సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) వేదికగా అందిస్తున్న వ్యవసాయ అనుబంధ సేవలన్నింటిని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కిందకు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు ఉపయోగపడేలా ‘యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్’ కింద ఒకే యాప్‌ను రూపొందించాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి సన్నాహాలు జరుగుతున్నాయి.
యాప్ ద్వారా అందే సేవలు
సబ్సిడీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు (ఇన్‌పుట్స్), భూసార పరీక్షలు, నేలలో సూక్ష్మపోషకాలలోపాన్ని అధిగవిుంచడం (సాయిల్ హెల్త్), పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు, పరిశోధనలు(ఆగ్రోనమీ), పంటల ఆరోగ్య పరిస్థితి(క్రాప్ హెల్త్), వాతావరణ పరిస్థితులు, తదనుగుణంగా పంటల సాగుకు సూచనలు, పంట కోత ప్రయోగాలు(వెదర్), పంట రుణాలు, ఇన్‌స్రూరెన్స్ కంపెనీల సేవలు (ఫైనాన్షియల్), స్టోరేజ్, కనీస మద్దతు ధరలు, మార్కెటింగ్(అవుట్‌పుట్స్).. ఇలా వివిధ రకాల సేవలను ఈ–ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులకు అందించనున్నారు.
అమలుకు చర్యలు ఇలా..
ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఫేజ్–1 కింద రూ.7.06 కోట్లు విడుదల చేసింది. సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి రూ.5.60 కోట్లు, శిక్షణ కార్యక్రమాలకు రూ.కోటి ఖర్చు చేయనున్నారు. యాప్ రూపకల్పనకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసే బాధ్యతను ఓ ఐటీ కంపెనీకి అప్పగించనున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆర్బీకేలకు అనుసంధానించనున్నారు. అంతేగాక వాటి పరిధిలో ఉండే రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ–ప్లాట్‌ఫారమ్‌లో పొందుపర్చనున్నారు. వీఏవో, వీహెచ్‌ఏ, వీఎఫ్‌వో ఇలా ఆర్బీకేల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు సంబంధిత యూనివర్సిటీలు, బ్యాంకులు, ఇన్‌స్రూ?న్స్ కంపెనీలు, వ్యవసాయ, అనుబంధ శాఖలు, వ్యాపారులు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు.. ఇలా రైతులకు సేవలందించే రంగాలకు ఈ–ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి రానుంది. రియల్‌టైం గవర్నెన్స్‌కు అనుసంధానించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతోపాటు వివిధ శాఖల ద్వారా అందిస్తోన్న సేవల్లో మరింత పారదర్శకత, సిబ్బందిలో జవాబుదారీతనం తీసుకురావడమే కాదు సత్వర సేవలందించే అవకాశం ఏర్పడుతుంది.
యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అంటే..
ప్రస్తుతం పంట వివరాల నమోదుకు ఓ యాప్, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ కోసం ఓ యాప్, భూసార పరీక్షల కోసం మరో యాప్, ప్రొక్యూర్‌మెంట్ కోసం ఇంకొక యాప్, మార్కెటింగ్ కోసం మరొక యాప్ ఇలా ఒక్కో సేవకు ఒక్కో యాప్ అందుబాటులో ఉన్నాయి. భూసార పరీక్షలు, చీడపీడల నివారణ, పంటల దిగుబడి, అమ్మకాలతోపాటు వైఎస్సార్ రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలకు వేర్వేరుగా యాప్‌లు వినియోగంలో ఉన్నాయి. ఇలా ఒక్కో సేవకు ఒక్కో యాప్ అందుబాటులో ఉండడంవల్ల సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని అధిగవిుంచడంతోపాటు విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు ఉపయోగపడేలా ఒకే యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ ఈ–గవర్నెన్స్ ప్లాన్ కింద వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగపడే కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి ఆర్థిక చేయూతనివ్వాలని భావించిన కేంద్రం ఆ మేరకు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరగా.. రాష్ట్ర వ్యవసాయశాఖ ఓ ప్రాజెక్టు రిపోర్టును పంపింది. ఈ ఆలోచన చాలా బాగుందంటూ కేంద్రం కితాబునివ్వడమేగాక 60:40 నిష్పత్తిలో ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది.
ఇకనుంచి ఒకే యాప్ ద్వారా సేవలు
ఒక్కో సేవకు ఒక్కో యాప్ వినియోగంలో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని అధిగవిుంచే లక్ష్యంతోనే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కింద ఒకే యాప్ రూపకల్పన చేయాలని సంకల్పించాం. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు తోడ్పాటునందించడం ధ్యేయంగా దీన్ని రూపొందిస్తున్నాం.
–హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment