
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించిన ఘటన విశాఖలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలనాయుడు కొందరు స్నేహితులతో కలిసి కారులో ఆదివారం తెల్లవారుజామున ఆర్‌కే బీచ్ రోడ్డులో వెళుతున్నాడు. ముందుగా ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. అదుపు తప్పి బీచ్‌రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చంద్రకిరణ్, గౌతమ్ అనే యువకులు గాయపడడంతో వారిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో చంద్రకిరణ్ తలకు తీవ్ర గాయమైంది. మాజీ మంత్రి తనయుడు, అతని స్నేహితులు సెకండ్‌షో సినిమా చూసి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. అప్పలనాయుడు మద్యం తాగి కారు నడిపాడని, కారులో ప్రయాణిస్తున్న వారిలో మాజీ డీఐజీ ఎస్.వెంకటేశ్వరరావు కుమారుడు మౌర్య కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్థానికులు అప్పలనాయుడుకు దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. వాహనానికి ఒక వైపు నంబర్ ప్లేట్ మాయం కావడంపై అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment