వారంతా ఉపాధి సిబ్బంది. నాలుగు రోజుల కిందట ఓ విందు కార్యక్రమానికి వెళ్లి అక్కడ మద్యం సేవించి భోజనం ఆరగించారు. తరువాత అక్కడ నుంచి కార్యాలయానికి వచ్చి మద్యం మత్తులో వేయ్...చిందేయ్....అంటూ గంతులేశారు. అక్కడితో ఆగకుండా వాటిని తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లోకి అప్‌లోడ్ చేశారు. అది కాస్త ఆలస్యంగానైనా శుక్రవారం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో చిందులేసిన ఆరుగురు సస్పెండ్‌కు గురయ్యారు.
విజయనగరం జిల్లా / గరుగుబిల్లి: విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో ఉండాల్సిన సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలలో చిందులు వేస్తూ సామాజిక మాధ్యమాలకు చిక్కారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలకు సస్పెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది ఈ నెల 12న మండలంలోని సంతోషపురంలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో అధికారులతో పాటు పాల్గొన్నారు. విందు ముగించుకొన్న తరువాత ఉపాధి హామీ కార్యాలయానికి తిరిగి చేరుకొన్నారు.
విందులోనే మద్యం సేవించి ఉండటం కారణంగా కార్యాలయానికి వచ్చిన తరువాత కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేకపోవడంతో సిబ్బంది సెల్‌ఫోన్‌లో హుషారు అయిన పాటలు వేసుకొని డ్యాన్సులు చేసి చిందులు వేసి తమలో దాగివున్న కళను ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా ఓ అడుగు ముందుకు వేసి ఈ దృశ్యాలను ఉపాధి సిబ్బందిలో ఒకరు సామాజిక మాధ్యమాలలో ఒకటైన ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఈ వీడియో క్లిప్పింగ్ మీడియా ప్రతినిధులకు చిక్కింది. ఈ మేరకు వీడియోను లీక్ చేయకుండా ఉండాలంటే కొంత మొత్తం ఇవ్వాలని మీడియా ప్రతినిధులు(సాక్షి కాదు) ఉపాధి సిబ్బందికి డిమాండ్ చేశారు. దీనికి ఉపాధి సిబ్బంది అంగీకరించకపోవడంతో విషయం కాస్త ఆలస్యంగా శుక్రవారం బయటకొచ్చింది.
ఆరుగురు ఉద్యోగులు సస్పెన్షన్
మండల కేంద్రంలోని స్థానిక ఉపాధి హామీ పథకంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆరుగురు సిబ్బంది విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు విజయనగరం జిల్లా నీటియాజమాన్య సంస్థ పధక సంచాలకులు ఆర్.రాజగోపాలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో జి.పార్వతి తెలిపారు.
ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ విధులను నిర్వహిస్తున్న సమయంలో మద్యంను సేవించి, చిందులు వేసినట్లు వచ్చిన ఆరోపణలు భాగంగా ప్రాథమిక విచారణ ఆధారంగా తొలగించినట్టు పేర్కొన్నారు. సస్పెండ్‌కు గురైన వారిలో ఏపీవో టి.రామకృష్ణనాయుడు, సాంకేతిక సహయకులు పి.పోలారావు, సిహెచ్.వెంకటేష్, ఎం.రమణ, కంప్యూటర్ ఆపరేటర్ ఎ.శంకరరావు, జేఈ వైఆర్‌డీ ప్రసాద్‌లున్నారు. ఇదిలా వుండగా విధులలో బాధ్యతా రహితంగా వ్యవహరించిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు సస్పెండ్ కొనసాగుతుందని ఎంపీడీవో తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్, సాంకేతిక సహాయకులు చిందులు వేసినప్పటికీ, సిబ్బందిని క్రమశిక్షణలో ఉంచలేని ఏపీవో, జేఈలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment