achyutapuram
-
రియాక్టర్ ప్రమాదంలో కాకినాడ యువతి మృతి
కాకినాడ రూరల్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టరు పేలుడు ప్రమాదంలో కాకినాడ 2వ డివిజన్ సౌజన్యనగర్‌కు చెందిన చర్లపల్లి హారిక (22) మృతి చెందడంతో కాకినాడ నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హారిక బీటెక్ పూర్తి చేసి గత ఏడాది సెప్టెంబర్ నెలలో ట్రైనీ ఇంజినీర్‌గా ఫార్మా కంపెనీలో విధుల్లో చేరారు. ల్యాబ్‌లో పని చేస్తున్న ఆమె రియాక్టర్ పేలుడు ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందారు. హారిక తండ్రి తాపీమేస్త్రిగా పనిచేస్తూ చనిపోయారు. సోదరుడు పదేళ్ల వయసులోనే ఇంటి నుంచి తప్పిపోయాడు. తల్లి అన్నపూర్ణ, నాన్నమ్మ ఆదిలక్ష్మితో ఆమె కలిసి ఉంటోంది. కాకినాడ రమణయ్యపేట 2వ డివిజన్ మున్సిపల్ స్కూల్లో చదువుకున్న హారిక మెరిట్ స్టూడెంట్ కావడంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది. అక్కడ ఇంజినీరింగ్ చదివింది. కెమికల్ ఇంజినీరుగా ఫార్మా కంపెనీలో ఎంపికవ్వడంతో గత సెప్టెంబరు నుంచి ట్రైనీగా పని చేస్తోంది.ఉదయమే ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాని లోకాలకు..రెండు రోజుల పాటు సెలవుపై పరీక్షలు రాసేందుకు ఇంటికి వచ్చిన హారిక బుధవారం ఉదయం కాకినాడ నుంచి తిరిగి విధులకు వెళ్లింది. మధ్యాహ్నం విధుల్లో ఉండగా రియాక్టర్ పేలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణ, నాన్నమ్మ ఆదిలక్ష్మి ప్రమాద స్థలం వద్దకు వెళ్లారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు సౌజన్య నగర్ చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
రయ్.. రయ్..
సాక్షి, అమరావతి: ఎటువంటి ప్రచార ఆర్భాటం, ఒప్పందాలు, శంకుస్థాపనలు వంటి భారీ కార్యక్రమాలు లేకుండా కోవిడ్ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించిన జపాన్‌కు చెందిన ఒక భారీ మల్టీ నేషనల్ కంపెనీ విస్తరణ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపు.. అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) పేరుతో రూ.3,079 కోట్ల భారీ పెట్టుబడితో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో రూ.1,750 కోట్ల వ్యయంతో హాఫ్ హైవే టైర్లు (భారీ యంత్ర పరికరాలకు వినియోగించే టైర్లు) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2019 నవంబర్‌లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపారు. వెనువెంటనే అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ భూమి కేటాయించడంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన వెంటనే కరోనా సంక్షోభం తలెత్తినా, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో తొలి దశ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. 2022 జూలైలో తొలి టైరును ఉత్పత్తి చేసింది. ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 ఆగస్టు 16న వాణిజ్యపరంగా ప్రారంభించారు. రోజుకు 132 టన్నుల రబ్బరును వినియోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన టైర్లను 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఫ్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్సీ సెగ్మెంట్), పెద్ద బయాస్ టైర్లు (అగ్రి మరియు కాన్స్), రేడియల్ టైర్లు (అగ్రి), రేడియల్ (ఓటీఆర్), బయాస్ టైర్, ఓటీఆర్ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్ టైర్లు వంటివి తయారవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో విస్తరణ ప్రభుత్వ ప్రోత్సాహం బాగుండటంతో యకహోమా గ్రూపు ప్యాసింజర్ వాహనాల టైర్లను తయారు చేసే యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించింది. సుమారు రూ.680 కోట్ల పెట్టుబడితో ప్యాసింజర్ కారు టైర్ల తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశీయ ప్యాసింజర్ కార్లకు డిమాండ్ భారీగా పెరగడంతో దానికి తగ్గట్టుగా ఏటా 17 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో విస్తరణ పనులు మొదలు పెట్టింది. ఈ యూనిట్‌ను 2024 చివరి త్రైమాసికానికి అందుబాటులోకి తీసుకు రావాలని యకహోమా గ్రూపు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం 28 లక్షల టైర్లుగా ఉన్న ఏటీసీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 45 లక్షల టైర్లకు చేరుకోనుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న యూనిట్లో 22 అంగుళాల వరకు ఉండే టైర్లను ఉత్పత్తి చేస్తారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, 2022లో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని, ఇదే రకమైన వృద్ధి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని యకహోమా అంచనా వేస్తోంది. 