ఆయాలా.. దయ్యాలా..
♦ పసివాళ్ల చేతులపై వాతలు పెట్టిన వైనం
♦ కరీంనగర్‌లోని శిశుగృహలో దారుణం
♦ తీవ్రంగా స్పందించిన కలెక్టర్
♦ ఆయాలు, సిబ్బంది తొలగింపు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పసివాళ్లు.. అన్నెం పున్నెం ఎరగని అనాథలు... కన్నపేగులను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోతే చేరదీసిన శిశుగృహే వారికి దిక్కయింది. ఆరు రోజుల క్రితం అందులో పనిచేసే ఆయాలకు ఉన్నట్టుండి ఏమైందో ఏమో... ఒక్కసారిగా శాడిస్టుల్లా మారారు. చెంచాను స్టవ్‌పై వేడి చేసి పిల్లల చేతులపై వాతలు పెట్టారు. మరుసటి రోజు సాయంత్రం సామాజిక కార్యకర్త వచ్చి చూసే వరకు వారికి కనీసం చికిత్స అందించిన పాపాన పోలేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శిశుగృహలో ఎనిమిది మంది పిల్లలున్నారు. అందులో ఒకరు మూడు నెలల పసిబాబు మోక్ష. మిగిలిన ఏడుగురు రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు వారే.
ఈనెల 15న సాయంత్రం 7.30 గంటలకు ఆ ఏడుగురు పిల్లలను ఆయూలు బుచ్చవ్వ, పద్మ ఒకే చోట కూర్చోబెట్టారు. ప్లేట్లలో అన్నం, కూర వడ్డించి వాళ్ల ముందు పెట్టారు. ఆ పిల్లలే చక్కగా అన్నం కలుపుకుని తింటుండగా, 10 నిమిషాల తరువాత ఆయా బుచ్చవ్వ స్టవ్ వెలిగించి చెంచా వేడి చేసింది. ఇద్దరూ కలిసి వరుసగా ఆ ఏడుగురు పిల్లల చేతులపై వాతలు పెట్టారు. ఇందులో ఐదేళ్ల గీత, ధనలక్ష్మీతోపాటు రెండేళ్ల రాజన్ చేతులపై గాయూలు కాగా.. మిగిలిన వారికి చిన్నపాటి గాయూలయ్యూరుు. గీత చేతిపై బొబ్బలొచ్చి పుండుగా మారింది. మరుసటి రోజు ఏడుస్తూనే అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన పిల్లలు సాయంత్రం 4 గంటలకు శిశుగృహకు చేరుకున్నారు.
సామాజిక కార్యకర్త శ్రీలత పిల్లలకు వాతలను గమనించి వెంటనే వారిని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి టీటీ ఇంజక్షన్లు వేయించారు. జరిగిన దారుణాన్ని శిశుగృహ మేనేజర్‌తోపాటు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ పీడీ ఎస్.మోహన్‌రెడ్డి సైతం ఈ దారుణంపై స్పందించలేదు. ఆయూలకు మెమోలు జారీ చేతులు దులుపుకున్నారు. చివరకు ఈ దారుణం బుధవారం బయటపడటంతో కలెక్టర్ నీతూప్రసాద్ శిశుగృహను సందర్శించి చిన్నారులను పరామర్శించారు. చిన్నారుల చేతులపై గాయూలు చూసి చలించిపోయారు.
ఐసీడీఎస్ పీడీ సరెండర్
పిల్లల చేతులపై వాతలు పెట్టిన ఇద్దరితోపాటు మరో ఆయూను తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసుపెట్టి అరెస్టు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులకు, పోలీసులను ఆదేశించారు. శిశుగృహ మేనేజర్ దేవారావు, ఇతర సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తున్నందున వారందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఆయనను విధుల నుంచి తప్పించి హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తున్నట్లు తెలిపారు.
పట్టించిన సీసీ కెమెరాలు: శిశుగృహలోని గదుల్లో గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఆయాల దురాగతం బయటపడింది. చిన్నారుల చేతులపై ఆయాలు వాతలు పెట్టిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
శిశుగృహలో జరిగిన దారుణంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు సీరియస్‌గా పరిగణిస్తూ కేసును సుమోటోగా స్వీకరించారు. విచారణ జరిపి మే 2లోగా నివేదిక పంపాలని కలెక్టర్‌కు నోటీసు పంపారు. లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శి భవానీచంద్ర సైతం బుధవారం మధ్యాహ్నం శిశుగృహను సందర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.