employees suspended
-
వెయ్... చిందెయ్...
వారంతా ఉపాధి సిబ్బంది. నాలుగు రోజుల కిందట ఓ విందు కార్యక్రమానికి వెళ్లి అక్కడ మద్యం సేవించి భోజనం ఆరగించారు. తరువాత అక్కడ నుంచి కార్యాలయానికి వచ్చి మద్యం మత్తులో వేయ్...చిందేయ్....అంటూ గంతులేశారు. అక్కడితో ఆగకుండా వాటిని తమ సెల్ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లోకి అప్లోడ్ చేశారు. అది కాస్త ఆలస్యంగానైనా శుక్రవారం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో చిందులేసిన ఆరుగురు సస్పెండ్‌కు గురయ్యారు. విజయనగరం జిల్లా / గరుగుబిల్లి: విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో ఉండాల్సిన సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలలో చిందులు వేస్తూ సామాజిక మాధ్యమాలకు చిక్కారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలకు సస్పెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది ఈ నెల 12న మండలంలోని సంతోషపురంలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో అధికారులతో పాటు పాల్గొన్నారు. విందు ముగించుకొన్న తరువాత ఉపాధి హామీ కార్యాలయానికి తిరిగి చేరుకొన్నారు. విందులోనే మద్యం సేవించి ఉండటం కారణంగా కార్యాలయానికి వచ్చిన తరువాత కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేకపోవడంతో సిబ్బంది సెల్ఫోన్లో హుషారు అయిన పాటలు వేసుకొని డ్యాన్సులు చేసి చిందులు వేసి తమలో దాగివున్న కళను ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా ఓ అడుగు ముందుకు వేసి ఈ దృశ్యాలను ఉపాధి సిబ్బందిలో ఒకరు సామాజిక మాధ్యమాలలో ఒకటైన ఫేస్బుక్లో పెట్టారు. ఈ వీడియో క్లిప్పింగ్ మీడియా ప్రతినిధులకు చిక్కింది. ఈ మేరకు వీడియోను లీక్ చేయకుండా ఉండాలంటే కొంత మొత్తం ఇవ్వాలని మీడియా ప్రతినిధులు(సాక్షి కాదు) ఉపాధి సిబ్బందికి డిమాండ్ చేశారు. దీనికి ఉపాధి సిబ్బంది అంగీకరించకపోవడంతో విషయం కాస్త ఆలస్యంగా శుక్రవారం బయటకొచ్చింది. ఆరుగురు ఉద్యోగులు సస్పెన్షన్ మండల కేంద్రంలోని స్థానిక ఉపాధి హామీ పథకంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆరుగురు సిబ్బంది విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు విజయనగరం జిల్లా నీటియాజమాన్య సంస్థ పధక సంచాలకులు ఆర్.రాజగోపాలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో జి.పార్వతి తెలిపారు. ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ విధులను నిర్వహిస్తున్న సమయంలో మద్యంను సేవించి, చిందులు వేసినట్లు వచ్చిన ఆరోపణలు భాగంగా ప్రాథమిక విచారణ ఆధారంగా తొలగించినట్టు పేర్కొన్నారు. సస్పెండ్‌కు గురైన వారిలో ఏపీవో టి.రామకృష్ణనాయుడు, సాంకేతిక సహయకులు పి.పోలారావు, సిహెచ్.వెంకటేష్, ఎం.రమణ, కంప్యూటర్ ఆపరేటర్ ఎ.శంకరరావు, జేఈ వైఆర్‌డీ ప్రసాద్‌లున్నారు. ఇదిలా వుండగా విధులలో బాధ్యతా రహితంగా వ్యవహరించిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు సస్పెండ్ కొనసాగుతుందని ఎంపీడీవో తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్, సాంకేతిక సహాయకులు చిందులు వేసినప్పటికీ, సిబ్బందిని క్రమశిక్షణలో ఉంచలేని ఏపీవో, జేఈలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. -
చిచ్చు రాజేసిన సస్పెన్షన్లు
సాక్షి, వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూ రికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులను వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సస్పెండ్ చేయడంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు గురువారం నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు విధులు బహిష్కరించటంతో రెవెన్యూ పాలన పూర్తిగా స్థంభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని శ్రీరంగాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ శ్వేతా మహంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోవటం, చెక్కుల కంటే పాస్‌పుస్తకాలు తక్కువగా పంపిణీ చేయటం ఏమిటని తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్ఓ వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆదివారం రోజు ప్రత్యేక పనిదినంగా ఎందుకు విధులు నిర్వర్తించలేదని వీఆర్ఓ వెంకటరమణతో పాటు ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవటానికి ఆదేశించడమే కాకుండా కలెక్టర్ తమను దుర్భాషలాడినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఐదు రోజుల క్రితం ఆత్మకూరు జూరాల వీఆర్ఓ, గోపాల్పేట మండలం బుద్దారం వీఆర్ఓలను కూడా సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఏకతాటిపైకి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు సస్పెన్షన్లతో ఆవేదన చెందిన రెవెన్యూ ఉద్యోగులు గురువారం ఏకతాటిపైకి వచ్చారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరంగాపురం తహసీల్దార్ మాట్లాడుతూ బుధవారం రాత్రి కలెక్టర్ శ్వేతా మహంతి తనను చిన్నపిల్లాడి మాదిరిగా దుర్భాషలాడారని చెబుతూ కంట తడి పెట్టుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నిరసన శిబిరం వద్ద కలెక్టర్ జిందాబాద్ అంటూ వారు నినాదాలు చేయడం గమనార్హం. -
