పల్నాడు ప్రాంతంలోని పట్టణాలకు తాగునీటిఎద్దడి పొంచి ఉంది. సాగర్ కుడికాలువ నుంచి ఎప్పుడు నీరు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
పల్నాడు ప్రాంతంలోని పట్టణాలకు తాగునీటిఎద్దడి పొంచి ఉంది. సాగర్ కుడికాలువ నుంచి ఎప్పుడు నీరు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా పట్టణాల్లో రిజర్వాయర్లలో నీరు కేవలం 15 రోజులకు మాత్రమే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. తర్వాత పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
నరసరావుపేట వెస్ట్: సకాలంలో వర్షాలు లేకపోవడంతో సాగునీటిపై రైతులు ఆశలు వదులుకున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం డెడ్‌స్టోరే జీకి చేరువలో ఉంది. మరోవైపు తాగునీరు కూడా విడుదల చేసే పరిస్థితి కన్పించడంలేదు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా సాగర్‌కు 3 టీఎంసీల నీటిని తీసుకుంటేనే కుడికాలువకు నీటి విడుదల సాధ్యమవుతుందని ఎన్‌ఎస్‌పీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నీరు విడుదల చేసే విషయంలో నోరు మెదపలేదు. ఎప్పుడు నీరు విడుదలవుతుందోననే చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. రోజురోజుకు రిజర్వాయర్లు ఖాళీ అవుతుండటంతో ఆందోళన మొదలైంది.
వర్షాలు లేక..
ఈ ఏడాది ఇప్పటివరకు వర్షాలు సక్రమంగా కురవపోవటంతో సాగర్‌కు వరదనీరు చేరలేదు. గురువారం నాటికి శ్రీశైలం డ్యామ్‌లో 802.9 అడుగులు ఉండగా సాగర్‌లో 510.1 అడుగుల నీరు మాత్రమే ఉంది. గతేడాది ఇదే రోజుల్లో శ్రీశైలం డ్యామ్‌కు వరదనీరు చేరింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో రై తులు ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్నారు. పట్టణ ప్ర జానీకానికి కావాల్సిన తాగునీటికోసమైనా సాగర్ నుంచి నీరు వదలాలని జిల్లా పరిషత్ సమావేశం తీ ర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఆగస్టు 15 నుం చి నీరు విడుదలవుతుందనే ఆశతో ప్రజలు ఉన్నారు.
మినరల్ వాటర్‌పై ఆధారం..
సుమారు 1.20లక్షలమంది జనాభా ఉన్న నరసరావుపేట పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలకు రిజర్వాయర్‌లోని నీరు మరో 15రోజులకు మించిరాదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఒకపూట మాత్రమే మంచినీరు సరఫరా చేస్తుండటంతో ప్రజలు మినరల్ వాటర్‌పై ఆధారపడుతున్నారు. సాగర్ కాలువలకు మరో 20రోజులపాటు నీరు విడుదల చేయకపోతే ఇబ్బందేనని నరసరావుపేట ప్రజారోగ్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.నాగమల్లేశ్వరరావు చెప్పారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని ప్రజలకు రోజుమార్చి రోజు నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఇదికూడా 15రోజులు మాత్రమేనని తెలిపారు. వినుకొండకు దొండపాడుచెరువు నుంచి నీరు తీసుకునే అవకాశం ఉండటంతో రెండునెలల వరకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు.