సాక్షి, అమరావతి: అడ్డగోలుగా మార్కెట్‌లోకి వస్తున్న బయో ఉత్పత్తులకు బ్రేక్ పడనుంది. వీటి తయారీ, అమ్మకాలను నియంత్రిస్తూ కేంద్రం ఎరువుల నియంత్రణ చట్టం–1985 షెడ్యూల్–6ను సవరించింది. బయో ఉత్పత్తులను ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. బయో ఉత్పత్తుల పేరు చెప్పి దేశ వ్యాప్తంగా ఏటా వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. జీవ ఉత్ప్రేరకాలు (బయోస్టిమ్యులెంట్) తయారీ విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి ప్రొటోకాల్ లేకపోవడంతో కంపెనీలు ఏ మిశ్రమాలతో తయారు చేస్తున్నారో? ల్యాబొరేటరీ, ఫీల్డ్ ట్రయిల్స్ ఫలితాలేమిటో? తెలిసేది కాదు. పైగా ప్యాకింగ్స్‌పై లేబుల్స్ ఉండేవి కావు. పురుగులు, ఎరువుల మందుల నియంత్రణ చట్టాల పరిధిలో లేకపోవడంతో కంపెనీలను ప్రభుత్వాలు నియంత్రించలేకపోయేవి. ఎలాంటి పన్నులు కూడా చెల్లించే వారు కాదు.
ఏపీలో ఏటా రూ. 200 కోట్ల వ్యాపారం
తెలుగు రాష్ట్రాల్లో 1,200కు పైగా ఉన్న ఈ కంపెనీల ద్వారా లెక్కకు మించి బయో ఉత్పత్తులు ఏటా మార్కెట్‌లోకి వచ్చేవి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో 264 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ కంపెనీలు తరచూ కోర్టులను ఆశ్రయించడం, చట్టపరిధిలో లేనందున నియంత్రించే అధికారం లేదంటూ కోర్టులు ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకు లేయడంతో వీటిని నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కంపెనీల ద్వారా మన రాష్ట్రంలోనే రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకూ వ్యాపారం జరిగేదని అంచనా.
పభుత్వ ఒత్తిడితోనే గెజిట్ విడుదల
రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేంద్రం వీటిని ఎరువుల నియంత్రణ చట్టం పరిధిలోకి తీసుకురావడమే కాకుండా.. ఆ మేరకు ప్రత్యేకంగా గెజిట్‌ను విడుదల చేసి ఉత్పత్తుల రకాలను వర్గీకరించింది. సముద్రపు కలుపు మొక్కలతో సహా వివిధ రకాల మొక్కల నుంచి సంగ్రహించిన జీవసంబం«ధ పదార్థాలు, జీవ రసాయనాలు (బయో కెమికల్స్), ప్రొటీన్ హైడ్రోలైసేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కణరహిత సూక్ష్మ జీవుల ఉత్పత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు, బాష్పోచ్చేక నియంత్రణలు (యాంటీ ట్రాన్‌స్పిరెంట్స్) హ్యూమిక్, ఫల్విక్ ఆమ్లం వాటి ఉత్పన్నాలను ఈ షెడ్యూల్‌లో చేర్చారు.
ఫారం జీ–3 తప్పనిసరి
► ఎరువుల చట్టం పరిధిలోకి తీసుకురావడంతో తయారీదారులు, దిగుమతిదారులు ఫారం–జీ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎరువుల నియంత్రణాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.
► ఎక్కడైతే తయారు చేస్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ శాఖ నుంచి ఫారమ్–జీ–2ను పొందాలి.
► దీని ద్వారా ఎరువుల కంట్రోలర్ నుంచి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఫారం జీ–3)ను తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ ఆధారంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ నోటిఫైడ్ అథారిటీ నుంచి పొందే ధ్రువీకరణపత్రం ద్వారా రెండేళ్ల కాలపరిమితితో తయారీ, అమ్మకాలను కొనసాగించుకోవచ్చు.
► ఈ కొత్త చట్టం ప్రకారం ప్రతి బయో ఉత్పత్తికి నాణ్యతా నిర్ధారణ పరీక్ష తప్పనిసరి.
► ఇందుకోసం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయబోతున్నారు.
► ఈ చట్టం ద్వారా ఇక నుంచి నాణ్యమైన, నమ్మకమైన బయో ఉత్పత్తులు రైతులకు అందుబాటులోకి రావడమే కాదు జీఎస్‌టీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి.
నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు
బయోస్టిమ్యులెంట్ తయారీ, పంపిణీ దారులే కాదు అమ్మకాలు చేపట్టే వ్యక్తులు కూడా ఇక నుంచి సవరించిన ఎరువుల నియంత్రణ చట్టం–2021లో నియమాలకు లోబడే నడుచుకోవాలి. అతిక్రమిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
– అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
విచ్చలవిడి ‘బయో’కు బ్రేక్
Published Thu, Mar 11 2021 4:25 AM | Last Updated on Thu, Mar 11 2021 4:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment