కార్పొరేటర్ల పోకిరీ వేషాలు... మేయర్ చీవాట్లు
విజ్ఞాన యాత్రలో టీడీపీ కార్పొరేటర్ల పోకిరీ వేషాలు
మద్యం మత్తులో మహిళపై అనుచిత వ్యాఖ్యలు
పూణేలో రైల్వే పోలీసుల వార్నింగ్
ఫోన్లో చీవాట్లు పెట్టిన మేయర్ శ్రీధర్
విజయవాడ : టీడీపీ కార్పొరేటర్ల వెకిలి చేష్టలతో విజయవాడ పరువు పోయింది. విజ్ఞాన యాత్రకు వెళ్లినవారిలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు మద్యం మత్తులో రైల్లో ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పూణే రైల్వే పోలీసులు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. తాము ఫలానా అని కాళ్లబేరమాడి బయటపడ్డట్లు సమాచారం. నలుగురికి బుద్ధులు చెప్పాల్సిన మీరే (ప్రజాప్రతినిధులే) ఇలా చౌకబారుగా వ్యవహరిస్తే ఎలాగంటూ రైల్వే పోలీసులు చీవాట్లు పెట్టి వదిలేశారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఈ ఘటన గత నెల 30వ తేదీ రాత్రి జరగగా.. బుధవారం వెలుగుచూసింది. టీడీపీ కార్పొరేటర్ల పోకిరీ వేషాలు తెలుసుకున్న మేయర్ కోనేరు శ్రీధర్ ఫోన్లో చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ‘మీరు చేసే పనుల వల్ల పార్టీ పరువు పోతోంది.. మరోసారి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదు’ అంటూ హెచ్చరించినట్లు వినికిడి. పూణే ఘటనపై మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టూర్‌లో తెలుగు తమ్ముళ్లు చేసిన రచ్చ బుధవారం నగరంలో హల్‌చల్ చేసింది. రాజకీయ పార్టీలతో పాటు కార్పొరేషన్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
పరువు తీశారు
విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు గత నెల 29న విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. ఈ నెల 13వ తేదీ వరకు టూర్ కొనసాగనుంది. మొత్తం 59 మంది కార్పొరేటర్లకు గాను 36 మంది టూర్ కు వెళ్లారు. మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీలతో పాటు మరో 21 మంది టూర్‌కు దూరంగా ఉన్నారు. పూణే, జయపూర్, ఆగ్రా, ఢిల్లీ, చండీఘర్, అమృత్‌సర్ నగరాల్లో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు.
అక్కడ కార్పొరేషన్లలో పాలనా వ్యవహారాలు, అభివృద్ధి తదితర అంశాలపై అధ్యయనం చేయాలన్నది విజ్ఞాన యాత్ర ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం రూ.30 లక్షలు కేటాయించారు. సదరన్ ట్రావెల్స్‌కు కాంట్రాక్ట్ అప్పగించారు. 29న నగరం నుంచి బయలుదేరిన కార్పొరేటర్లు 30వ తేదీనే మద్యం మత్తులో రైల్లో వివాదాన్ని సృష్టించారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేయడంతో గప్‌చుప్ అయిపోయిందనుకున్నారు. కానీ ఆ సమాచారం బుధవారం విజయవాడకు చేరింది. టూర్ కొనసాగుతుండగానే విషయం అల్లరైపోవడంతో సంబంధిత కార్పొరేటర్లు కంగుతిన్నారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు సాక్షితో మాట్లాడుతూ పూణేలో ఎలాంటి వివాదం జరగలేదన్నారు. తమను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు ఈ అల్లరి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం తాము ఢిల్లీలో ఉన్నట్లు చెప్పారు.
కలకలం
టూర్‌లో టీడీపీ కార్పొరేటర్ల చేష్టలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మేయర్ మొదటి నుంచి టూర్‌ను వ్యతిరేకిస్తున్నారు. మంత్రి పి.నారాయణ పుష్కరాల తరువాత వెళ్లాలని ఆదేశించారు. ఆ ప్రతిపాదనను కొందరు సీనియర్ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పట్టుబట్టిమరీ టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ సారథ్యంలో వెళ్లిన కొందరు కార్పొరేటర్లు వివాదంలో చిక్కుకొని పార్టీతో పాటు బెజవాడ పరువును నిట్టనిలువునా తీశారు. టూర్‌లో అపశ్రుతి చోటు చేసుకుందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు, కుటుంబసభ్యులు ఫోన్లద్వారా వారి క్షేమసమాచారాన్ని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో టూర్ ముగియనుంది.