సేత్వారీ స్కాన్ ఇండెక్స్ సగమే
♦ ఇప్పటివరకు 5 వేల గ్రామాల్లోనే పూర్తి
♦ 3,942 గ్రామాలకు సేత్వారీలే లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ రికార్డుల ప్రక్షాళనకు కీలకమైన సేత్వారి స్కాన్ ఇండెక్స్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. సేత్వారీలు (భూమి వివరాలుండే పత్రం) అందుబాటులో ఉన్న గ్రామాల్లో ఈ ప్రక్రియను ల్యాండ్ సర్వే శాఖ అధికారులు చురుగ్గానే చేస్తున్నా, కొన్ని గ్రామాల్లో సేత్వారీలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. దీంతో కొన్ని చోట్ల ఖస్రా పహాణీలు, మరికొన్ని చోట్ల చెస్సలా పహాణీలు స్కానింగ్ చేస్తున్నారు. దాదాపు నాలుగు నెలల క్రితం ప్రారంభమయిన ఈ స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెపుతున్నారు.
6 వేల పైచిలుకు గ్రామాల్లోనే...
రాష్ట్రంలో 10,878 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇందులో సేత్వారీ స్కాన్ ఇండెక్స్‌లు కేవలం 6,936 గ్రామాల్లోనే ఉన్నాయని ల్యాండ్ సర్వే అధికారులు చెబుతున్నారు. ఈ సేత్వారీలున్న గ్రామాల్లో 4,950 చోట్ల ఇండెక్స్ స్కానింగ్ పూర్తయింది. అంటే ఫలానా సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉందనే వివరాలతో పాటు పహాణి, మ్యాపు, కొలతలు, రిజిస్ట్రేషన్లకు అవసరమైన ఈసీ రికార్డులను కూడా దీనిలో పొందుపరిచారు. ఏదైనా సర్వే నంబర్‌ను క్లిక్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఒకేచోట లభ్యమయ్యేలా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
మరో 1,986 గ్రామాల్లో సేత్వారీల ఇండెక్స్ స్కానింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. సేత్వారీలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 3,942 గ్రామాల్లో సేత్వారీలు లేవు. దాదాపు 80 ఏళ్ల క్రితం ఇచ్చిన సేత్వారీలు చినిగిపోవడం, స్కానింగ్‌కు అనుకూలంగా లేకపోవడం, కొన్ని చోట్ల అసలు లేకపోవడంతో ఇప్పుడు ఖస్రా పహాణీల స్కానింగ్ చేస్తున్నారు. అవి కూడా లభ్యంకాని సర్వే నంబర్లకు చెస్సలా పహాణీలను స్కాన్ చేస్తున్నామని సర్వే, ల్యాండ్ సెటిల్‌మెంట్స్ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సేత్వారీలు అందు బాటులో లేని కారణంగా కొంత జాప్యం జరిగిందని ఈ ప్రక్రియను మరో నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
ప్రక్షాళనలో ఇదే కీలకం
కాగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఈ సేత్వారీ స్కాన్ ఇండెక్స్ కీలకం కానుంది. సేత్వారీలు, పహాణీలను స్కాన్ చేసి, భూముల అన్ని వివరాలను ఒక్క క్లిక్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రక్షాళన ప్రక్రియను సులభతరం చేసే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఒక్కో సర్వే నంబర్‌ను ఈ స్కానింగ్‌లోనే పరిశీలించి, వివాదాలు ఏర్పడిన భూముల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి రికార్డులను తనిఖీ చేసే అవకాశం ఉంటుందని, సేత్వారీ, ఖస్రా, చెస్సలా పహాణీల స్కానింగ్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా భూ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు కూడా జరగకుండా నియంత్రించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన కంటే ముందే ఈ స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెడితే మంచి ఫలితాలు రావచ్చని అంచనా.
సేత్వారీ... భూ భగవద్గీత
రాష్ట్రంలో దాదాపు 36.42 లక్షల ప్రధాన సర్వే నంబర్లలో భూములున్నాయి.మళ్లీ ఈ సర్వే నంబర్లలో దాదాపు 1.90 కోట్ల బైనంబర్లు వచ్చాయి. నిజాం హయాంలో జరిగిన సర్వేలో ప్రధాన సర్వే నంబర్లన్నింటికీ సేత్వారీలు జారీ చేశారు. ఈ సేత్వారీలలో భూమికి సంబంధించిన అన్ని వివరాలూ ఉంటాయి. ఫలానా సర్వే నంబర్‌లోని భూమి ప్రభుత్వానిదా.. ఇనాం భూమా... పట్టా భూమా అనే అంశాల నుంచి.. ఆ సర్వే నంబర్‌లో మొత్తం ఎంత భూమి ఉంది.. అందులో సాగుకు యోగ్యం కానిది ఎంత అనే వివరాలుండే పత్రం ఇది. సాగు చేసే భూమికి సేత్వారీలోనే గ్రేడ్‌లు ఉంటాయి. గతంలో ఈ గ్రేడ్‌ల ఆధారంగానే ఆయా భూములకు ధరలు కూడా నిర్ణయించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే భూ రికార్డులకు సేత్వారీని భగవద్గీతగా పేర్కొంటారు. అప్పట్లో తయారుచేసిన సేత్వారీలు అన్ని గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో వాటి ఆధారంగా తయారు చేసిన పహాణీలను ఇప్పుడు స్కాన్ చేసి భద్రపరుస్తున్నారు.