సాక్షి, వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూ రికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులను వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సస్పెండ్ చేయడంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు గురువారం నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు విధులు బహిష్కరించటంతో రెవెన్యూ పాలన పూర్తిగా స్థంభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని శ్రీరంగాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ శ్వేతా మహంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోవటం, చెక్కుల కంటే పాస్‌పుస్తకాలు తక్కువగా పంపిణీ చేయటం ఏమిటని తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్‌ఓ వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఆదివారం రోజు ప్రత్యేక పనిదినంగా ఎందుకు విధులు నిర్వర్తించలేదని వీఆర్‌ఓ వెంకటరమణతో పాటు ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవటానికి ఆదేశించడమే కాకుండా కలెక్టర్ తమను దుర్భాషలాడినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఐదు రోజుల క్రితం ఆత్మకూరు జూరాల వీఆర్‌ఓ, గోపాల్‌పేట మండలం బుద్దారం వీఆర్‌ఓలను కూడా సస్పెండ్ చేసినట్లు సమాచారం.
ఏకతాటిపైకి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు
సస్పెన్షన్లతో ఆవేదన చెందిన రెవెన్యూ ఉద్యోగులు గురువారం ఏకతాటిపైకి వచ్చారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరంగాపురం తహసీల్దార్ మాట్లాడుతూ బుధవారం రాత్రి కలెక్టర్ శ్వేతా మహంతి తనను చిన్నపిల్లాడి మాదిరిగా దుర్భాషలాడారని చెబుతూ కంట తడి పెట్టుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నిరసన శిబిరం వద్ద కలెక్టర్ జిందాబాద్ అంటూ వారు నినాదాలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment