గ్రామస్థాయి నుంచి పోరాటం
సర్కారును నిలదీసేందుకు కాంగ్రెస్ ప్రణాళిక
► భూ రికార్డుల ప్రక్షాళన, హామీలపై గ్రామసభల్లో నిలదీత
► ప్రతీ గ్రామం నుంచి ముగ్గురికి శిక్షణ
► ఈ నెల 18 నుంచి 22 దాకా శిబిరాలు
► మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలో ముగ్గురికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి 22 దాకా పాత జిల్లా కేంద్రాల్లో గ్రామానికి ముగ్గురు నాయకులను ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, టీఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలతో ఏర్పాటు చేయనున్న రైతు సంరక్షణ సమితులు వంటి అంశాలపై వీరికి అవగాహన కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల్లో మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని టీపీసీసీ సంకల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భూ రికార్డుల సవర ణలు, భూ సర్వే వంటివాటిపై సంబంధిత రెవెన్యూ అంశాలు, చట్టాల గురించి పార్టీ నేతలకు వివరిస్తారు. టీఆర్‌ఎస్ హామీల్లో ప్రధానమైన.. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై గ్రామసభల్లోనే ఒత్తిడి చేయడానికి అనువుగా పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న రైతు సమన్వయ సమితులకు ప్రత్యామ్నాయంగా రైతు సంరక్షణ కమిటీల కూర్పు వంటివాటిపై శిక్షణ ఇవ్వనుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల నుంచి గ్రామస్థాయి నేతలను ఎంపిక చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయిం చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, శిక్షణవిభాగం కన్వీనర్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ నేతలు శిక్షణా శిబిరాల్లో పాల్గొంటారు. 18న కరీంనగర్, మెదక్, 19న ఆదిలాబాద్, నిజామాబాద్, 20న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, 21న ఖమ్మం, నల్లగొండ, 22న వరంగల్ పాతజిల్లా కేంద్రాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై చర్చించడానికి శుక్రవారం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.
సింగరేణి కోసం 3 సభలు
సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు బహిరంగసభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. 22న భూపాలపల్లి, 23న రామగుండం, 24న మంచిర్యాలలో సింగరేణి కార్మికులతో బహిరంగసభలను నిర్వహించనున్నారు. తెలంగాణరాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర, ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ వైఖరిపై ఈ సభల్లో ఎండగట్టనున్నారు.