ఇదీవరుస!
విజయవాడ@ 266 పరిశుభ్రతలో వెనుకబాటు
స్వచ్ఛ భారత్ ర్యాంకింగుల్లో బయటపడ్డ డొల్లతనం
పరిశుభ్రతలో నగరం బాగా వెనుకబడింది. లక్షలాది మంది జనాభా ఉన్న 476 నగరాలు, పట్టణాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వచ్ఛభారత్ సర్వేలో విజయవాడకు 266వ స్థానం దక్కింది. పొరుగున ఉన్న గుంటూరు 70వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు బెస్ట్ సిటీ అవార్డును దక్కించుకున్న బెజవాడ వెనుకబాటుతనానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతోపాటు ఆర్థిక సంక్షోభం కూడా కారణమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
విజయవాడ సెంట్రల్ : జాతీయ పారిశుధ్య విధానం 2008 ప్రకారం 2014-15 సంవత్సరానికి సర్వే చేపట్టారు. ఆరుబయట మలవిసర్జన, ప్రజామరుగుదొడ్లు, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ, వ్యర్థ పదార్థాలు, తాగునీటి నాణ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీని తరలింపు సక్రమంగా జరగడం లేదు. డంపింగ్ యార్డు కొరత ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంటింటి చెత్త సేకరణ 80 శాతానికి మించడం లేదు. తడి, పొడి చెత్త విభజన జరగడం లేదు. వర్మీకంపోస్ట్ ప్లాంట్లు పనిచేయడం లేదు. తూర్పు నియోజక వర్గంలో కుళాయిల ద్వారా మురుగునీరు వస్తోందని ప్రజలు ఇప్పటికీ గగ్గోలు పెడుతుంటారు.
నూరు శాతం లేవు
అభివృద్ధి చెందిన నగరంగా పేరొందిన విజయవాడలో నూరు శాతం వ్యక్తగత మరుగుదొడ్లు లేవు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 59 డివిజన్లలో సర్వే నిర్వహించగా 6,700 వ్యక్తగత మరుగుదొడ్లు కావాల్సి ఉందని లెక్క తేలింది. వీటి నిర్మాణ బాధ్యతల్ని డ్వాక్వా మహిళలకు అప్పగించాలని నిర్ణయించారు. స్వచ్ఛ భారత్ నిబంధనల్ని అనుసరించి అద్దెదారులు, కాల్వగట్లవాసులు ఈ పథకంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించరాదని ఆంక్షలు ఉండడంతో ఆ సంఖ్య 2,500కి తగ్గింది. కాల్వగట్లవాసులు 80 శాతం మంది సెప్టిక్ ట్యాంక్ పైపుల్ని కాల్వగట్లలోకి పెట్టేశారు. దీంతో కాల్వల్లో జలం కలుషితమవుతోంది.
గబ్బుకొడుతున్న టాయ్‌లెట్స్
ఏలూరులాకులు, ఉడా పార్క్, ఆర్టీసీ బస్టాండ్, హనుమంతరాయ ఫిష్ మార్కెట్, సర్కిల్-3 ఆఫీసు, యనమలకుదురు, పటమట రైతుబజార్, తారక్‌నగర్, పద్మావతి ఘాట్, రాజీవ్‌గాంధీ మార్కెట్, రాణీగారితోట, ఇందిరాగాంధీ స్టేడియం, సివిల్ కోర్టు, లెనిన్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ టాక్సీస్టాండ్, భవానీపురం లారీస్టాండ్, వీఎంసీ పూల మార్కెట్, ఐజీఎం స్టేడియం ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ టాయ్‌లెట్స్ నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవడంతో ఇవి గబ్బుకొడుతున్నాయి.