ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ
బహిష్కరించిన ఉపాధ్యాయులు
విజయవాడ సెంట్రల్ : ఐఐటీ ఫౌండేషన్ బ్రిడ్జి కోర్సుల శిక్షణా తరగతుల్ని మున్సిపల్ ఉపాధ్యాయులు బహిష్కరించారు. నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పలు మున్సిపల్ స్కూళ్లవిద్యార్థులకు ఐఐటీ శిక్షణా తరగతుల్ని 15 నుంచి ప్రారంభించాలని మున్సిపల్ మంత్రి పి.నారాయణ నిర్ణయించారు. ఈమేరకు లెక్కలు, సైన్స్, బయాలజీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు గురువారం నుంచి మూడు రోజుల పాటు పటమట జీడీఈటీ స్కూల్లో శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేశారు.
నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీ శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు. దీంతో మున్సిపల్ ఉపాధ్యాయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. మీరిచ్చే శిక్షణ మాకు అక్కర్లేదు అంటూ బయటకు వచ్చేశారు. ఎస్‌టీయూ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మూకల అప్పారావు, డి.చంద్రశేఖర్ మాట్లాడుతూ గతేడాది ఇదే తంతు జరిగిందన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో శిక్షణ ఇప్పించాల్సిందిగా కోరినప్పటికీ మంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు.
మంత్రి నారాయణ ఉపాధ్యాయ వర్గాలపై ముఖ్యమంత్రికి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. తాము ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు వ్యతిరేకం కాదని, మంత్రి వైఖరిని మాత్రమే నిరసిస్తున్నామని స్పష్టం చేశారు.