కుంటాల, న్యూస్‌లైన్ : కరెంటు కోతలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రబీ సాగు చేసిన పంటలకు నీరందించలేని దుస్థితిలో రోడ్డెక్కుతున్నారు. మండలంలోని 90శాతం మంది రైతులు కరెంటుపై ఆధారపడి రబీ పంటలు సాగు చేశారు. ఊహించినట్లుగానే గత ఏడాది కంటే ఈ ఏడాది రబీ సాగు పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగమూ పెరుగుతోంది. కోటాకు మించి వినియోగించడంతో కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ రంగానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
కాలిపోతున్న పరికరాలు
ఖరీఫ్ సాగు కష్టాలే మిగిల్చింది. అధిక వర్షాలతో పత్తి, వరి పంటలు నష్టపోయారు. రబీలోనైనా కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆశించిన రైతులు ఎన్నో ఆశలు సాగుకు సిద్ధమయ్యారు. మండలంలో కరెంటు బావులపై ఆధారపడి 1,050 హెక్టార్లలో వరి, 1,125 హెక్టార్లలో మొక్కజొన్న, 239 హెక్టార్లలో శెనగ, 78 హెక్టార్లలో పసుపు, 54 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 38 హెక్టార్లలో మినుము, 42 హెక్టార్లలో పెసర, 65 హెక్టార్లలో నువ్వు పంటలు సాగు చేశారు. ఏళ్ల కిందటి ఫీడర్లు, కాలం చెల్లిన విద్యుత్ తీగలు, తరచూ కాలిపోతున్న నియంత్రీకరణ పరికరాలు రైతుల పాలిట శాపంగా మారాయి.
విద్యుత్ సరఫరాలో కోతలు, లోఓల్టేజీ సమస్యలను నిరసిస్తూ లింబా(కె), విఠాపూర్ గ్రామాల రైతులు ఇటీవల కుంటాల సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రాస్తారోకో చేశారు. ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మూడు నాలుగు గంటలకు మించి సరఫరా కావడం లేదు. రాత్రివేళ అడవి పందుల బెడద తీవ్రంగా ఉండడంతో పొలాల వైపు వెళ్లడం లేదు. మొక్కజొన్న, శెనగ, పొద్దుతిరుగుడు, పసుపు, నువ్వు, మినుము, పెసర పంటలు కోత దశకు వచ్చాయి. వారం పదిరోజుల్లో పంటలు చేతికొచ్చే అవకాశం ఉండడంతో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు అందోళన చెందుతున్నారు. రబీ సాగు గట్టెక్కడానికి రైతులు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయమై డిస్కం ఏఈ శంకర్‌ను సంప్రదించగా సామర్థ్యానికి మించి కనెక్షన్లు ఉండడంతో నియంత్రీకరణ పరికరాలు తరచూ చెడిపోతున్నాయని తెలిపారు. ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
రబీ.. కష్టాల సాగు!
Published Sun, Feb 16 2014 2:27 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement