సాక్షి, హైదరాబాద్: స్వాదీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరుంటేనే భూ హక్కుకి భద్రత. రాష్ట్రంలో అలా ఉన్న భూ యజమానులు పది శాతంలోపే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అదే భూ రికార్డుల ప్రక్షాళన. సమస్యలన్నీ వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఆచరణలో హడావుడి ప్రదర్శించింది. అయితే రెండేళ్లయినా.. భూ రికార్డుల నవీకరణ కొలిక్కిరాలేదు. అన్ని సమస్యలు పరిష్కారం కాకపోగా.. అపరిష్కృత సమస్యలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతిమంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షిత కౌలుదారు, ఇనాం, సీలింగ్ చట్టాలపై స్పష్టత లేకపోవడంతో రైతులను తహసీల్దార్ల చుట్టూ తిరిగేలా చేస్తోంది. సాంకేతిక సమస్యలు సరేసరి. ఇటు రైతులు.. అటు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వ్యవహారం పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది.
చిక్కుముడిగా ‘పార్ట్–బీ’
వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం వాటికి పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేయలేదు. ఈ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు కూడా నిలిపేసింది. పెట్టుబడి సాయానికి పాస్‌బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,43,983 ఖాతాల్లోని సుమారు 4 లక్షల ఎకరాల మేర భూములను పరిగణనలోకి తీసుకోలేదు. పార్ట్–బీ కేటగిరీలో కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు–పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవి ఇందులో నమోదు చేసింది. భూ రికార్డుల నవీకరణకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం, ఖరీఫ్‌లోపు కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేసి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఒత్తిడి మూలంగా క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించలేదు సరికదా ఎవరైనా అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ ఇస్తే చాలు పార్ట్–బీలో చేర్చింది. ఇదే ఇప్పుడు రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఎడిట్‌కు అనుమతి ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ప్రతి చిన్నదానికి జేసీకి అప్పీల్‌కు చేసుకోవాల్సిరావడంతో కుప్పలు తెప్పలుగా ఫైళ్లు పేరుకుపోయాయి. రెండేళ్ల తర్వాత మేలుకున్న ప్రభుత్వం ఇటీవలనే ఆర్డీఓలకు ఎడిట్ ఆప్షన్ ఇచి్చంది.
పారాచూట్‌లా.. వాలారు!
భూ రికార్డుల గందరగోళంలో ప్రధాన పాత్ర వక్ఫ్, దేవాదాయ, భూదాన్ బోర్డు, అటవీ శాఖలదే. ఇన్నాళ్లు కనీసం గ్రామ, మండలం, జిల్లా స్థాయిల్లో రికార్డులను అప్‌డేట్ చేయని ఈ విభాగాలు భూ రికార్డుల ప్రక్షాళన మొదలుకాగానే.. బూజుపట్టిన గెజిట్ నోటిఫికేషన్లతో వాలాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతాంగాన్ని కాదని.. ఈ భూమి తమదేనని పేచీ పెట్టాయి. చట్ట ప్రకారం ఈ భూమి ఆయా విభాగాలకే చెందుతుందని 22 (ఏ) కేటగిరీలో (ప్రభుత్వ భూములుగా) నమోదు చేసింది. ఇన్నాళ్లు తమ అ«దీనంలో ఉన్న భూమిని తన్నుకుపోవడంతో దిక్కుతోచని రైతాంగం తహశీల్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇక సాంకేతిక లోపాలు కూడా రికార్డుల ప్రక్షాళనకు చెడ్డపేరు తెచి్చపెట్టాయి. తప్పుల తడకగా నమోదు చేసిన పేర్లను సవరించే వెసులుబాటు లేకపోవడం.. మ్యుటేషన్ జరిగినా... మూడు నెలల వరకు పాస్‌బుక్ చేతికి రాకపోవడం కూడా చికాకు కలిగించింది.
నాలుగేళ్లుగా పహణీలోకి ఎక్కించడం లేదు..
‘1981లో శివలింగం రామయ్య వద్ద నుంచి సర్వే నం.689, 690/2లలో 2.19 ఎకరాలను కొన్నాం. అప్పటినుంచి సాగు చేస్తున్నాం. 2009లో నాన్న చౌకి బాలయ్య నుంచి నా పేరిట మారి్పడి చేసుకున్నాను. పాస్ పుస్తకం వచి్చంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా విదేశాలకు వెళ్లి వస్తున్నాను. భూమి ఎక్కడికి పోతుందనే ఉద్దేశంతో భూమి వద్దకు వెళ్లి చూడలేదు. 2010లో 689 సర్వేనంబర్‌లో 1.04 ఎకరాల భూమిని సదాశివనగర్‌కు చెందిన సుతారి రాజమణి పేరు మీద సాదాబైనామా చేసినట్లు ఉంది. అదే 690/2 సర్వే నంబర్‌లో 1.15 ఎకరాలను సుతారి సుధాకర్ పేరు మీద పట్టా చేశారు. ఈ భూమిని నా పేరు మీదికి మార్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కొన్నాళ్లుగా తిరుగుతున్నాను. పాస్ పుస్తకమున్న పహణీలోకి ఎక్కించడం లేదు. సమస్యను జేసీకి వివరించినా రికార్డుల్లో సరిచేయడం లేదు.’ – చౌకి భాస్కర్, సదాశివనగర్, కామారెడ్డి జిల్లా
అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన కనువిప్పు కావాలి
సమస్యలకు పరిష్కారం.. చంపడమో, చావడమో కాకూడదు. భూ సమస్యల పరిష్కారానికి, మెరుగైన భూపరిపాలన కోసం తక్షణ చర్యలు అవసరం. అలా జరగకపోతే, రైతుల కష్టాలు తీరవు. రెవెన్యూ ఇక్కట్లు తొలగవు. ఏ భూరికార్డు భూమిపై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ భూమి రికార్డునైనా ఎప్పుడైనా సవరించవచ్చు. భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. ఉన్న భూములకు హద్దు రాళ్లు లేవు. భూ సమస్యలపై ఎవరిని కలవాలి.. ఎంతకాలంలో ఆ సమస్యను పరిష్కరించాలి అనే విషయాలపై స్పష్టత లేదు. అపరిష్కృత భూ సమస్యలకు ఎన్నో కారణాలు.. అన్ని కోణాలు చూడాలి.. సమస్యకు సమగ్ర పరిష్కారం వెతకాలి. భూమి సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషాద ఘటనలు, హత్యలకు కూడా దారితీస్తున్న దుర్ఘటనలు.. మరోపక్క తీవ్ర ఒత్తిడిలో రెవెన్యూ యంత్రాంగం. ఇకనైనా పరిష్కారాలపై చర్చ జరగాలి. అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన ఒక కనువిప్పు కావాలి. – ఎం.సునీల్ కుమార్, భూచట్టాల నిపుణుడు, న్యాయవాది
క్రమబద్ధీకరణతో వివాదాలకు ఫుల్‌స్టాప్
భూ రికార్డుల ప్రక్షాళనతో ప్రభుత్వం తేనె తుట్టెను కదిలించింది. రికార్డుల నవీకరణ కంటే ముందు సమగ్ర భూసర్వే చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావు. దేవాదాయ, వక్ఫ్, అటవీ, భూదాన్ బోర్డులు ఇన్నాళ్లు తమ భూములెక్కడ ఉన్నాయో పట్టించుకోకుండా.. ఒకేసారి ఈ భూములన్నీ మావేనని వాదించడం అత్యధిక వివాదాలకు కారణం. దశాబ్దాలుగా ఆ భూమిని అనుభవిస్తూ... పాస్‌బుక్కు కలిగి ఉన్నవారిని కాదని.. 22(ఏ)లో ఆ భూమిని చేర్చడం ఎంతవరకు న్యాయం. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. ఎవరైతే పొజిషన్‌లో ఉన్నారో వారి పేరిట క్రమబద్ధీకరిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. రైతాంగానికి లాభం కలుగుతుంది. – సురేశ్ పొద్దార్, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్)
రికార్డుల ప్రక్షాళనలో ఒత్తిడి ఎక్కువైంది..
రికార్డుల ప్రక్షాళన మొదలైన నుంచి రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినప్పటికీ సమయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రక్షాళనకు డెడ్‌లైన్‌లు విధించడంతో సిబ్బంది ఒత్తిడికి గురయ్యారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి సరిపడా సమయం దొరకలేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే వినాల్సి వచి్చంది. రికార్డులో సాదాబైనామాలకు సంబంధించి తప్పుడు కాగితాలతో చాలా మంది భూములను తమపేరిట నమోదు చేయించుకునే ప్రయత్నాలు చేశారు. దానికి తోడు రాజకీయ జోక్యం కూడా ఉండటం ఒత్తిడిని పెంచింది. – సత్తయ్య, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్)
సమస్యకు పరిష్కారాలు..
- సమగ్ర భూ సర్వే జరగాలి.
- భూచట్టాలను సమీక్షించి ఒక సమగ్ర రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలి.
- టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి.
- భూ వివాదాల పరిష్కారానికి
- ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.
- ప్రజల భాగస్వామ్యంతో భూరికార్డుల సవరణ చేయాలి.
- భూ సమస్యలున్న పేదవారికి సహాయం చేసే పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను కొనసాగించాలి.
Comments
Please login to add a commentAdd a comment