సాక్షి, అమరావతి: గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లు పడేవారు. బ్లాక్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయడమే కాదు.. పంటకాలంలో విలువైన సమయాన్నీ వృథా చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఎరువుల కొరత అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. ఎరువుల అందుబాటు విషయంలో రైతాంగం నిశి్చంతగా ఉంటోంది. సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైన నిల్వలను సిద్ధం చేస్తుండడంతో ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తడం లేదు. ప్రస్తుత రబీ సీజనే ఇందుకు నిదర్శనం. ఈ రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఎరువుల నిల్వలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీంతో రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలే ఇందుకు కారణమంటూ రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రబీ కోసం ఎరువుల నిల్వలు ఇలా..
ఏటా రాష్ట్రంలో 35 లక్షల టన్నుల ఎరువుల వాడకం జరుగుతుంది. నిజానికి ఖరీఫ్ కంటే రబీ సీజన్‌లోనే ఎరువుల వాడకం ఎక్కువ. రబీ సీజన్‌కు సంబంధించి 22.60 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఎరువులు అవసరమవుతాయని అంచనా. అయితే ఈసారి రబీ సీజన్ ప్రారంభానికి ముందు 7,50,260 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలున్నాయి. ఈ సీజన్ కోసం రాష్ట్రానికి మార్చి 15వ తేదీ వరకు 20,94,044 మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించింది. ఆ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 బఫర్ గిడ్డంగులు, 154 హబ్‌లలో 28,44,304 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధం చేయగా.. గడిచిన ఐదు నెలల్లో 21,81,737 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల అమ్మకాలు జరిగాయి.
మిగిలిన 6,62,567 మెట్రిక్ టన్నులకు అదనంగా కంపెనీల నుంచి మరో 30,004 మెట్రిక్ టన్నుల మేరకు సేకరించారు. దీంతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 6,92,572 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా 3,11,375 ఎం.టీ.ల యూరియా, 30,865 ఎం.టీ.ల డీఏపీ, 63,971 ఎం.టీ.ల ఎంఓపీ, 59,469 ఎం.టీ.ల ఎస్‌ఎస్‌పీ, 2,22,037 ఎం.టీ.ల కాంప్లెక్స్, 195 ఎం.టీ.ల అమ్మోనియా సల్ఫేట్, 4,659 ఎం.టీ.ల సిటీ కాంపోస్ట్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రబీ సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ వద్ద 6,16,324 ఎం.టీ.ల నిల్వలుండగా, ఇప్పటివరకు 5,46,536 మెట్రిక్ టన్నుల మేరకు అమ్మకాలు జరిపారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద డీఎపీ 6,245 ఎం.టీ.లు, ఏపీకే 2,366 టన్నులు, యూరియా 61,161 టన్నులు కలపి 69,772 ఎం.టీ.ల నిల్వలున్నాయి. వీటిని పాత ధరలకే విక్రయిస్తున్నారు. అదే సమయంలో రబీ సీజన్‌లో ఆర్‌బీకేల్లో 1,00,125 మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటివరకు 19,900 మెట్రిక్ టన్నులను రైతులు కొనుగోలు చేశారు.
రికార్డు స్థాయిలో రబీ సాగు
ప్రస్తుత రబీ సీజన్‌లో ఎరువుల కొరత లేకపోవడంతోపాటు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 58.92 లక్షల హెక్టార్లలో రబీ సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 59.06 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 21.75 లక్షల హెక్టార్లలో వరి, 23.74 లక్షల హెక్టార్లలో అపరాలు, 3.55 లక్షల హెక్టార్లలో ఆయిల్‌సీడ్స్, 2.67 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగయ్యాయి.
ఇంత ఈజీగా ఎరువులు దొరుకుతాయనుకోలేదు..
నేను 15 ఎకరాలు కౌలుకు తీసుకుని రబీలో వరిసాగు చేశా. గతంలో ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. మండల కేంద్రానికి, కొన్ని సందర్భాల్లో విజయవాడకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. మొట్టమొదటిసారి మా ఊళ్లోనే కావాల్సినన్ని ఎరువులుంచారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో 15 బస్తాల యూరియా, 5 బస్తాల డీఏపీ తీసుకున్నా. ఇంత ఈజీగా ఎరువులు దొరుకుతాయని కలలో కూడా ఊహించలేదు. సకాలంలో ఎరువులు వేయడంతో పంట ఏపుగా పెరిగింది.
– కలపాల ఇసాక్, కాటూరు, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా
రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఎరువుల కొరత లేదు..
రబీ సీజన్‌లో ఏ దశలోనూ ఎరువుల కొరత తలెత్తలేదు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా సీజన్ ముందుగానే కేంద్రం మన రాష్ట్రానికి అవసరమైన ఎరువులను కేటాయించింది. ఆర్‌బీకేల్లోనూ అందుబాటులో ఉంచడంతో ఎక్కడా ఎరువులకోసం రైతులు ఇబ్బంది పడలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలను పాత ధరలకే విక్రయిస్తున్నారు.
–హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment