విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సభ మంగళవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యర్థులను అరెస్ట్ చేయడం అమానుషమని సభలో వైఎస్ఆర్ సీపీ కార్పోరేటర్లు స్పష్టం చేశారు. ఇంతలో సభ సజావుగా జరిగేలా చూడాలంటూ మేయర్ సదరు సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
దీంతో మేయర్ పోడియం వద్దకు చేరిన వైఎస్ఆర్ సీపీ కార్పోరేటర్లు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అక్కడితో ఆగకుండా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంతలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని... ధర్నాకు దిగిన కార్పోరేటర్లను శాంతింప చేశారు.