కొండకర్ల ఆవలోని నీటి నిల్వలపై 3 వేల ఎకరాల ఆయకట్టు రైతులు, 200 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
అచ్యుతాపురం, న్యూస్‌లైన్: కొండకర్ల ఆవలోని నీటి నిల్వలపై 3 వేల ఎకరాల ఆయకట్టు రైతులు, 200 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆవను అభివృద్ధి చేస్తామని పదేళ్లుగా ప్రజాప్రతినిధులు చెబుతూనే ఉన్నా, కార్యాచరణ లేకపోవడంపై రైతులు, మత్స్యకారులు నిరాశ చెందుతున్నారు.
అడుగడుగునా ఆక్రమణలు
కొండకర్ల ఆవ 2400 ఎకరాల్లో విస్తరించి వుంది. ఆక్రమణలతో 14వందల ఎకరాలకు కుదించుకుపోయింది. ప్రస్తుతం సర్వే నిర్వహిస్తే వెయ్యి ఎకరాలు కూడా ఉండకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు.
ఆవ గర్భంలో సుమారు మూడడుగుల ఎత్తు పూడిక పేరుకు పోయింది.
దీంతో గతం కంటే నీటినిల్వలు తగ్గాయి. దీనిపై ఆధారపడి ఎగువ దిగువ ఆయకట్టు రైతులు రబీ, ఖరీఫ్ సాగు చేస్తున్నారు.
చీమలాపల్లి, వాడ్రాపల్లిలో రెండు ఎత్తిపోతల పథకాలతో నీటిని వినియోగిస్తున్నారు. సాగునీటి వినియోగం పెరగడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మత్స్యకారులు ఆవలో ఏటా రూ.2 లక్షల విలువైన చేప పిల్లలను పెంచుతారు. వర్షాకాలంలో నీరు చేరినప్పుడు చేప పిల్లల్ని వేస్తారు.
ఆరునెలల పాటు పర్యాటకుల్ని దోనె షికారు చేయించి ఆదాయం పొందుతారు. ఆ తరువాత చేపల వేట మొదలుపెడతారు.
ఆరునెలల పాటు చేపలవేట సాగించి ఉపాధి పొందుతారు. ఆవ పరిసరాల్లో సౌకర్యాలు లేకపోవడం, సరస్సును చేరుకునేందుకు రోడ్డు నిర్మించకపోవడంతో ఏటా పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
హరిపాలెం, కొండకర్ల, వాడ్రాపల్లి గ్రామాలను కలుపుకొంటూ ఆవ చుట్టూ రహదారి, జట్టీలు, సేద దీరడానికి వ్యూపాయింట్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి మత్స్యకారులు ఉపాధి పొందే అవకాశం ఉంది.
గత ఏడాది ఆవ అభివృద్ధికి రూ.16 కోట్లతో అధికారులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి.
అభివృద్ధి చేయకపోవడంతో మత్స్యకారులకు మొదటి ఆరునెలల ఆదాయానికి గండి పడింది.
నీటినిల్వలు తగ్గుముఖం పట్టగానే వేట మొదలు పెడతారు. ఫిబ్రవరి నెల నుంచి జూలై నెల వరకూ వేట సాగిస్తారు.
రబీ సాగుకు రైతులు ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించడంతో మూడు నెలల్లోనే నీటి నిల్వలు తగ్గిపోతాయి.
చేపలవేట సాగించే మత్స్యకారులకు నియమ నిబంధనలుండవు. ఎవరికి వారు తమకి దొరికినన్ని చేపల్ని పట్టుకోవచ్చు.
నీటినిల్వలు తగ్గిపోవడంతో చేపల వేట జోరుగా సాగుతుంది. మూడు నెలల్లోనే చేపలవేట ముగిసిపోతుంది. ఈ సమయంలో ఎక్కువ సంఖ్యలో చేపల్ని మార్కెట్‌కి తరలించడం వల్ల గిట్టుబాటు ధర రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.