పోలీసులపై టీడీపీ నేత దాడి ? | TDP leader attacked on police | Sakshi
Sakshi News home page

పోలీసులపై టీడీపీ నేత దాడి ?

Published Sun, Sep 9 2018 4:34 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

TDP leader attacked on police - Sakshi

సాక్షి ,అమరావతి బ్యూరో: నెల్లూరు జిల్లా రాపూర్‌స్టేషన్‌పై దాడి జరిగితే రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం మొత్తం అక్కడ మోహరిల్లి దళితులను కుళ్లబొడిచిన పోలీసుల దాష్టీకాన్ని మరువలేం.. రాష్ట్ర  రాజధాని నడిబొడ్డున టీడీపీ నేత తప్పతాగి పోలీసులపై దాడిచేసి నానా హంగామా సృష్టించినా అతనిపై కేసు నమోదు చేయడానికి సాహసించని పోలీసుల వైఖరి విస్మయానికి గురిచేస్తోంది. నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరులమరావు ఆదేశాల మేరకు  జాయింట్‌ సీపీ కాంతిరాణా టాటా, ట్రాఫిక్‌ డీసీపీ రవిశంకర్‌రెడ్డి నేతృత్వంలో నగర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పోలీసుల తనిఖీల్లో ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఒక టీడీపీ నేత తప్పతాగి వాహనం నడుపుతూ  పొలీసులకు పట్టుపడ్డాడు. ట్రాపిక్‌ పోలీసులు అతను ఎంత మోతాదు మద్యం తాగాడో నిర్ధారించుకోవటానికి బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టు చేయడానికి సిద్ధమవుతుండగా వారిపై ఆ టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. విధుల్లో ఉన్న  పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించడంతో కోపోద్రిక్తుడైన టీడీపీ నేత ఒక్కసారిగా వారిపై దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు సైతం అక్కడకు చేరుకుని టీడీపీ నేతతోపాటు అతని అనుచరులను  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత అనుచరులు స్టేషన్‌కు చేరుకుని అక్కడ హంగామా  సృష్టించారు. పోలీసులౖపై దుర్బాషలాడారు.

మంత్రి ఒత్తిళ్ళతో రాజీ.. 
జిల్లాకు చెందిన  మంత్రి ముఖ్య అనుచరుడు పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకున్న స్థానిక నేతలు,  జోన్‌ పోలీసు ఉన్నతాధికారితో రాజీకి యత్నించారు. దాడిలో దెబ్బలు తిన్న పోలీసులు అందుకు ససేమిరా అనటం మా విధులను మమ్మల్ని చేసుకోనివ్వండి అని స్పష్టం చేయడంతో ఆ అధికారి చేతులెత్తేశారు. దీంతో టీడీపీ నేతలు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం.. అ వెంటనే మంత్రి రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. మంత్రి విజయవాడ నగర కమిషనరేట్‌ పరిధిలో పనిచేసే ఓ అత్యున్నత అధికారితో మంతనాలు జరిపి ఎలాగైనా కేసు నమోదు కాకుండా చూడాలని , అధికారపార్టీకి చెడ్డపేరు రాకుండా చూడాలని ఆదేశించారు. దాంతో ఆ ఉన్నతాదికారి రంగంలోకి దిగి తెల్లవారుజామున  సమయంలో పోలీసుల మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సాక్షి  పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అటువంటి ఘటన ఏమీ జరగలేదని చెప్పడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement