నాయుడమ్మ, గోఖలేలకు సత్కారం | Nayudamma, to honor Gokhale | Sakshi
Sakshi News home page

నాయుడమ్మ, గోఖలేలకు సత్కారం

Published Tue, Mar 29 2016 2:44 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

నాయుడమ్మ, గోఖలేలకు సత్కారం - Sakshi

నాయుడమ్మ, గోఖలేలకు సత్కారం

♦ ‘పద్మశ్రీ’ గ్రహీతలకు ప్రముఖుల అభినందనలు
♦ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నివాసంలో ఆత్మీయ సమ్మేళనం
♦ ప్రజల తరఫున గౌరవించడం సంతోషం: నాయుడమ్మ
 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి సోమవారం ‘పద్మశ్రీ’ పురస్కారం స్వీకరించిన వైద్య రంగ నిపుణులు డాక్టర్ నాయుడమ్మ యార్లగడ్డ, డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నివాసంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్, ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ చైర్మన్ జస్టిస్ డి.కె.జైన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయుడమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్లకుపైగా పీడియాట్రిక్ శస్త్రచికిత్స వైద్యంలో చేసిన కృషికి ప్రజల తరఫున ప్రభుత్వం ఈవిధంగా గౌరవించడం చాలా సంతోషాన్నిస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే కృషిని కొనసాగిస్తా. ప్రజలకు ఉపయోగకారిగా, సమాజానికి ఉపయోగకారిగా ఈ రంగంలో కృషిచేస్తానని విశ్వసిస్తున్నాను. కృషిని కొనసాగిస్తానని తెలియజేసుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.

 సంతోషాన్నిచ్చింది: వెంకయ్యనాయుడు
 కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘నాకు తెలిసి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సాధారణ రైతును ప్రభుత్వం గుర్తించి పద్మ పురస్కారం ఇవ్వడం సంతోషం. దేశంలోని రైతులందరికీ ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నా. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో దిట్ట. అలాంటి వ్యక్తిని గుర్తించి పురస్కారం ఇవ్వడం ద్వారా రైతులోకానికి చక్కటి గుర్తింపు లభించింది. రాష్ట్రపతి భవన్‌లో ఈ ఘట్టం జరుగుతున్నప్పుడు నాకు మనసు పులకించింది. ప్రధాని వద్దకు ఆయనను తీసుకెళ్లాను. ప్రకృతి వ్యవసాయం అనే ఆలోచనను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని ఆయనకు చెప్పారు. ఇక తెలుగు వారికి పద్మ పురస్కారాలు లభించాయి.

తెలుగు వారి ప్రతిభా విశేషాలు లోకవిదితమే. ప్రభుత్వం గుర్తించి సత్కరించడం తెలుగు వాడిగా నాకు ఆనందంగా ఉంది. ఒకేసారి 112 మందికి ఇవ్వడం కష్టమని రెండుసార్లు ఏర్పాటు చేశారు. ప్రతిభ ఉన్న వారిని గౌరవించడం అంటే దేశం తనకు తాను ఇచ్చుకున్నట్టు లెక్క. పనిచేసేవారి నుంచి స్ఫూర్తి పొందడానికే ఈ పురస్కారాలు. యామినీ కృష్ణమూర్తి, రామోజీరావు, డాక్టర్ నాయుడమ్మ, డాక్టర్ గోఖలే డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి.. వీళ్లంతా అసమాన ప్రతిభను వివిధ రంగాల్లో కనబరిచారు. వీరంతా తెలుగువారవడం చాలా సంతోషం..’ అని పేర్కొన్నారు. కంభంపాటి మాట్లాడుతూ ‘డాక్టర్ నాయుడమ్మ మూడు దశాబ్దాలకుపైగా వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడి, అవిభక్త కవలలకు శస్త్రచికిత్స ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చి దేశంలోనే అరుదైన వైద్య నిపుణుడిగా నిలిచారు. అలాగే డాక్టర్ గోఖలే తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేసి తెలుగువారికి గర్వకారణంగా నిలిచారు.’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాయుడమ్మ సతీమణి డాక్టర్ కృష్ణభారతి, కుమారుడు రితేశ్, కోడలు డాక్టర్ భువన తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement