visakha beach road
-
‘గే’ స్ హర్ట్ అవుతున్నారు.. ఎందుకు?
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎస్... ఐ యామ్ గే. సిగ్గెందుకు.. చెప్పుకోడానికి?! నేను అబ్బాయిని. కానీ అమ్మాయిలకు ఎట్రాక్ట్ కాను. ఇందులో తప్పేముంది? నేను అమ్మాయిని. కానీ అబ్బాయిలు నన్ను ఎట్రాక్ట్ చెయ్యలేరు. ఇందులో ఒప్పుకానిది ఏముంది? ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా అంటుంది లోకం. ప్రకృతి ఒక్కటేనా ధర్మం? ప్రకృతి విరుద్ధ ధర్మాలు ఉండవా?! అబ్బాయిల దగ్గర మాత్రమే కంఫర్ట్ ఫీలయ్యే అబ్బాయిలు, అమ్మాయిల ఆలింగనాలలో మాత్రమే ఆలంబన పొందే అమ్మాయిలు అడుగుతున్న ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? లేదు. సానుభూతి ఉందా? లేదు. సహానుభూతి ఉందా? అదెలాగూ ఉండదు. సాఫ్ట్ కార్నర్ ఉందా? ఎప్పటికైనా ఏర్పడుతుందేమో తెలీదు. మరేముంది? అభ్యంతరం ఉంది. అసహనం ఉంది. అవహేళన ఉంది. ‘ఎట్లానో చావండి. మీ ఒంట్లో ఏం జరుగుతోందో మా కంట్లో పడనివ్వకండి’ అని దూరంగా జరిగిపోయేంత ఈసడింపు ఉంది. ‘గే’ స్ హర్ట్ అవుతున్నారు. నేచురల్ బాధ అనేది సాధారణ జెండర్లకు ఉండి, ట్రాన్స్జెండర్లకు లేకుండా పోతుందా?! ఎవరైనా మనుషులే కదా. బాధ పడతారు. అయితే వారి బాధ.. వాళ్లని మనం గుర్తించడం లేదని కాదు. వాళ్లని మనం గౌరవించడం లేదని కాదు. మరి? వాళ్లేమిటో వాళ్లని చెప్పుకోనివ్వడం లేదని! మగదీరుడిగా నిన్ను నువ్వు ఎగ్జిబిట్ చేసుకుంటావు. కోమలాంగిగా నిన్ను నువ్వు రిప్రెజెంట్ చేసుకుంటావు. మరి గే గా నన్నెందుకు బయట పడనివ్వవు అని నేస్తం సంస్థ ప్రతినిధులు నిగ్గుదీసి నిలదీస్తున్నారు. ఇది నేను..నాలా‘గే’ ఉంటానని థర్డ్‌జెండర్స్ బీచ్ రోడ్డులో గర్వంగా ప్రైడ్వాక్ వాక్ చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. మేమూ సాధారణ వ్యక్తులమే..మాకూ హక్కులున్నాయి. మమ్మల్నీ గౌరవించండంటూ నేస్తం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ క్వీర్ ఆత్మాభిమాన్ యాత్ర పేరుతో ప్రైడ్ వాక్ ను ఆదివారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్కేబీచ్ వరకు సాగిన ఈ వాక్‌ను జిల్లా హెచ్ఐవీ నియంత్రణ ప్రొగ్రాం మేనేజర్ శైలాజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలు ప్రతి ఒక్కరికి నచ్చినట్టు జీవించే హక్కును కల్పించాయన్నారు. ఎవరి హక్కులను మనం వ్యతిరేకించారదన్నారు. థర్డ్‌జెండర్, స్వలింగ సంపర్కులపై వివక్ష చూపించడం సరైంది కాదన్నారు. వారు కూడా మనలో ఒకరిగా మనం గుర్తించి వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. ఈ వాక్కు పలు ఎన్జీవోలు, కాలేజీ విద్యార్థులు మద్దతిచ్చారు. రాష్ట్రంలో మొదటి ప్రైడ్ వాక్.. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ వారి హక్కుల కోసం రాష్ట్రంలో మొదటి సారిగా విశాఖలో ప్రైడ్ వాక్‌ను నిర్వహించినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ వాక్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొందరు పాల్గొన్నారు. తమపై వివక్ష పూర్తిగా పోయే వరకు ఇటువంటి వాక్‌లను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఇది తొలి మెట్టు.. ఇంత భారీ వర్షంలో కూడా అనేక మంది వచ్చిన ఈ ప్రైడ్ వాక్‌లో పాల్గొనడం తొలిమెట్టుగా భావిస్తున్నాం. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ హక్కుల కోసం రాష్ట్రంలో తొలి సరిగా నిర్వహించిన ఈ వాక్కు ఎన్జీవోలు, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. స్వలింగ సంపర్కులు, థర్డ్జెండర్పై ప్రజలు చూపిస్తున్న వివక్ష పోయే వరకూ పోరాటం ఆగదు. – విశ్వతేజ్, రాష్ట్ర స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి మా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇందుకు కోసం ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సరిగా మా ఆత్మ గౌవరం కోసం ఎంతో ధైర్యంతో ప్రైడ్ వాక్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వాక్ ద్వారా ప్రజల్లో ప్రేరణ వస్తుందని ఆశిస్తున్నాను. అందరితో పాటు మాకు సమాన హక్కులున్నాయని ప్రజలు గుర్తించాలి. – కృష్ణమ్మ, హైదరాబాద్ హక్కుల కోసం ఒకే వేదికపై.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్స్ అంతా ఒకే వేదికపైకి వచ్చి హక్కుల కోసం మొదటి సరిగా ప్రైడ్ వాక్ నిర్వహించడం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మా హక్కులను హరించవద్దని కోరుతున్నా. మాపై వివక్ష చూపించకుండా అందరిలానే సమానంగా చూడాలని కోరుకుంటున్నా. – నందిత, ట్రాన్స్ మహిళ మేము మానసిక రోగులం కాదు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి నచ్చడం, అబ్బాయికి అబ్బాయి నచ్చడం మానసిక రోగం కాదు. సుప్రీం కోర్టు కూడా ఇంటువంటి ఆలోచనలు కలిగిన వారిని కాన్వర్జేషన్ థెరిపీ చేయటం నిషేధించింది. నేను ఈ వాక్ ద్వారా స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ ఎదుర్కొంటున్న వివక్షకు గురవుతున్నవారి బాధలు తెలుసుకున్నా. – భావ్య, క్వీర్ పర్సన్ -
సాయంత్రం 5.30 అయిందంటే విశాఖ బీచ్ రోడ్డు ఖాళీ చేయాల్సిందే!
దొండపర్తి (విశాఖ దక్షిణ): కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శనివారం, ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో బీచ్ రోడ్డులో ప్రవేశం నిషేధిస్తూ కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా ప్రకటించారు. ఆయా రోజుల్లో సాయంత్రం 5.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఈ నిషేధాజ్ఞలు విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడో దశ కోవిడ్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. -
విశాఖ రోడ్లు దేశంలోనే బెస్ట్
సాక్షి, విశాఖపట్నం : అందాల నగరి విశాఖపట్నం అంటే.. ఇష్టపడని వారుండరు. అందుకే.. ఏపీ, తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ విశాఖ నగర అందానికి, ఇక్కడి రహదారులకు సలాం చేస్తున్నారు. అంతే కాదు.. విశాఖ వస్తున్న బ్రిటన్ దంపతులకు సైతం ఇదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్పారు. ‘ద ట్రాన్స్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా బ్రిటన్‌కు చెందిన అలన్ బ్రాత్‌వెయిట్, పాట్ బ్రాత్‌వెయిట్ దంపతులు క్వీన్‌బీ కారులో భారత యాత్ర చేపట్టారు. ముంబై నుంచి బయలుదేరి హైదరాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అహ్మదాబాద్, న్యూఢిల్లీ వంటి ప్రధాన నగరాల్ని చుట్టేస్తున్నారు. రెండు రోజుల్లో విశాఖ చేరుకోనున్న ఈ దంపతులకు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ హై కమిషనర్ విశాఖ గొప్పదనానికి ఎవరైనా దాసోహం అనాల్సిందేనని కితాబిచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘రెండు రోజుల్లో క్వీన్ బీ విశాఖ బీచ్ రోడ్డులోకి ప్రవేశించనుంది. మీరు ట్రాన్స్ ఇండియా ఛాలెంజ్‌లో తిరుగుతున్న నగరాలన్నింటిలోనూ విశాఖ రోడ్లు ది బెస్ట్ అని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. మీరు నా మాటతో ఏకీభవిస్తారు. అంతటి అందమైన నగరంలో రెండు రోజుల్లో పర్యటించనున్న మీరు విశాఖ రోడ్ల గురించి నా మాటలతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మీ తీర్పు కోసం ఎదురు చూస్తుంటాను’ అంటూ ట్వీట్ చేశారు. విశాఖ బీచ్ రోడ్డు ఫొటోతో పాటు బ్రాత్‌వెయిట్ దంపతుల ఫొటోను ట్వీట్లో పోస్ట్ చేశారు. అండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది. రీట్వీట్స్ చేస్తున్న చాలామంది.. ఫ్లెమింగ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. -
బండారు తనయుడి బరితెగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌రోడ్డులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు తాగిన మత్తులో రెచ్చిపోయాడు. మితిమీరిన వేగంతో ఇష్టారాజ్యంగా కారు నడుపుతూ మెడికో విద్యార్థుల బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆంధ్ర మెడికల్ కళాశాల(ఏఎంసీ)లో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకిరణ్ తన స్నేహితుడు గౌతమ్‌తో కలిసి బైక్‌పై బీచ్‌రోడ్డులో వెళ్తున్నారు. గౌతమ్ బైక్ నడుపుతుండగా, వెనక చంద్రకిరణ్ కుర్చొన్నాడు. బీచ్‌రోడ్డులో ఓ ప్రైవేట్ హోటల్లో రాత్రి ఒంటి గంట సమయం వరకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనయుడు అప్పలనాయుడు తప్పతాగాడు. ఆ మత్తులోనే తన స్నేహితులిద్దరితో కలిసి కారులో బయలుదేరాడు. బీచ్‌రోడ్డులో మితిమీరిన వేగంతో వెళ్తూ చంద్రకిరణ్ బైక్‌ని ఢీకొట్టి.. సమీపంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డివైడర్‌పైకి దూసుకుపోయాడు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. బైక్ మీద నుంచి పడిపోయిన చంద్రకిరణ్ తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు హుటాహుటిన కేజీహెచ్‌కి తరలించారు. తలకు బలమైన గాయంకాగా ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో వైద్యం పొందుతున్నాడు. నెంబరు ప్లేటు మార్చేందుకు యత్నం.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెళ్లి ప్రశ్నించగా అప్పలనాయుడు దురుసుగా సమాధానం చెప్పడంతో వారంతా కలిసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సమయానికి అక్కడి నుంచి స్నేహితులతో కలిసి అప్పలనాయుడు పరారయ్యాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అప్పలనాయుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు తన కారు నెంబర్ బోర్డుని తొలగించేందుకు అప్పలనాయుడు ప్రయతి్నంచాడని స్థానికులు తెలుపుతున్నారు. ప్రమాద సమయంలో ఆ కారుకి ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు ఉండగా దాన్ని తొలగించేశారు. దాని స్థానంలో ఏపీ 37 సీవీ 0780 నంబరు ప్లేటు అమర్చేందుకు యతి్నంచగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆదివారం పోలీసులు వాహనాన్ని తరలించే సమయానికి మళ్లీ ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు దర్శనమిచ్చింది. మరోవైపు కారు ముందుసీటులో బండరాయి కనిపించడంతోపాటు అస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు చంద్రకిరణ్ ఎవరితోనూ మాట్లాడకపోవడం... అతని స్నేహితుడు గౌతమ్ అనే యువకుడు అక్కడ లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. తప్పు చేస్తే చర్యలు తప్పవు తప్పు చేస్తే ఎలాంటి వారిపైనైనా చర్యలు తప్పవని ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి వి.విజయసాయిరెడ్డి అన్నారు. బీచ్‌రోడ్డులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు సత్యానారాయణ కుమారుడు అప్పలనాయుడు తప్పతాగి చేసిన రోడ్డు ప్రమాద ఘటనపై ఆయన స్పందించారు. బీచ్‌రోడ్డులో అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రేవ్ పారీ్టలు, డ్రగ్స్ విక్రయాలు ఎక్కువగా జరిగేవని... ప్రస్తుతం వాటన్నింటినీ పోలీసులు పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నాం మాకు సమాచారం రావడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లాం. మేము వెళ్లే సరికే ప్రమాదానికి కారణమైన వారు పరారయ్యారు. వారిపై ఐపీసీ సెక్షన్ 337 ప్రకారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలిస్తున్నాం. – కోరాడ రామారావు, త్రీ టౌన్ సీఐ -
బీచ్‌రోడ్డులో మాజీ మంత్రి కుమారుడి హల్చల్
-
మద్యం మత్తులో మాజీ మంత్రి కుమారుడి హల్చల్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించిన ఘటన విశాఖలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలనాయుడు కొందరు స్నేహితులతో కలిసి కారులో ఆదివారం తెల్లవారుజామున ఆర్కే బీచ్ రోడ్డులో వెళుతున్నాడు. ముందుగా ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. అదుపు తప్పి బీచ్‌రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చంద్రకిరణ్, గౌతమ్ అనే యువకులు గాయపడడంతో వారిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో చంద్రకిరణ్ తలకు తీవ్ర గాయమైంది. మాజీ మంత్రి తనయుడు, అతని స్నేహితులు సెకండ్‌షో సినిమా చూసి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. అప్పలనాయుడు మద్యం తాగి కారు నడిపాడని, కారులో ప్రయాణిస్తున్న వారిలో మాజీ డీఐజీ ఎస్.వెంకటేశ్వరరావు కుమారుడు మౌర్య కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్థానికులు అప్పలనాయుడుకు దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. వాహనానికి ఒక వైపు నంబర్ ప్లేట్ మాయం కావడంపై అనుమానిస్తున్నారు. -
మూడు దశాబ్దాల దేశ రక్షణకు సెలవు
- నేవీ యుద్ధ విమానం లాస్ట్ ల్యాండింగ్ - విశాఖ తీరంలో మ్యూజియంగా టీయూ–142 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లాంఛనంగా అప్పగింత సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణలో 29 ఏళ్ల పాటు అప్రతిహతంగా సేవలందించిన టీయూ– 142ఎం ఎయిర్‌క్రాఫ్ట్ ఆఖరిసారిగా శనివారం విశాఖలోని ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయంలో దిగింది. ప్రపంచంలోనే శక్తిమంతమైన ఈ లాంగ్ రేంజి మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ 1988 మార్చి 30న నేవీలోకి ప్రవేశించింది. అనంతరం తమిళనాడు అరక్కోణంలోని ఐఎన్ఎస్ రజాలి ఎయిర్‌బేస్ కేంద్రంగా సేవలందిస్తోంది. మార్చి 29న నేవీ సేవల నుంచి నిష్క్రమించిన ఈ యుద్ధ విమానాన్ని విశాఖ సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థనకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. దీంతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అరక్కోణం నుంచి విశాఖలోని నేవీ ఎయిర్ బేస్‌కు తీసుకువచ్చారు. ఉదయం 10.55 గంటలకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్ చిట్టచివరిసారిగా డేగా రన్‌వేపై వాలింది. వెనువెంటనే సంప్రదాయ బద్ధంగా మూడు చేతక్, రెండు కమోవ్, డోర్నియర్ విమానాలు, ఒక అత్యాధునిక పీ–8ఐ యుద్ధవిమానం ఫ్లైఫాస్ట్‌ను నిర్వహించాయి. ఆ తర్వాత అగ్నిమాపక శకటాలు రన్‌వే నుంచి వస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్– టీయూ 142పై ఇరువైపుల నుంచి వాటర్‌గన్స్ ద్వారా నీటిని వెదజల్లాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు, తూర్పు నావికాదళ ప్రధానాధికారి హెచ్‌సీఎస్ బిస్త్ తదితరులు ఈ యుద్ధ విమానానికి స్వాగతం పలికారు. ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి దిగిన పైలట్ కమాండర్ యోగేష్ మయర్ నేతృత్వంలోని తొమ్మిది మంది సిబ్బందిని వీరు అభినందించారు. అనంతరం ఈ యుద్ధ విమానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను పూర్తి చేశారు. ప్రపంచ నేవీ చరిత్రలోనే ప్రథమం జలాంతర్గామి, యుద్ధ విమానం మ్యూజియాలు ఒకేచోట ఏర్పాటు కావడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. టీయూ–142 యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం ఐఎన్ఎస్ డేగాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నావికాదళంతో కలసి రాష్ట్రంలో టూరిజం వెంచర్, వాటర్ స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్ దాదాపు మూడు దశాబ్దాల పాటు ఒక్క ప్రమాదం కూడా లేకుండా భారత నేవీకి విశేష సేవలందిం చిందని తూర్పు నావికాదళ ప్రధానాధికారి హెచ్‌సీఎస్ బిస్త్ అన్నారు. మాల్దీవుల్లో ఆపరేషన్ కాక్టస్, 1998లో ఆపరేషన్ విజయ్, 2003లో ఆపరేషన్ పరాక్రమ్‌తో పాటు యాంటీ పైరసీ ఆపరేషన్లలోనూ పాల్గొని ఎన్నో విజయాలు చేçకూర్చిందని కొనియాడారు. సాగరతీరంలో మ్యూజియంగా.. ఈ యుద్ధ విమానాన్ని విశాఖ సాగరతీరంలో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. ఆర్కే బీచ్‌కు ఆనుకుని ఉన్న కురుసుర జలాంతర్గామికి ఎదురుగా ఉన్న స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. డేగా ఎయిర్ బేస్‌లోనే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విడగొట్టి రోడ్డు మార్గం ద్వారా ట్రాలర్లపై సాగరతీరానికి తరలిస్తారు. అక్కడ మళ్లీ య«థాతథంగా యుద్ధ విమానాన్ని అమరుస్తారు. దీనికి సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా. -
మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు
విశాఖ: మూడు దశాబ్దాలకు పైగా భారత నేవీకి వైమానిక సేవలు అందించిన ఓ విమానం తన సేవలకు వీడ్కోలు పలుకుతుంది. నావికా దళానికి టీయూ 142 ఎం అనే విమానం గత 32 ఏళ్లుగా తన సేవలు అందిస్తోంది. ఈ రిటైర్ అవుతున్న విమానాన్ని రిసీవ్ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తదితరులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఐఎన్ఎస్ డేగలో ఈ నేవీ విమానం రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. త్వరలో విశాఖలోని బీచ్ రోడ్డులో సందర్శన కోసం టీయూ 142ఎం విమానాన్ని ఉంచడానికి నిర్ణయం తీసుకున్నారు.