వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పాలా ఝాన్సీలక్ష్మిని లాక్కెళ్తున్న లేడీ మార్షల్స్
విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు హాలును టీడీపీ కార్యాలయంగా మారుస్తున్నారని, ఎలాంటి సమాచారం లేకుండా మాజీ సీఎం ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేయటం అధికార పార్టీ పక్షపాత ధోరణికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. కౌన్సిల్ హాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఫొటో కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది.
పటమట : నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధిపై జరిగిన వీఎంసీ కౌన్సిల్ సమావేశం ఆద్యంతం పాలకపక్ష అనుకూల నిర్ణయాలు తీర్మానించుకోవటానికి.. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలను ఆఫీసు రిమార్కులకు పంపే వేదికగా మారింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షత శనివారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చ జరగకుండానే, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండానే ముగిసింది. ఏకపక్షంగా సాగిన సమావేశంలో ఇప్పటి వరకు లేని మాజీ సీఎం ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను ఏర్పాటు చేయటంపై రగడ మొదలైంది.
మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వైఎస్ చిత్రపటాన్ని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. చిత్రపటాన్ని పట్టుకుని మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. దీనిపై మేయర్ ఆగ్రహంతో ఆందోళన చేస్తున్న ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, బీజాన్‌బీ, పాలా ఝాన్సీలక్ష్మి ని సస్పెండ్ చేశారు. ఈ పరిణామంపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. మేయర్ వైఖరికి వ్యతిరేకంగా కౌన్సిల్ హాలు బయట ఆందోళన చేపట్టారు.
చర్చకు రాని అంశంపై..
ఎజెండాలో పొందుపరచని అంశం కాకుండా టీడీపీ కార్పొరేటర్లు బీసెంట్ రోడ్డు హాకర్ల గురించి చర్చించటంపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసెంట్ రోడ్డులో ఆక్రమణలను తొలగించాలని, రోడ్డుకు మార్జిన్లు ఏర్పాటు చేపి హాకర్ జోన్ ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ప్రస్తావించారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్‌కుమార్ స్పందించి బీసెంట్ రోడ్డుపై పలువురు చిరు వ్యాపారులు ఆధారపడ్డారని, అలాంటి వారి జీవనాధారంపై వేటు వేయాలని చూడటం హేయమని అన్నారు. ఈ అంశం కేవలం కొంతమంది టీడీపీ నేతల వ్యక్తిగత ఎజెండా అని, నెలవారీ మామూళ్లు చెల్లించని హాకర్లను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే ఎజెండాలో ఈ అం«శం లేదని దీనిపై చర్చ జరిగేందుకు అవకాశం లేదని కార్పొరేటర్లు సూచించారు. దీంతో ఇరు పక్షాలు వెనక్కు తగ్గాయి.
కీలకాంశాలు..
జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో జీప్లస్3 గృహ సముదాయంలో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారుల వాటా రూ.66 వేల నుంచి రూ.1.56 లక్షలకు పెంపుదల చేసే అంశాన్ని సభ వాయిదా వేసింది. ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు, స్వాతంత్య్ర సమరయోధులు తలశిల వెంకటరామయ్యకు స్థలం కేటాయింపుపై వచ్చిన తీర్మానం ఆఫీస్ రిమార్కులకు పంపారు. వివాదాస్పదమైన ఫన్‌టైం క్లబ్ స్వాధీనం అంశంను తిరస్కరించారు. భాగ్యనగర్ గ్యాస్ ఏజన్సీకి స్థల కేటాయింపులపై కౌన్సిల్ ఆమోదం చేస్తూ తీర్మానం చేసింది. ఎన్టీయార్ సర్కిల్ నుంచి ఆటోనగర్ చెక్‌పోస్టు వరకు బందరు రోడ్డు విస్తరణలో భాగంగా నిర్వాసితులవుతున్న వారందరికీ టీడీఆర్ బాండ్లు కాకుండా నగదు రూపంలో చెల్లింపులు జరగాలని వచ్చిన ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
కార్పొరేటర్ల ఉదారత..
నాలుగుసార్లు కార్పొరేటర్‌గా పని చేసిన తాజ్‌నోత్ దాసు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను ఆదుకోవాలని వచ్చిన ప్రతిపాదనపై సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. ప్రతి కార్పొరేటర్ ఓ నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు గూడు కల్పించాలనే విషయంలో జీప్లస్3 గృహ సముదాయాల్లో ఇంటికి కేటాయించాలని కమిషనర్‌ను కోరగా ఆయన అంగీకరించారు.
సమాధానాలు రావటం లేదు..
ఆఫీస్ రిమార్కులకు వెళ్లిన వాటిపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు కూడా అసమగ్రంగా ఉంటున్నాయని ఆరోపించారు. దీనిపై కమిషనర్ కల్పించుకుని ఈసారి ఇలాంటి పొరపాటు జరగదని, కార్పొరేటర్లు కూడా ప్రశ్నలను 15 రోజుల ముందుగా అధికారులకు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ ఆస్తులను జప్తు చేయాల్సిందే..
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాలల నుంచి కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోతున్నామని, ఆయా సంస్థలు వీఎంసీకి ఎలాంటి పన్నులు చెల్లించటం లేదని, ఇలాంటి సంస్థలను జప్తు చేస్తామని అధికారులు నోటీసులు పంపాలని కొందరు కోరారు. బందరు రోడ్డులో ఇటీవల నిర్మించిన ఆర్‌అండ్‌బీ రాష్ట్ర కార్యాలయం నుంచి పన్నులేమీ రాలేదని, అలాగే పక్కనే ఉన్న పోలీసు గ్రౌండ్స్‌లో ఉన్న వ్యాస్ కాంప్లెక్స్ భవనానికి అనుమతి ఉన్నదీ లేనిదీ తెలియదని, పన్నులు చెల్లిస్తున్నారో లేదో విచారణ చేయాల్సి ఉందని మేయర్ కోనేరు శ్రీధర్ ప్రస్తావించారు. భవానీపురంలో శుక్రవారం జరిగిన పోలీస్ స్టేషన్ నూతన భవన శంకుస్థాపన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అనుమతి, ప్లాను లేకుండా నిర్మాణం చేపడితే టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు చేపట్టాలని కౌన్సిల్‌ల్లో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment