Land records purging
-
ఇదో రకం...‘భూకంపం’
సాక్షి, హైదరాబాద్: స్వాదీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరుంటేనే భూ హక్కుకి భద్రత. రాష్ట్రంలో అలా ఉన్న భూ యజమానులు పది శాతంలోపే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అదే భూ రికార్డుల ప్రక్షాళన. సమస్యలన్నీ వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఆచరణలో హడావుడి ప్రదర్శించింది. అయితే రెండేళ్లయినా.. భూ రికార్డుల నవీకరణ కొలిక్కిరాలేదు. అన్ని సమస్యలు పరిష్కారం కాకపోగా.. అపరిష్కృత సమస్యలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతిమంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షిత కౌలుదారు, ఇనాం, సీలింగ్ చట్టాలపై స్పష్టత లేకపోవడంతో రైతులను తహసీల్దార్ల చుట్టూ తిరిగేలా చేస్తోంది. సాంకేతిక సమస్యలు సరేసరి. ఇటు రైతులు.. అటు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వ్యవహారం పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. చిక్కుముడిగా ‘పార్ట్–బీ’ వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం వాటికి పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేయలేదు. ఈ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు కూడా నిలిపేసింది. పెట్టుబడి సాయానికి పాస్‌బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,43,983 ఖాతాల్లోని సుమారు 4 లక్షల ఎకరాల మేర భూములను పరిగణనలోకి తీసుకోలేదు. పార్ట్–బీ కేటగిరీలో కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు–పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవి ఇందులో నమోదు చేసింది. భూ రికార్డుల నవీకరణకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం, ఖరీఫ్‌లోపు కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేసి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఒత్తిడి మూలంగా క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించలేదు సరికదా ఎవరైనా అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ ఇస్తే చాలు పార్ట్–బీలో చేర్చింది. ఇదే ఇప్పుడు రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఎడిట్‌కు అనుమతి ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ప్రతి చిన్నదానికి జేసీకి అప్పీల్‌కు చేసుకోవాల్సిరావడంతో కుప్పలు తెప్పలుగా ఫైళ్లు పేరుకుపోయాయి. రెండేళ్ల తర్వాత మేలుకున్న ప్రభుత్వం ఇటీవలనే ఆర్డీఓలకు ఎడిట్ ఆప్షన్ ఇచి్చంది. పారాచూట్‌లా.. వాలారు! భూ రికార్డుల గందరగోళంలో ప్రధాన పాత్ర వక్ఫ్, దేవాదాయ, భూదాన్ బోర్డు, అటవీ శాఖలదే. ఇన్నాళ్లు కనీసం గ్రామ, మండలం, జిల్లా స్థాయిల్లో రికార్డులను అప్డేట్ చేయని ఈ విభాగాలు భూ రికార్డుల ప్రక్షాళన మొదలుకాగానే.. బూజుపట్టిన గెజిట్ నోటిఫికేషన్లతో వాలాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతాంగాన్ని కాదని.. ఈ భూమి తమదేనని పేచీ పెట్టాయి. చట్ట ప్రకారం ఈ భూమి ఆయా విభాగాలకే చెందుతుందని 22 (ఏ) కేటగిరీలో (ప్రభుత్వ భూములుగా) నమోదు చేసింది. ఇన్నాళ్లు తమ అ«దీనంలో ఉన్న భూమిని తన్నుకుపోవడంతో దిక్కుతోచని రైతాంగం తహశీల్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇక సాంకేతిక లోపాలు కూడా రికార్డుల ప్రక్షాళనకు చెడ్డపేరు తెచి్చపెట్టాయి. తప్పుల తడకగా నమోదు చేసిన పేర్లను సవరించే వెసులుబాటు లేకపోవడం.. మ్యుటేషన్ జరిగినా... మూడు నెలల వరకు పాస్‌బుక్ చేతికి రాకపోవడం కూడా చికాకు కలిగించింది. నాలుగేళ్లుగా పహణీలోకి ఎక్కించడం లేదు.. ‘1981లో శివలింగం రామయ్య వద్ద నుంచి సర్వే నం.689, 690/2లలో 2.19 ఎకరాలను కొన్నాం. అప్పటినుంచి సాగు చేస్తున్నాం. 2009లో నాన్న చౌకి బాలయ్య నుంచి నా పేరిట మారి్పడి చేసుకున్నాను. పాస్ పుస్తకం వచి్చంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా విదేశాలకు వెళ్లి వస్తున్నాను. భూమి ఎక్కడికి పోతుందనే ఉద్దేశంతో భూమి వద్దకు వెళ్లి చూడలేదు. 2010లో 689 సర్వేనంబర్‌లో 1.04 ఎకరాల భూమిని సదాశివనగర్‌కు చెందిన సుతారి రాజమణి పేరు మీద సాదాబైనామా చేసినట్లు ఉంది. అదే 690/2 సర్వే నంబర్లో 1.15 ఎకరాలను సుతారి సుధాకర్ పేరు మీద పట్టా చేశారు. ఈ భూమిని నా పేరు మీదికి మార్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కొన్నాళ్లుగా తిరుగుతున్నాను. పాస్ పుస్తకమున్న పహణీలోకి ఎక్కించడం లేదు. సమస్యను జేసీకి వివరించినా రికార్డుల్లో సరిచేయడం లేదు.’ – చౌకి భాస్కర్, సదాశివనగర్, కామారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన కనువిప్పు కావాలి సమస్యలకు పరిష్కారం.. చంపడమో, చావడమో కాకూడదు. భూ సమస్యల పరిష్కారానికి, మెరుగైన భూపరిపాలన కోసం తక్షణ చర్యలు అవసరం. అలా జరగకపోతే, రైతుల కష్టాలు తీరవు. రెవెన్యూ ఇక్కట్లు తొలగవు. ఏ భూరికార్డు భూమిపై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ భూమి రికార్డునైనా ఎప్పుడైనా సవరించవచ్చు. భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. ఉన్న భూములకు హద్దు రాళ్లు లేవు. భూ సమస్యలపై ఎవరిని కలవాలి.. ఎంతకాలంలో ఆ సమస్యను పరిష్కరించాలి అనే విషయాలపై స్పష్టత లేదు. అపరిష్కృత భూ సమస్యలకు ఎన్నో కారణాలు.. అన్ని కోణాలు చూడాలి.. సమస్యకు సమగ్ర పరిష్కారం వెతకాలి. భూమి సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషాద ఘటనలు, హత్యలకు కూడా దారితీస్తున్న దుర్ఘటనలు.. మరోపక్క తీవ్ర ఒత్తిడిలో రెవెన్యూ యంత్రాంగం. ఇకనైనా పరిష్కారాలపై చర్చ జరగాలి. అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన ఒక కనువిప్పు కావాలి. – ఎం.సునీల్ కుమార్, భూచట్టాల నిపుణుడు, న్యాయవాది క్రమబద్ధీకరణతో వివాదాలకు ఫుల్స్టాప్ భూ రికార్డుల ప్రక్షాళనతో ప్రభుత్వం తేనె తుట్టెను కదిలించింది. రికార్డుల నవీకరణ కంటే ముందు సమగ్ర భూసర్వే చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావు. దేవాదాయ, వక్ఫ్, అటవీ, భూదాన్ బోర్డులు ఇన్నాళ్లు తమ భూములెక్కడ ఉన్నాయో పట్టించుకోకుండా.. ఒకేసారి ఈ భూములన్నీ మావేనని వాదించడం అత్యధిక వివాదాలకు కారణం. దశాబ్దాలుగా ఆ భూమిని అనుభవిస్తూ... పాస్బుక్కు కలిగి ఉన్నవారిని కాదని.. 22(ఏ)లో ఆ భూమిని చేర్చడం ఎంతవరకు న్యాయం. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారి పేరిట క్రమబద్ధీకరిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. రైతాంగానికి లాభం కలుగుతుంది. – సురేశ్ పొద్దార్, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్) రికార్డుల ప్రక్షాళనలో ఒత్తిడి ఎక్కువైంది.. రికార్డుల ప్రక్షాళన మొదలైన నుంచి రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినప్పటికీ సమయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రక్షాళనకు డెడ్లైన్లు విధించడంతో సిబ్బంది ఒత్తిడికి గురయ్యారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి సరిపడా సమయం దొరకలేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే వినాల్సి వచి్చంది. రికార్డులో సాదాబైనామాలకు సంబంధించి తప్పుడు కాగితాలతో చాలా మంది భూములను తమపేరిట నమోదు చేయించుకునే ప్రయత్నాలు చేశారు. దానికి తోడు రాజకీయ జోక్యం కూడా ఉండటం ఒత్తిడిని పెంచింది. – సత్తయ్య, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్) సమస్యకు పరిష్కారాలు.. సమగ్ర భూ సర్వే జరగాలి. భూచట్టాలను సమీక్షించి ఒక సమగ్ర రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలి. టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి. భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో భూరికార్డుల సవరణ చేయాలి. భూ సమస్యలున్న పేదవారికి సహాయం చేసే పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను కొనసాగించాలి. -
చిచ్చు రాజేసిన సస్పెన్షన్లు
సాక్షి, వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూ రికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులను వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సస్పెండ్ చేయడంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు గురువారం నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు విధులు బహిష్కరించటంతో రెవెన్యూ పాలన పూర్తిగా స్థంభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని శ్రీరంగాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ శ్వేతా మహంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోవటం, చెక్కుల కంటే పాస్‌పుస్తకాలు తక్కువగా పంపిణీ చేయటం ఏమిటని తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్ఓ వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆదివారం రోజు ప్రత్యేక పనిదినంగా ఎందుకు విధులు నిర్వర్తించలేదని వీఆర్ఓ వెంకటరమణతో పాటు ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవటానికి ఆదేశించడమే కాకుండా కలెక్టర్ తమను దుర్భాషలాడినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఐదు రోజుల క్రితం ఆత్మకూరు జూరాల వీఆర్ఓ, గోపాల్పేట మండలం బుద్దారం వీఆర్ఓలను కూడా సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఏకతాటిపైకి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు సస్పెన్షన్లతో ఆవేదన చెందిన రెవెన్యూ ఉద్యోగులు గురువారం ఏకతాటిపైకి వచ్చారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరంగాపురం తహసీల్దార్ మాట్లాడుతూ బుధవారం రాత్రి కలెక్టర్ శ్వేతా మహంతి తనను చిన్నపిల్లాడి మాదిరిగా దుర్భాషలాడారని చెబుతూ కంట తడి పెట్టుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నిరసన శిబిరం వద్ద కలెక్టర్ జిందాబాద్ అంటూ వారు నినాదాలు చేయడం గమనార్హం. -
గ్రామస్థాయి నుంచి పోరాటం
సర్కారును నిలదీసేందుకు కాంగ్రెస్ ప్రణాళిక ► భూ రికార్డుల ప్రక్షాళన, హామీలపై గ్రామసభల్లో నిలదీత ► ప్రతీ గ్రామం నుంచి ముగ్గురికి శిక్షణ ► ఈ నెల 18 నుంచి 22 దాకా శిబిరాలు ► మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలో ముగ్గురికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి 22 దాకా పాత జిల్లా కేంద్రాల్లో గ్రామానికి ముగ్గురు నాయకులను ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలతో ఏర్పాటు చేయనున్న రైతు సంరక్షణ సమితులు వంటి అంశాలపై వీరికి అవగాహన కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల్లో మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని టీపీసీసీ సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భూ రికార్డుల సవర ణలు, భూ సర్వే వంటివాటిపై సంబంధిత రెవెన్యూ అంశాలు, చట్టాల గురించి పార్టీ నేతలకు వివరిస్తారు. టీఆర్ఎస్ హామీల్లో ప్రధానమైన.. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై గ్రామసభల్లోనే ఒత్తిడి చేయడానికి అనువుగా పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న రైతు సమన్వయ సమితులకు ప్రత్యామ్నాయంగా రైతు సంరక్షణ కమిటీల కూర్పు వంటివాటిపై శిక్షణ ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల నుంచి గ్రామస్థాయి నేతలను ఎంపిక చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయిం చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, శిక్షణవిభాగం కన్వీనర్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ నేతలు శిక్షణా శిబిరాల్లో పాల్గొంటారు. 18న కరీంనగర్, మెదక్, 19న ఆదిలాబాద్, నిజామాబాద్, 20న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, 21న ఖమ్మం, నల్లగొండ, 22న వరంగల్ పాతజిల్లా కేంద్రాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై చర్చించడానికి శుక్రవారం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సింగరేణి కోసం 3 సభలు సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు బహిరంగసభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. 22న భూపాలపల్లి, 23న రామగుండం, 24న మంచిర్యాలలో సింగరేణి కార్మికులతో బహిరంగసభలను నిర్వహించనున్నారు. తెలంగాణరాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర, ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వైఖరిపై ఈ సభల్లో ఎండగట్టనున్నారు. -
సేత్వారీ స్కాన్ ఇండెక్స్ సగమే
♦ ఇప్పటివరకు 5 వేల గ్రామాల్లోనే పూర్తి ♦ 3,942 గ్రామాలకు సేత్వారీలే లేవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ రికార్డుల ప్రక్షాళనకు కీలకమైన సేత్వారి స్కాన్ ఇండెక్స్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. సేత్వారీలు (భూమి వివరాలుండే పత్రం) అందుబాటులో ఉన్న గ్రామాల్లో ఈ ప్రక్రియను ల్యాండ్ సర్వే శాఖ అధికారులు చురుగ్గానే చేస్తున్నా, కొన్ని గ్రామాల్లో సేత్వారీలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. దీంతో కొన్ని చోట్ల ఖస్రా పహాణీలు, మరికొన్ని చోట్ల చెస్సలా పహాణీలు స్కానింగ్ చేస్తున్నారు. దాదాపు నాలుగు నెలల క్రితం ప్రారంభమయిన ఈ స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెపుతున్నారు. 6 వేల పైచిలుకు గ్రామాల్లోనే... రాష్ట్రంలో 10,878 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇందులో సేత్వారీ స్కాన్ ఇండెక్స్‌లు కేవలం 6,936 గ్రామాల్లోనే ఉన్నాయని ల్యాండ్ సర్వే అధికారులు చెబుతున్నారు. ఈ సేత్వారీలున్న గ్రామాల్లో 4,950 చోట్ల ఇండెక్స్ స్కానింగ్ పూర్తయింది. అంటే ఫలానా సర్వే నంబర్లో ఎంత భూమి ఉందనే వివరాలతో పాటు పహాణి, మ్యాపు, కొలతలు, రిజిస్ట్రేషన్లకు అవసరమైన ఈసీ రికార్డులను కూడా దీనిలో పొందుపరిచారు. ఏదైనా సర్వే నంబర్‌ను క్లిక్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఒకేచోట లభ్యమయ్యేలా వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మరో 1,986 గ్రామాల్లో సేత్వారీల ఇండెక్స్ స్కానింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. సేత్వారీలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 3,942 గ్రామాల్లో సేత్వారీలు లేవు. దాదాపు 80 ఏళ్ల క్రితం ఇచ్చిన సేత్వారీలు చినిగిపోవడం, స్కానింగ్‌కు అనుకూలంగా లేకపోవడం, కొన్ని చోట్ల అసలు లేకపోవడంతో ఇప్పుడు ఖస్రా పహాణీల స్కానింగ్ చేస్తున్నారు. అవి కూడా లభ్యంకాని సర్వే నంబర్లకు చెస్సలా పహాణీలను స్కాన్ చేస్తున్నామని సర్వే, ల్యాండ్ సెటిల్మెంట్స్ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సేత్వారీలు అందు బాటులో లేని కారణంగా కొంత జాప్యం జరిగిందని ఈ ప్రక్రియను మరో నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రక్షాళనలో ఇదే కీలకం కాగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఈ సేత్వారీ స్కాన్ ఇండెక్స్ కీలకం కానుంది. సేత్వారీలు, పహాణీలను స్కాన్ చేసి, భూముల అన్ని వివరాలను ఒక్క క్లిక్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రక్షాళన ప్రక్రియను సులభతరం చేసే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఒక్కో సర్వే నంబర్‌ను ఈ స్కానింగ్‌లోనే పరిశీలించి, వివాదాలు ఏర్పడిన భూముల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి రికార్డులను తనిఖీ చేసే అవకాశం ఉంటుందని, సేత్వారీ, ఖస్రా, చెస్సలా పహాణీల స్కానింగ్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా భూ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు కూడా జరగకుండా నియంత్రించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన కంటే ముందే ఈ స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెడితే మంచి ఫలితాలు రావచ్చని అంచనా. సేత్వారీ... భూ భగవద్గీత రాష్ట్రంలో దాదాపు 36.42 లక్షల ప్రధాన సర్వే నంబర్లలో భూములున్నాయి.మళ్లీ ఈ సర్వే నంబర్లలో దాదాపు 1.90 కోట్ల బైనంబర్లు వచ్చాయి. నిజాం హయాంలో జరిగిన సర్వేలో ప్రధాన సర్వే నంబర్లన్నింటికీ సేత్వారీలు జారీ చేశారు. ఈ సేత్వారీలలో భూమికి సంబంధించిన అన్ని వివరాలూ ఉంటాయి. ఫలానా సర్వే నంబర్లోని భూమి ప్రభుత్వానిదా.. ఇనాం భూమా... పట్టా భూమా అనే అంశాల నుంచి.. ఆ సర్వే నంబర్లో మొత్తం ఎంత భూమి ఉంది.. అందులో సాగుకు యోగ్యం కానిది ఎంత అనే వివరాలుండే పత్రం ఇది. సాగు చేసే భూమికి సేత్వారీలోనే గ్రేడ్లు ఉంటాయి. గతంలో ఈ గ్రేడ్ల ఆధారంగానే ఆయా భూములకు ధరలు కూడా నిర్ణయించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే భూ రికార్డులకు సేత్వారీని భగవద్గీతగా పేర్కొంటారు. అప్పట్లో తయారుచేసిన సేత్వారీలు అన్ని గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో వాటి ఆధారంగా తయారు చేసిన పహాణీలను ఇప్పుడు స్కాన్ చేసి భద్రపరుస్తున్నారు.