భారీ స్కాం : 10 మంది బ్యాంకు ఉద్యోగులు సస్పెండ్
దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ముంబై బ్రాంచులో దాదాపు రూ.11,359 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు తేల్చింది. డైమండ్ మెర్చంట్ నిరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, బిజినెస్ పార్టనర్ మెహల్ చోక్సి ఈ స్కాంకు పాల్పడినట్టు బ్యాంకు ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో భాగంగా 10 మంది ఉద్యోగులను పీఎన్బీ సస్పెండ్ చేసినట్టు బ్యాంకింగ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. దీనిపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సీబీఐ విచారణ చేపట్టింది. మొండి బకాయిలను గుర్తించడానికి ఈ విచారణ సహకరిస్తుందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం ముంబైలోని ఓ బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ నగదును విదేశీ అకౌంట్లకు తరలించినట్టు కూడా ధృవీకరించింది. ఈ కుంభకోణం వల్ల బ్యాంకుకు ఏ మేర నష్టం వాటిల్లుతుందో పీఎన్బీ వెల్లడించలేదు. కాగ, ఇదే బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జువెల్లరీ నిరవ్ మోదీని గతవారమే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ నష్టాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు ఈ వార్తల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు బుధవారం మధ్యాహ్నం అమాంతం పడిపోయాయి. పీఎన్బీ ముంబయి బ్రాంచ్‌లో దాదాపు రూ.11,359 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. రూ.160 షేరు విలువతో బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభించిన పీఎన్బీ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8శాతం పడిపోయింది. ప్రస్తుతం ఆ బ్యాంక్ షేరు విలువ రూ.150 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు షేర్లు ఈ మేర నష్టపోతుండటంతో, పీఎన్బీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.3వేల కోట్ల సంపదను కోల్పోయారు. -
అవినీతికి ఆపరేషన్
టౌన్‌ప్లానింగ్‌లో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు టీపీఎస్‌లు అక్టోబర్ 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత విజయవాడ సెంట్రల్ : విజయవాడ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతికి శస్త్రచికిత్స మొదలైంది. ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ల(టీపీఎస్)పై టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.రఘు సస్పెన్షన్ వేటు వేశారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఆష, లక్ష్మీజ్యోతి. టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు జి.వెంకటేశ్వరరావు, కృష్ణ, ప్రవీణ్‌లను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ నిర్మాణాల్లో వీరి పాత్రపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం ఇక్కడకు వచ్చిన తిమ్మారెడ్డి అధికారులతో రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు సాగించారు. ఏం చేసినా చర్యలుండవనే ధీమా పెరిగిపోవడం వల్లే టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి పెరిగిందని దీనికి ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని తిమ్మారెడ్డి గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం తిరిగి మళ్లీ డెర్టైర్తో భేటీ అయ్యారు. మొదటి విడత సస్పెన్షన్ల పర్వం పూర్తవ్వగా రెండో విడతలో మరో ముగ్గురిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాఘటన టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో కలకలం రేపింది.బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, వెంకటేశ్వరరావులు ఐదు నెలల క్రితమే పదోన్నతిపై ఇక్కడ నుంచి బదిలీ అయ్యారు. పుష్కరాల ముసుగులో డెరైక్టరేట్లో లాబీయింగ్ చేసి ఓడీ తెచ్చుకున్నారు. పుష్కర విధులు పూర్తయిన నేపథ్యంలో కమిషనర్ జి.వీరపాండియన్ రిలీవ్ చేశారు. ప్రవీణ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాల్టీకి టీపీఎస్‌గా వెళ్లారు. పదోన్నతి వచ్చినా టౌన్‌ప్లానింగ్‌ను వదలడం ఇష్టం లేని జి.వెంకటేశ్వరరావు ఓడీ తెచ్చుకొని ఇక్కడే కొనసాగుతున్నారు. ఓడీ వ్యవహారంపై తిమ్మారెడ్డి మండిపడ్డట్లు తెలుస్తోంది. తాఖీదులు రెడీ ... అక్రమ భవన నిర్మాణదారులకు టౌన్‌ప్లానింగ్ అధికారులు తాఖీదులు సిద్ధం చేస్తున్నారు. తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు నగరంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. వారం రోజుల ముందస్తు నోటీసుల్ని రూపొందిస్తున్నారు. మొదటి విడతలో 200 చదరపు గజాల విస్తీర్ణం ఆపైన వాటికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దసరా ముందు కూల్చివేతలు చేపడితే భవన నిర్మాణదారుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన అధికారులు అక్టోబర్ 17 నుంచి అక్రమ కట్టడాలను కూల్చేయాలని ముహూర్తంగా నిర్ణయించారు. -
ఆయాలా.. దయ్యాలా..
