్వహించాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల వారీగా ప్రతి పురపాలికలో యువజన, మహిళా, వయోజనులు, ప్రముఖుల కమిటీలను ఏర్పాటు చేయాలని మరో ఉత్తర్వులో పేర్కొన్నారు.
దీర్ఘకాలిక ప్రణాళికలు..
పట్టణ ప్రగతి దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ప్రతి పట్టణంలో దహన వాటికలు/ఖనన వాటికలు, పట్టణ జనాభాకు తగినట్లు పరిశుభ్రమైన వెజ్, నాన్ వెజ్, పండ్లు, పూల మార్కెట్లు, ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. వీధి వ్యాపారుల కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయనున్నారు. వంగిన, తుప్పు పట్టిన స్థంభాలు, రోడ్డు మధ్యలోని స్థంభాలు, ఫుట్‌పాత్‌లపై ఉండే ట్రాన్స్‌ఫార్మర్లను పట్టణ ప్రగతిలో భాగంగా మార్చనున్నారు. ఇళ్లపై వేలాడే వైర్లను సరిచేయనున్నారు. ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు.
పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి: కేటీఆర్
పట్టణ రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. పట్టణ ప్రగతి విజయవంతం కావడానికి పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ప్రతి వార్డులో పౌరులతో కమిటీలు ఏర్పాటు చేసి కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. కాగా, మహబూబ్‌నగర్ పట్టణంలో సోమవారం జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలోతెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment