సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలకు తోడు కోవిడ్ ఫోర్తు వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలను కూడా పరీక్ష కేంద్రాలుగా గుర్తించడంతో ఏర్పాట్లు సమస్యగా మారాయి.
సర్కారు బడుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల కొరత వెంటాడుతుంటంతో ఇప్పటి వరకు ప్రైవేటు సిబ్బందితో పనులు కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రానప్పటికీ టీచర్లందరు కలిసి సిబ్బంది వేతనాలను భరిస్తూ వచ్చారు. ఇక పరీక్షలు కేంద్రాల్లో సదుపాయాలను సమకూర్చేందుకు నిధుల కొరతతోపాటు ప్రైవేట్ సిబ్బంది విధులకు హాజరయ్యే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ఇప్పటివరకు పాఠశాలల్లో పనిచేసిన స్వీ పర్లు, స్కావెంజర్లు డ్యూటీకి రాకుంటే పరిస్థితి ఏమిట ని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
62 మంది సిబ్బందే..
హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నా యి. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 1,06,635 మంది చదువుతుండగా, 6,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నాలుగో తరగతికి చెందిన సుమారు 62 మంది పర్మనెంట్ అటెండర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఇతర పాఠశాలల్లో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని తరగతి గదులు, నీటి ట్యాంకులు, మరుగుదొడ్లను శుభ్రం చేయడంతోపాటు విద్యార్థులకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్ధితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రెండేళ్ల నుంచి..
కరోనాకు ముందు పాఠశాల నిధులు (స్కూల్ గ్రాంట్) నుంచి కొంత డబ్బులు తీసి ఒక్కొక్కరికి నెలకు రూ.2500 వేతనం కింద ఇచ్చేవారు. సర్వశిక్ష అభియాన్ కింద కేటాయించే నిధులను కోవిడ్ కాలం నుంచి రద్దు కావడంతో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులపై భారం పడినట్లయింది. తాము పని చేస్తున్న స్కూల్లో మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, తరగతి గదులను శుభ్రం చేయించేందుకు సొంతంగా డబ్బులు సమకూర్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూల్లో ఒక్కొక్కరు రూ.300 నుంచి 500 ఇస్తుండగా, ఎక్కువ ఉన్న చోట్ల రూ.500–1000 వరకు వేసుకొని వారికి వేతనాలుగా అందిస్తున్నారు.
పరీక్షల సమయంలో ఎలా?
- వాస్తవంగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తవుతుంటాయి. అప్పుడు అటెండర్లు, స్వీపర్లు, స్కావెంజర్ల సమస్య ఎదురయ్యేది కాదు. ప్రస్తుతం వేసవి సెలవుల సమయంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనుండడంతో ఏర్పాట్లు సమస్యగా తయారైంది. వేసవి సెలవుల్లో ప్రైవేట్ స్వీపర్లు, స్కావెంజర్లు విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు.
- పరీక్షలు జరుగుతున్నప్పుడు రోజువారీగా తరగతి గదులను శుభ్రం చేయడంతోపాటు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది, ఎండాకాలం సెలవుల్లో వేతనం ఇచ్చే పరిస్థితి ఉండకపోవడంతో మెజారిటీ సిబ్బంది విధులకు హాజరుపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: రంజాన్‌కు భారీ బందోబస్తు)
Comments
Please login to add a commentAdd a comment