♦ పసివాళ్ల చేతులపై వాతలు పెట్టిన వైనం ♦ కరీంనగర్‌లోని శిశుగృహలో దారుణం ♦ తీవ్రంగా స్పందించిన కలెక్టర్ ♦ ఆయాలు, సిబ్బంది తొలగింపు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పసివాళ్లు.. అన్నెం పున్నెం ఎరగని అనాథలు... కన్నపేగులను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోతే చేరదీసిన శిశుగృహే వారికి దిక్కయింది. ఆరు రోజుల క్రితం అందులో పనిచేసే ఆయాలకు ఉన్నట్టుండి ఏమైందో ఏమో... ఒక్కసారిగా శాడిస్టుల్లా మారారు. చెంచాను స్టవ్‌పై వేడి చేసి పిల్లల చేతులపై వాతలు పెట్టారు. మరుసటి రోజు సాయంత్రం సామాజిక కార్యకర్త వచ్చి చూసే వరకు వారికి కనీసం చికిత్స అందించిన పాపాన పోలేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఎనిమిది మంది పిల్లలున్నారు. అందులో ఒకరు మూడు నెలల పసిబాబు మోక్ష. మిగిలిన ఏడుగురు రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు వారే. ఈనెల 15న సాయంత్రం 7.30 గంటలకు ఆ ఏడుగురు పిల్లలను ఆయూలు బుచ్చవ్వ, పద్మ ఒకే చోట కూర్చోబెట్టారు. ప్లేట్లలో అన్నం, కూర వడ్డించి వాళ్ల ముందు పెట్టారు. ఆ పిల్లలే చక్కగా అన్నం కలుపుకుని తింటుండగా, 10 నిమిషాల తరువాత ఆయా బుచ్చవ్వ స్టవ్ వెలిగించి చెంచా వేడి చేసింది. ఇద్దరూ కలిసి వరుసగా ఆ ఏడుగురు పిల్లల చేతులపై వాతలు పెట్టారు. ఇందులో ఐదేళ్ల గీత, ధనలక్ష్మీతోపాటు రెండేళ్ల రాజన్ చేతులపై గాయూలు కాగా.. మిగిలిన వారికి చిన్నపాటి గాయూలయ్యూరుు. గీత చేతిపై బొబ్బలొచ్చి పుండుగా మారింది. మరుసటి రోజు ఏడుస్తూనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన పిల్లలు సాయంత్రం 4 గంటలకు శిశుగృహకు చేరుకున్నారు. సామాజిక కార్యకర్త శ్రీలత పిల్లలకు వాతలను గమనించి వెంటనే వారిని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్లు వేయించారు. జరిగిన దారుణాన్ని శిశుగృహ మేనేజర్‌తోపాటు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ పీడీ ఎస్.మోహన్‌రెడ్డి సైతం ఈ దారుణంపై స్పందించలేదు. ఆయూలకు మెమోలు జారీ చేతులు దులుపుకున్నారు. చివరకు ఈ దారుణం బుధవారం బయటపడటంతో కలెక్టర్ నీతూప్రసాద్ శిశుగృహను సందర్శించి చిన్నారులను పరామర్శించారు. చిన్నారుల చేతులపై గాయూలు చూసి చలించిపోయారు. ఐసీడీఎస్ పీడీ సరెండర్ పిల్లల చేతులపై వాతలు పెట్టిన ఇద్దరితోపాటు మరో ఆయూను తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసుపెట్టి అరెస్టు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులకు, పోలీసులను ఆదేశించారు. శిశుగృహ మేనేజర్ దేవారావు, ఇతర సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తున్నందున వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఆయనను విధుల నుంచి తప్పించి హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తున్నట్లు తెలిపారు. పట్టించిన సీసీ కెమెరాలు: శిశుగృహలోని గదుల్లో గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఆయాల దురాగతం బయటపడింది. చిన్నారుల చేతులపై ఆయాలు వాతలు పెట్టిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శిశుగృహలో జరిగిన దారుణంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు సీరియస్‌గా పరిగణిస్తూ కేసును సుమోటోగా స్వీకరించారు. విచారణ జరిపి మే 2లోగా నివేదిక పంపాలని కలెక్టర్‌కు నోటీసు పంపారు. లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శి భవానీచంద్ర సైతం బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.