మజ్లిస్‌కు ఓటేస్తేనే బీఫ్ తినే అవకాశమనడం విడ్డూరం
♦ ‘గ్రేటర్’ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి వెంకయ్య
♦ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
♦ మతోన్మాదశక్తులకు అడ్డాగా మహానగరం
♦ పాతబస్తీ ఎందుకు అభివృద్ది జరగలేదో చెప్పాలి
♦ అధికార పార్టీతో మజ్లిస్ లోపాయికారీ ఒప్పంద ం
హైదరాబాద్: మజ్లిస్‌కు ఓటేస్తేనే బీఫ్ తినేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఒవైసీని ఉద్దేశించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ మహానగరం మతోన్మాద శక్తులకు అడ్డాగా మారుతుండటం బాధాకరమని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన సైదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయిలో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో కనిపించేలా చేసిన ఘనత ఆనాటి ప్రధాని వాజ్‌పాయ్, ముఖ్యమంత్రి చంద్రబాబులకే దక్కుతుందన్నారు. గృహనిర్మాణం కింద తెలంగాణకు 55,507 ఇళ్లు కేటాయించగా ఒక్క హైదరాబాద్‌కే 29, 531 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. మంచినీటి పథకం కింద రూ. 2,500 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే రూ. 1,700 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని అడిగే వారికి ఈ లెక్కలు సరిపోవా అని అన్నారు. స్వచ్ఛభారత్ కింద తెలంగాణకు రూ. 498 కోట్లు కేటాయించామని తెలిపారు. కేంద్రంతో కలసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ఘర్షణ పడితే నష్టం తప్ప లాభం ఉండదని అన్నారు. 2022 నాటికి దేశంలో పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు.
మతోన్మాద శక్తులకు అడ్డాగా హైదరాబాద్
పాతబస్తీ ఇప్పటికీ ఎందుకు సైబరాబాద్ నగరంలా అభివృద్ధి చెందలేదో ఎంఐఎం జవాబు చెప్పాలని ప్రశ్నించారు. సైదాబాద్ డివిజన్‌లో ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేయలేదో ఆ పార్టీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. పార్టీలు మారిన వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. సైదాబాద్ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి సమ్‌రెడ్డి శైలజారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, కాచం వెంకటేశ్వర్లు, చింతా సాంబమూర్తి, బి. నర్సింహ, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్‌జీ, ముద్దం శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నాయకులు శ్యామ్‌సుందర్, అమర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.