=రెండేళ్లుగా రెండో పంట లేదు
=ఈ ఏడాది భారీ వర్షాలతో ఖరీఫ్‌లో ఎదురుదెబ్బ
=రబీపైనే అన్నదాత ఆశలు
= ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తులు
భారీ వర్షాలకు ఖరీఫ్ పంట నష్టపోయిన జిల్లా రైతులు రబీపై దృష్టి సారించారు. రెండో పంటకు రెండేళ్లుగా నీరివ్వని ప్రభుత్వం ఈ ఏడాదైనా ఇస్తుందా అనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. డెల్టా ఆధునికీకరణను బూచిగా చూపి నీటి విడుదల నిలిపివేసిన ప్రభుత్వం పనులు చేపట్టిందీ లేదని విమర్శిస్తున్నారు. ఈ ఏడాదైనా నీరిచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో రబీ సాగుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా నీరు విడుదల చేయడం లేదు. దీంతో ఏడాదిలో ఒక్క పంట మాత్రమే సాగు చేసి రైతులు భూమిని ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3.50 లక్షల ఎకరాల్లో రబీ సీజన్‌లో వరిసాగు జరుగుతుంది. రబీ సీజన్‌లో రెండో పంటగా వేసే అపరాల (మినుము, పెసర) వంటి పైర్లు సముద్రతీరంలోని మండలాల్లో సాగుచేసే అవకాశం లేదు. దీంతో వారికి రబీ సీజన్‌లో వరిసాగే ప్రధాన ఆధారం. ఈ ఏడాది ఖరీఫ్ పంట భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న నేపథ్యంలో రబీకి సాగునీటిని విడుదల చేస్తే రైతులకు కొంతమేర మేలు చేకూరుతుందనే వాదన వినపడుతోంది. మంత్రి కొలుసు పార్థసారథి ఇటీవల మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామానికి వెళ్లిన సమయంలో రైతులు రబీకి సాగునీరు విడుదల చేయాలని కోరగా ముఖ్యమంత్రితో మాట్లాడి నీరు విడుదల చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మినుముతోనే సరి...
రబీకి గత రెండేళ్లలో నీరు విడుదల చేయకపోవడంతో రైతులు రెండో పంటగా మినుము సాగు చేశారు. దీనివల్ల సరైన ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదని, రెండో పంటగా వరి సాగు చేసేందుకు వీలుగా ఈ ఏడాదైనా సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరం. తొలి పంటలో కౌలు, పెట్టుబడి వ్యయం పోను వారికి మిగిలేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో రెండో పంట కూడా లేకపోవడం వారికి అశనిపాతమే. సముద్రతీర ప్రాంతాల్లో మినుము సాగుకూ అవకాశం లేదు.
40 టీఎంసీలు అవసరం...
జిల్లాలో రబీ సీజన్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3.50 లక్షలు కాగా 40 టీఎంసీల నీరు విడుదల చేస్తే సరిపోతుందని నీటిపారుదల శాఖ అధికారుల అంచనాగా ఉంది. రబీలో వరిసాగు చేస్తేనే కూలీలకూ పనులు అందుబాటులో ఉంటాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో కరెంటు ఉత్పత్తికి వాడే నీటిని దిగువకు విడుదల చేసినా జిల్లాలో రబీకి నీరు సరిపోతుందని రైతులు చెబుతున్నారు. నీటి విడుదలతో తీర ప్రాంతంలోని మండలాల్లో తాగునీటి ఇబ్బందులు కూడా ఉండవు. గత రెండే ళ్లుగా నీటి లభ్యత తక్కువగా ఉందనే కారణం చూపి జిల్లా వ్యాప్తంగా రబీకి సాగునీటిని విడుదల చేయలేదు. దీంతో సముద్రతీరంలో తాగునీటికి సైతం ఇక్కట్ల పాలయ్యారు.
ప్రజాప్రతినిధులే ఒత్తిడి తేవాలి...
డెల్టా ఆధునికీకరణ పనులను బూచిగా చూపి ఈ ఏడాది రబీకి నీటి విడుదలను నిలిపివేయవద్దని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రబీకి నీటిని విడుదల చేయించేందుకు జిల్లాకు చెందిన పాలకులు, అధికారులు ప్రభుత్వంపై ఇప్పటి నుంచే ఒత్తిడి తేవాలని రైతులు కోరుతున్నారు. డెల్టా ఆధునికీకరణ పనులు గతేడాది అసలు చేపట్టనేలేదు. గత రెండేళ్లుగా కాలువ పనులు చేయకుండా వంతెన నిర్మాణ పనులు మాత్రమే చేపట్టారు. ఈ నేపథ్యంలో సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.