మనకు 17.. ఏపీకి 35
- హైదరాబాద్ తాగునీటికి 4, సాగర్ ఎడమకాల్వకు 13 టీఎంసీలు
- జనవరికి కృష్ణా జలాలను పంచుతూ బోర్డు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అనేక తర్జనభర్జనల అనంతరం జనవరి 20 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంచుతూ కృష్ణా బోర్డు నిర్ణయం చేసింది. ప్రస్తుత లభ్యత నీటిలో తెలంగాణకు 17 టీఎంసీలు, ఏపీçకు 35 టీఎంసీలు పంచుతూ ఆదేశాలు జారీ చేసింది. జంట నగరాల తాగునీటి అవసరాల నిమిత్తం ఏఎంఆర్‌పీ కింద 4 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 13 టీఎంసీలు కేటాయించింది. ఏపీకి కృష్ణా డెల్టాకింద 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 15 టీఎంసీలు, ఎడమ కాల్వకు 3.1 టీఎంసీలు, హంద్రీనీవా కింద 7 టీఎంసీలు విడుదలకు అంగీకరించింది. ఈ మేరకు సోమవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ఆదేశాలు జారీచేశారు. నిజానికి సాగర్ కింది సాగు అవసరాలతో పాటు హైదరాబాద్, నల్లగొండ జిల్లా అవసరాలకు కలిపి 56 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరుతూ వచ్చింది.
అయితే ఇటీవల పట్టిసీమ వినియోగ లెక్కలు, మైనర్ కింద వినియోగం లెక్కలను పక్కనపెడుతూ 130 టీఎంసీల లభ్యత జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 87 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు ప్రతిపాదించింది. రబీ సాగు ఆలస్యమవుతుండటం, రైతుల నుంచి నీటి విడుదలపై డిమాండ్ పెరుగుతుండటంతో దీనికి తెలంగాణ అంగీకరించింది. అయితే బోర్డు ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించే రీతిలో తనకు 106 టీఎంసీలు కావాలని కోరింది.
ఈ వివాదం కొలిక్కి రాకపోవడంతో సోమవారం బోర్డు జనవరి వరకు నీటిని పంపిణీ చేస్తూ నిర్ణయం చేసింది. అపెక్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి శ్రీశైలం నుంచి సాగర్‌కు 30 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. ఈ నీటి విడుదల పూర్తిగా పవర్ హౌస్ ద్వారానే జరగాలని ఆదేశించింది. చేసిన విద్యుదుత్పత్తిని ఎలా పంపిణీ చేసుకోవాలన్న దానిపై కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించుకుని ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు నిర్ణయానికి రావాలని కోరింది. ప్రాజెక్టుల కింద కేటాయించిన నీటిని ఎలా వాడుతున్నారన్నది ఈఎన్‌సీలు గమనిస్తూ ఉండాలని, సాగర్, శ్రీశైలం నీటి విడుదలను సంయుక్త కమిటీలు పర్యవేక్షిస్తాయని స్పష్టం చేసింది.