తేల్చాల్సింది మీరే..!
- సయోధ్య కుదరనందున మీ జోక్యం తప్పనిసరి
- కృష్ణా బోర్డుకు తెలంగాణ మరో లేఖ
సాక్షి,హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ తెలంగాణ సర్కారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరని దృష్ట్యా రబీ అవసరాలకు నీటి కేటాయింపులపై బోర్డే స్వయంగా కల్పించుకొని పరిష్కరించాలని కోరింది. రాష్ట్రంలో ఇప్పటికే సాగర్ ఎడమ కాల్వ కింద పంటల సాగు మొదలైనందున లభ్యత కలిగిన నీటిలో అవసరమైన మేరకు నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని కోరింది.
కృష్ణా నీటి లెక్కలపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ ఉండాలన్న దానిపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులతో చర్చలు జరిపారు. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను ఎక్కడా ఉల్లంఘించకుండా, కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నామని తెలుపుతూ బోర్డుకు, కేంద్ర జల వనరుల శాఖకూ లేఖ రాయాలని భావించారు.
కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాసే విషయమై ముఖ్యమంత్రి కేరళ పర్యటన ముగించుకొని వచ్చాక నిర్ణయం తీసుకుందామని, బోర్డుకు వాస్తవ గణాంకాలతో లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు లేఖ సిద్ధం చేసి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. లేఖలో ప్రస్తుతం సాగర్‌లో ఉన్న 101 టీఎంసీల నీటిలో ఏపీకి దక్కే వాటా ఏమీలేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ‘కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీల హక్కు కలిగి ఉన్నాయి. తుంగభద్ర ఎగువన, సాగర్ దిగువన ఉన్న కేటాయింపులు మినహాయిస్తే.. జూరాల మొదలు సాగర్ వరకు తెలంగాణ 200, ఏపీ 281 టీఎంసీల హక్కు కలిగిఉన్నాయి. వీటికి తోడు ప్రస్తుత ఏడాది సాగర్‌లోకి వచ్చిన 137 టీఎంసీలను కలుపుకుంటే మొత్తంగా 618 టీఎంసీలు అవుతుంది.
ఇందులో 68 టీఎంసీలు ఆవిరి నష్టాల కింద లెక్కకడితే అందుబాటులో ఉన్న 550 టీఎంసీలను తెలంగాణ 229, ఏపీ 321 టీఎంసీల మేర వాడుకోవాలి. ఇప్పటికే ఏపీ 321 టీఎంసీలకు అదనంగా మరో 8 టీఎంసీలను వాడుకోవడంతో అది 329 టీఎంసీలు వాడుకున్నట్లవుతుంది. ఇప్పుడు మిగిలిన ఖరీఫ్ అవసరాలకు 41 టీఎంసీలు, మిగిలిన రబీ అవసరాలకు మరో 155 టీఎంసీలు కావాలని కోరుతోంది. ఇది అసమంజసం. కృష్ణా డెల్టా కింద సైతం 152.2 టీఎంసీల కేటాయింపులుంటే ఖరీఫ్‌లోనే 155 టీఎంసీలు వాడుకుంది.
ఖరీఫ్‌కు అదనంగా డెల్టాకు మరో 26 టీఎంసీలు కోరుతోంది. వాటాకు మించి కోటాను వాడుకొని, లభ్యత ఉన్న 101 టీఎంసీల్లో వాటా కోరుతోంది. మానవతా దృక్పథంతో ఏపీ ఖరీఫ్ అవసరాలకు 30 టీఎంసీలను అప్పుగా ఇస్తామని, తర్వాతి సీజన్‌లో దాన్ని సర్దుబాటు చేసుకుందామని ప్రతిపాదించినా ఏపీ అంగీకరించడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కష్టంగా మారినందున వివాదానికి తెరదించేందుకు మీ జోక్యం తప్పనిసరి’ అని లేఖలో తెలంగాణ పేర్కొన్నట్లుగా తెలిసింది.