కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కోటి ఆశలతో రబీ సాగును ప్రారంభించిన అన్నదాతకు కరెంట్ కష్టాలు కమ్ముకొస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతలు భారీగా పెరిగిపోయాయి. కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక తికమకపడుతున్నారు.
ఏడు గంటలు సరఫరా అటుంచితే నాలుగు గంటలకు మించడం లేదు. ఇచ్చిన కొన్ని గంటలైనా తరచూ అంతరాయం. అయితే లోవోల్టేజీ.. లేకుంటే ట్రిప్. దీంతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు. ఇలాగైతే తమకు గడ్డుకాలం తప్పదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్‌లో భారీ వర్షాలు ఓ వైపు.. తెగుళ్లు మరోవైపు రైతులను నిండా ముంచాయి. ఆ నష్టం తాలూకూ పీడకలను మర్చిపోయి మళ్లీ రబీసాగుకు సిద్ధమయ్యారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో ఇంక తమ ‘పంట’ పండినట్లేనని అనుకున్నారు. కానీ.. వారి ఆశలపై కరెంట్ కోతలు నీళ్లు చల్లుతున్నాయి. జిల్లాలో 2 లక్షల 88 వేల 807 వ్యవసాయ కనెక్షన్లున్నాయి.
జిల్లాకు ప్రస్తుతం 10.42 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటా కేటాయించారు. మరోవైపు రబీలో వివిధ పంటలు 3.17 లక్షల హెక్టార్లలో సాగవుతాయ ని వ్యవసాయశాఖ అంచనా వేసుకుంది. కేటాయించిన విద్యుత్ కోటా రబీకి సరిపోని పరిస్థితి. ఉత్పత్తి తగ్గి వినియోగం పెరిగిందన్న సాకుతో ట్రాన్స్‌కో అధికారులు మొదట వ్యవసాయ రంగానికే కోత పెడుతున్నారు. గ్రామాల్లో 12 గంటలు, ఉపకేంద్రాలున్న గ్రామాల్లో 8 గంటలు, మున్సిపాలిటీల్లో 4గంటలు అధికారికంగా కోత విధిస్తున్నా.. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చెబుతూనే విడతలవారీగా అనధికారిక కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి. పంటల విస్తీర్ణం పెరగకముందే లోటు కలవరపెడుతోంది.
పెరిగిన వరిసాగు విస్తీర్ణం
జిల్లావ్యాప్తంగా 33 మండలాల్లో అధికంగా, 23 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బావులు, చెరువులు, కుంటలు, మద్యతరహా ప్రాజెక్ట్‌లు నీటితో కళకళలాడుతున్నాయి. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 2.50 లక్షల హెక్టార్లు. ఈ రబీలో 3 లక్షల 17 వేల 500 హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. ప్రధానంగా వరి 2.25 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 55 వేలహెక్టార్లు, ఇతర పంటలు 37,500 హెక్టార్లలో సాగయ్యే అవకాశముందని అంచనా వేశారు. అదే గతేడాది రబీలో వరి 1.29 లక్షల హెక్టార్లలో వరి, మొక్కజొన్న 60,709 హెక్టార్లు, ఇతర పంటలు 77,656 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈసారి ఒక్క వరి పంటే లక్షా 22 వేల54 హెక్టార్లకు పెరిగింది. ఇప్పటికే 182000 హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు.
ఆరుగంటలే...
వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. తొమ్మిదేళ్లుగా అమలులో ఉన్న 7 గంటల విద్యుత్ సరఫరా విధానానికి కిరణ్ సర్కారు మంగళం పాడింది. ఆరు గంటలే సరఫరా అంటూ ఎన్పీడీసీఎల్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కోతలు ఈ నెల 2 నుంచే అమల్లోకి వచ్చాయి. కోతల కారణంగా రైతులు నిత్యం వ్యవసాయ బోర్ల వద్దే వుంటున్నారు. కరెంటు తరచూ ట్రిప్ కావడంతో కరెంట్ రాగానే అందరూ ఒకేసారి మోటార్లు వేస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడి కాలిపోతున్నాయి. వాటిని మరమ్మతు చేసేందుకు 10 నుంచి 15 రోజులు పడుతోంది. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయి. నిబంధనల మేరకు అర్బన్ పరిధిలో 24 గంటలు, రూరల్ పరిధిలో 48 గంటల్లోపు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అమర్చాలి, దీన్ని అధికారులెవరూ పాటించడం లేదు.
రైతుల అష్టకష్టాలు
ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రైతులకు అష్టకష్టాలు తప్పడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్లను తీసుకొచ్చింది మొదలు, మరమ్మతు పూర్తి చేసి తిరిగి బిగించే వరకూ రైతులపైనే భారం పడుతోంది. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు 2 కేవీకి రూ.20 వేల వరకు, 63 కేవీకి రూ.25 వేల వరకు, 100 కేవీకి రూ.30 వేల వరకు ఖర్చవుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వాటి మరమ్మతు కోసం కేంద్రాలకు తరలించేందుకు కనీసం రెండు రోజులు పడుతోంది. కేంద్రాల్లో కుప్పులు తెప్పలుగా ట్రాన్స్‌ఫార్మర్లకు సీరియర్ నంబర్ కేటాయించి మరమ్మతు చేస్తుంటారు. ఒక ట్రాన్స్‌ఫార్మర్ సీరియల్ నంబర్ రావాలంటే కనీసం పది రోజులు పడుతోంది. ఫలితంగా దాని పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని రైతులు ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించేవారు కూడా లేరు.
వ్యవసాయశాఖ పరంగా ఇబ్బందులు రానివ్వం : జేడీఏ
రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రానివ్వం. వ్యవసాయశాఖపరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాం. వర్షాలు సమృద్ధిగా కురవడంతో నీటి వనరులు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఎక్కువగా వరిసాగుపైనే దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం వరి నాట్లు వేసుకుంటున్నారు. కరెంటు ఇబ్బందుల దృష్ట్యా రైతులు శ్రీవరి సాగు పద్ధతిన సాగు చేసుకోవాలి.
రబీ ‘సాగు’డెలా..?
Published Fri, Feb 7 2014 4:42 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement