'ఆర్బీకే'ల నిర్మాణం చకచకా | YSR Rythu Bharosa Centres Constructions In Full Swing In AP | Sakshi
Sakshi News home page

'ఆర్బీకే'ల నిర్మాణం చకచకా

Published Tue, Mar 23 2021 4:45 AM | Last Updated on Tue, Mar 23 2021 4:47 AM

YSR Rythu Bharosa Centres Constructions In Full Swing In AP - Sakshi

అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో రైతులకు విత్తు మొదలు పంట అమ్మకం వరకు అన్ని సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.

సాక్షి, అమరావతి: పల్లెల్లో వ్యవసాయం చేసే రైతుల గురించి గత ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జనాభాలో అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతుల గురించి ఆలోచన చేయడమే కాకుండా సాగుకు అవసరమైన సమస్తం ఉన్న ఊరిలోనే సమకూర్చేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు కొత్త భవన నిర్మాణాలను చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామాల్లో రూ.2300.61 కోట్లతో 10,408 రైతు భరోసా కేంద్రాలకు భవన నిర్మాణాలను చేపట్టారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 1,545 రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి అయింది. 243 ఆర్బీకేల భవనాలు ఫినిషింగ్‌ స్థాయిలో ఉన్నాయి. మరో 4,778 భవనాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ దశలో ఉన్నాయి. ఇంకో 2,848 భవనాలు బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ పూర్తయినవి 994. మొత్తం రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను ఈ ఏడాది జూన్‌ ఆఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి వల్ల రైతులకు ఉన్న ఊరిలోనే శాశ్వత భవనాలతో ఆస్తిని సమకూర్చనుంది. 

ఓ వైపు ఇప్పటికే సకల సేవలు 
► ఒక పక్క ఆర్బీకే భవన నిర్మాణాలు కొనసాగుతుండగానే మరో పక్క ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తున్నారు. 
► గతంలో రైతులు పొలం పనులు మానుకుని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కోసం మండల కేంద్రాలు లేదంటే డివిజన్‌ కేంద్రాలకు వెళ్లి.. అక్కడ క్యూలో నిలబడి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అందుకు భిన్నంగా రైతులు తమకు అవసరమైన వాటికి భరోసా కేంద్రాల్లో ఆర్డర్‌ ఇస్తే హోం డెలివరీ సదుపాయం కల్పించారు. 
► రైతు భరోసా కేంద్రాల్లో 155251 నంబర్‌తో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రైతులు ఆ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్వహణ  కోసం బీఎస్సీ (అగ్రికల్చర్‌) గ్రాడ్యుయేట్లను వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, ఆక్వా సహాయకులుగా నియమించారు. 


ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన
► వ్యవసాయంతో పాటు, హార్టికల్చర్, సెరికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, సహకార, నీటి పారుదల తదితర రంగాలన్నింటిలోనూ సేవలకు ఒకే వేదికగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, వారికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 
► ఈ కేంద్రాల్లో డిజిటల్‌ కియోస్క్, స్మార్ట్‌ టీవీ, వైట్‌ బోర్టు, కుర్చీలు, డిజిటల్‌ లైబ్రరీతో పాటు, భూసార పరీక్షకు అవసరమైన ఉపకరణాలను ఏర్పాటు చేశారు. రైతులు తమకు కావాల్సిన వాటిని ఇక్కడి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. మరింత పారదర్శకత కోసం వివిధ పథకాల లబ్ధిదారులైన రైతుల వివరాలను సైతం ప్రదర్శిస్తున్నారు. 

మద్దతు ధర కల్పన
► మార్కెట్‌ ఇంటెలిజెన్స్, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు సంబంధించిన సమాచారం అందించడం, రైతుల సందేహాలు తీర్చడంలో కూడా ఈ కేంద్రాలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. ధాన్యం సేకరణ కేంద్రాలుగా కూడా ఇప్పటికే పని చేస్తున్నాయి.
► పంటలకు మద్దతు ధర వివరాలను కూడా ఈ కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. రైతుల పంటలకు మద్దతు ధర లభించకపోతే ఆ సమాచారం ఇక్కడ తెలియజేస్తే మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుని మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తుంది. 
► రైతులకు వ్యవసాయంలో మెలకువలు, సమాచారం అందించేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేకించి ఆర్బీకే చానల్‌ను ప్రారంభించారు.

ఏ రోజు ఆర్డర్‌ చేస్తే అదే రోజు సరఫరా
విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం రైతులు ఏ రోజు ఆర్డర్‌ చేస్తే వారికి అదే రోజు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఆర్బీకేల పరిధిలో పక్కా గోదాముల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉన్న గోదాములను వినియోగించుకుంటున్నాం. వాటిలో స్టాకు పెడుతున్నందున రైతులు ఆర్డర్‌ చేసిన రోజునే సరఫరా చేస్తున్నాం. రైతుల ఇళ్లకే వారు కోరినవి సరఫరా చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్డర్‌ ఇచ్చిన 17,00,246 మంది రైతులకు 9.28 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. వీటి విలువ రూ.590 కోట్లు. ఇందులో రూ.244.22 కోట్లు సబ్సిడీని ప్రభుత్వం భరించింది. ఖరీఫ్, రబీ కలిపి ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా 4.35 లక్షల మంది రైతులకు 2.90 లక్షల ఆర్డర్స్‌ డెలివరీ చేశాం. రూ.98.31 కోట్ల విలువగల 1.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరఫరా చేశాం.
– అరుణ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement