నేటి నుంచి కృష్ణా తీరాన ఫుడ్‌ ఫెస్టివల్‌ | Food festival on the banks of Krishna from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కృష్ణా తీరాన ఫుడ్‌ ఫెస్టివల్‌

Published Sat, Apr 29 2023 4:35 AM | Last Updated on Sat, Apr 29 2023 11:51 AM

Food festival on the banks of Krishna from today - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ:  నదీ తీరాన ప్రజలు చల్లని గాలులతో కూడిన ప్రదేశంలో సేద తీరేందుకు వీలుగా విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కృష్ణా నది ఒడ్డునున్న భవానీపురంలోని పున్నమి ఘాట్‌లో ఏప్రిల్‌ 29 నుంచి మే 7 వరకు ఫుడ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. ‘ఫ్లేవర్స్‌ ఆఫ్‌ ఇండియా’ థీమ్‌ తో తొలిసారిగా నదీ తీరాన ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ ను వీఎంసీ ఏర్పాటు చేసింది.

స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో, పిల్లలు,పెద్దలు ఈ ప్రాంతంలో కనీసం 2 గంటల పాటు సేద తీరటంతోపాటు వారిని ఆహ్లాద పరిచే విధంగా ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఉండనుంది. ఇందులో ప్రసిద్ధిగాంచిన పంజాబీ, రాజస్థానీ, ఢిల్లీ, కేరళ, తందూరిలు, తెలుగు రాష్ట్రాల రుచికరమైన వంటకాలను 20కి పైగా స్టాల్స్‌లో తీసుకురాబోతున్నారు. విజయవాడకి సంబంధించి ప్రముఖ హోటళ్లు ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌లో భాగస్వామ్యమవుతున్నాయి.

సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఉంటుంది. నదీ తీరాన ఈట్‌ స్ట్రీట్‌ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఇక్కడ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. ప్రజలకు రుచికరమైన ఆహారంతో పాటు లైవ్‌ రాక్‌ బ్యాండ్, డ్యాన్స్, జుంబా, గోడ, రోడ్డు పెయింటింగ్, శాండ్‌ ఆర్ట్, స్టాండ్‌–అప్‌ కామెడీ, వంటి ఈవెంట్స్‌తో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. జబర్దస్త్‌ కామెడీ షో నటులతో కామెడీషో ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఫుడ్‌ ఫెస్టివల్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement