సాక్షి, అమరావతి: గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశం అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈఎన్‌సీలు నారాయణరెడ్డి, మురళీధర్ హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగర్ కుడి కాలువకు రెండు టీఎంసీల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరద రోజుల్లో సముద్రంలో కలిసే నీటిలో వాడుకున్న 22 టీఎంసీలను లెక్కలోకి తీసుకోవద్దంటూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంకు ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ నారాయణరెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఇందులో 11 టీఎంసీలను లెక్కలోకి తీసుకోబోమని.. మిగతా 11 టీఎంసీలను లెక్కలోకి తీసుకుంటామని బోర్డు గతంలో చెప్పిందన్నారు. అయినా ఇప్పుడు మిగులు జలాలను పూర్తి స్థాయిలో ఏపీ కోటాలో వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలు తేల్చడానికి బోర్డు నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. కాగా, సాగర్ కుడి కాలువకు 158.225 టీఎంసీలను కేటాయిస్తే.. 158.264 టీఎంసీలు వాడుకున్నారంటూ కృష్ణా బోర్డు ఈనెల 19న నీటి విడుదలను ఆపేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే వరద రోజుల్లో వాడుకున్న 22 టీఎంసీలను లెక్కలోకి తీసుకోవద్దని తాము బోర్డును కోరినా.. దానిని పరిగణనలోకి తీసుకోకుండా కోటా పూర్తయిందంటూ నీటి విడుదల ఆపేయడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరింది. దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని త్రిసభ్య కమిటీని కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించడంతో ఆ కమిటీ సమావేశమైంది.
సాగర్ కుడి కాలువకు రెండు టీఎంసీలు
Published Sat, May 23 2020 4:24 AM | Last Updated on Sat, May 23 2020 4:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment