రబీకి కష్టం.. పర్యాటకానికి పట్టం | Difficult to Rabi | Sakshi
Sakshi News home page

రబీకి కష్టం.. పర్యాటకానికి పట్టం

Published Sun, Feb 5 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

రబీకి కష్టం.. పర్యాటకానికి పట్టం

రబీకి కష్టం.. పర్యాటకానికి పట్టం

సాక్షి, విజయవాడ : రబీ సాగు కోసం కృష్ణాడెల్టా రైతులకు నీరు ఇవ్వని ప్రభుత్వం పర్యాటక రంగం కోసం కృష్ణానదిలో కావాల్సిన మేర నిల్వచేయిస్తోంది. నాగార్జునసాగర్, పులి చింతల నుంచి నీటిని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిని నిండుకుండలా మార్చుతోంది. ఎయిర్‌ షో, నేవీ మేళాతోపాటు ఉమెన్‌ పార్లమెంట్‌ వంటి జాతీయస్థాయి కార్యక్రమాలకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేం దుకు బ్యారేజీ ఎగువన పూర్తి స్థాయి నీటి నిల్వ చేస్తున్నారు. ఒక వైపు నీటి కోసం కృష్ణాడెల్టా రైతులు ఎదుర్కొం టున్న కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం, పర్యాటక కార్యక్రమాలకు మాత్రం పెద్దపీట వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్‌లో 3.071 టీఎం సీలు నిల్వ చేయొచ్చు. గత ఏడాది ఇదే సమాయానికి కేవలం 2.21 టీఎంసీలు మాత్రమే బ్యారేజీలో ఉంది. ప్రస్తుతం 2.72 టీఎంసీల నీటితో బ్యారేజీ ఎగువైపు కృష్ణానది తొణికిసలాడుతోంది. మరో ఒకటి రెండురోజుల్లో నీటి నిల్వ మూడు టీఎంసీలకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఫిబ్రవరిలో బ్యారేజీలో 3 టీఎంసీల నీరు ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఫిబ్రవరి మొదటి వారం నుంచే నీటినిల్వలు తగ్గించడం ప్రారంభిస్తున్నారు. పుష్కరాల సమయంలో నదీతీరాన్ని అభివృద్ధి చేశారు. వారాంతపు, జాతీయస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తూ తీరాన్ని  పర్యాటకకేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్న  నేపథ్యంలో బ్యారేజీ ఎగువన సాధ్యమైనంత ఎక్కువ రోజులు పూర్తిస్థాయి నీటి నిల్వలను ఉంచాలని అధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు కంటే ప్రకాశం బ్యారేజీలోనే ఎక్కువ నీరు నిల్వ ఉండటం గమనార్హం.

సాగర్‌ నుంచి ఆరు టీఎంసీలు... పులిచింతల్లో రెండు టీఎంసీలు...
పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 2.14 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఈ నీటి నుంచి రోజుకు మూడు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున ప్రకాశం బ్యారేజీలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 3.071 టీఎంసీలకు చేరేవరకు నీటిని వదులుతూనే ఉంటారు. పులిచింతల్లో నీటి మట్టం పెంచుకునేందుకు నాగార్జునసాగర్‌ నుంచి 6 టీఎంసీల నీటిని వదలాలని ఇటీవల ఇరిగేషన్‌ ఇంజినీర్లు కృష్ణాడెల్టా వాటర్‌ బోర్డు అధికారులను కోరారు. ఈ మేరకు సాగర్‌ నుంచి రోజుకు ఐదారువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని పులిచింతలలో నిల్వ చేసి, వేసవిలో తాగునీటికి వదులుతారు.

బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వ
ప్రకాశం బ్యారేజీలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేస్తున్నాం. ఇందుకు పులిచింతల నుంచి నీరు తీసుకుంటున్నాం. జిల్లాలోని చెరువుల్లో 65 శాతం నీటి నిల్వ లు ఉన్నాయని సమాచారం ఉంది.  చిన్నచిన్న చెరువుల్లో నీరు తగ్గి ప్రజలు ఇబ్బంది పడితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తాం. మార్చి ఆఖరులోనే కాల్వ లకు నీటిని వదులుతాం. రబీకి నీరు ఇవ్వలేమని ముందే చెప్పాం. పర్యాటకం కోసం కాకుండా గ్రామస్తుల తాగునీటి కోసం బ్యారేజీ రిజర్వాయర్‌లో నిల్వ చేస్తున్నాం.
 – సుగుణాకరరావు, ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement