
రబీ జోష్.. సాగు భేష్..!
• 12.08 లక్షలకు 9.26 లక్షల హెక్టార్లలో పంటలు
• పప్పుధాన్యాల సాగుకు పెరిగిన ప్రాధాన్యం
• 142 శాతంగా పప్పుధాన్యాల సాగు
• ఆరు జిల్లాల్లో 100 నుంచి 127 శాతం..
• రాష్ట్రంలో సగటున 77 శాతం పంటల సాగు
సాక్షి, కరీంనగర్: కాలం కలసిరావడంతో ఈసారి రబీసాగు మంచి జోష్‌లో ఉంది. రెండు మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సాగు జోరందుకుంది. తెలంగాణలో 31 జిల్లాల్లో ఇప్పటికే సగటున 77 శాతానికి చేరింది. మొత్తంగా పారిశ్రామిక ప్రాంతమైన మేడ్చల్‌ను మినహాయిస్తే ఐదు జిల్లాల్లో 25 నుంచి 50 శాతం, 11 జిల్లాల్లో 51 నుంచి 75 శాతం, ఏడు జిల్లాల్లో 76 నుంచి 100 శాతం కాగా, ఆరు జిల్లాల్లో 100 నుంచి 127 శాతానికి సాగు పెరిగింది. పంటల సాగుపై వ్యవసాయశాఖ అంచనాలతో పోలిస్తే ఆరుతడి పంటలు ఎక్కువగా వేశారు. కందు లు, శనగ, పెసర, మినుముల సాగు 100 నుంచి 127% కాగా, మొక్కజొన్న, వేరుశనగ 76% నుంచి 100% అయ్యింది. తర్వాతి స్థానంలో వరి, జొన్న, మిర్చి, పొగాకు, ఆ తర్వాత గోధుమ, రాగులు, ఉల్లి, పొద్దుతిరుగుడు పంటలు సాగయ్యాయి.
పప్పుధాన్యాలకు పెరిగిన ప్రాధాన్యం
రాష్ట్రంలో మొత్తంగా చూస్తే వ్యవసాయశాఖ అంచనాలను మించి పప్పుధాన్యాల సాగు కు రైతులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వరి, గోధుమ, జొన్న, సజ్జలు, మొక్కజొన్న తదితర ముతక ధాన్యాలు 2.10 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేయగా.. 1.61 లక్షల హెక్టార్ల (77శాతం) లో వేశారు. కందులు, శనగ, పెసర, మినుములు తదితర పప్పుధాన్యాలు 1.27 లçక్షల హెక్టార్ల సాగు అంచనాకు 1.79 లక్షల హెక్టార్ల (142 శాతం)లో సాగు చేశారు. ఇందులో కందులు 154 శాతం, శనగలు 158, పెసర 124 శాతం వేశారు. మిర్చి సాగు 118% కాగా, వేరుశనగ 95%గా నమోదయ్యింది.
మొత్తంగా నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ తదితర నూనెగింజలు 1.95 లక్షల హెక్టార్లలో సాగవుతాయనుకుంటే, 1.57 లక్షల హెక్టా ర్లతో 81 శాతంగా ఉంది. ఇదిలావుంటే ఈ రబీలో పంటల సాగు శాతం జిల్లాల వారీ గా చూస్తే అత్యధికంగా కామారెడ్డి, సిద్ది పేట, మహబూబాబాద్, వనపర్తి, ఆదిలా బాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 94 శాతం నుంచి 162 శాతం వరకు పంటలు సాగు కాగా, అత్యల్పంగా మేడ్చల్, రంగా రెడ్డి, నల్లగొండ, సంగారెడ్డి తదితర జిల్లాలు న్నాయి. ఇందులో కొన్ని పారిశ్రామిక ప్రాంతాలైనప్పటికీ అతి తక్కువ హెక్టార్ల లక్ష్యానికి దూరంగా ఉన్నాయి.
చి‘వరి’వరకు సా..గుతోంది
నవంబర్ చివరివారం నుంచి ఊపందు కున్న వరినాట్లు తెలంగాణ జిల్లాల్లో ఇంకా సాగుతున్నాయి. ఈ రబీలో 5.33 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా, ఇప్పటికీ 3.53 లక్షల హెక్టార్ల (66 శాతం)లో వేశారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే మూడింతలు ఎక్కువ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,12,241 హెక్టార్లు వరి సాగు లక్ష్యం కాగా, 74,998 హెక్టా ర్లలో సాగైంది. పెద్దపల్లి జిల్లాలో ముందు గానే వరినాట్లు మొదలు కాగా, 29,590 హెక్టార్ల సాగు అంచనాకు అత్యధికంగా 34,348 హెక్టార్లలో వరి వేశారు. సిద్ది పేటలో 29,997 హెక్టార్లకు 39,688 హెక్టార్లలో, నిజామాబాద్‌లో 51,923లకు 45,333 హెక్టార్లు వరి వేశారు. గద్వా లలో అసలే వరినాట్లు లేవు. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, ఎల్‌ఎండీ తదితర ప్రాజెక్టుల కింద నీటి విడుదల ప్రణాళిక ఇటీవలే ప్రకటించగా వరినాట్లు ఇంకా సాగుతున్నాయి.