2007లో 7 లక్షల టైర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇండియాలో అడుగుపెట్టిన ఈ గ్రూపు వేగంగా విస్తరిస్తోంది. ఇండియాలో ఇప్పటికే రెండు యూనిట్లు.. తిరువన్వేలి, దహేజ్ల్లో ఉండగా, మూడవ యూనిట్‌ను అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ పూర్తి స్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,300 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 75 శాతం మంది స్థానికులకే ఉపాధి కల్పించనున్నారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 1000 మందికిపైగా పని చేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు అందించింది. ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు పూర్తిగా సహకరించారు. నిర్దేశించుకున్న గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. – ప్రహ్లాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఏటీసీ టైర్స్ యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది జపాన్‌కు చెందిన యకహోమా ఆఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఉద్యోగిగా ఉండటం పట్ల చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్లో నేను ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను. – లాబాల పవన్ కళ్యాణ్, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ -
Anakapalle: విడాకులు కోరిందని కసితో హత్య చేసిన భర్త
అచ్యుతాపురం (అనకాపల్లి): అతనిది గాజువాక..ఆమెది అగనంపూడి. ఇద్దరివీ వేర్వేరు కులాలు...ఇద్దరూ ఇష్టపడ్డారు...పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. అయితే మూడు నెలల్లోనే ప్రేమ కాస్తా ఆవిరైపోయింది. ఆమెకు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దానికి భర్త వేధింపులు తోడయ్యాయి. దీంతో మూణ్ణెళ్లకే వారి ప్రేమ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటైంది. విసిగి వేసారిన భార్య విడాకులు కోరడంతో ప్రేమించిన భర్త పగబట్టాడు. భార్య ఉసురు తీశాడు. అచ్యుతాపురంలోని లాడ్జిలో గత నెల 29వ తేదీన మహాలక్ష్మి అనే వివాహిత హత్య కేసులో వెలుగు చూసిన విషయాలివి. ఈ కేసులో మృతురాలు తండ్రి ఎస్.సాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ సత్యనారాయణ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గాజువాక బీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్, అగనంపూడిలో నివాసముంటున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సాంబ కుమార్తె మహాలక్ష్మి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం లేనప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం మూడు నెలల వరకూ సజావుగా సాగింది. ఎస్టీ లంబాడీ కులానికి చెందిన మమహాలక్ష్మికి వంటలు రావని, కట్నం తేలేదని శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు చిన్నచూపుతో వేధించడం మొదలుపెట్టారు. దీనిని భరించలేక మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా శ్రీనివాస్ వేధింపులు మానలేదు. రాంబిల్లి మండలంలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న మహాలక్ష్మిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేని మహాలక్ష్మి దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు మృతురాలు తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోరడంతో ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోమని సూచించారు. దీంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించిన మహాలక్ష్మిపై శ్రీనివాస్ పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం గత నెల 29న అచ్యుతాపురంలోని లాడ్జిలో రూం తీసుకొని మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. మంచిగా మాట్లాడి లాడ్జికి రమ్మని కోరాడు. అతని మాటలు నమ్మిన మహాలక్ష్మి భర్తను కలవడానికి వెళ్లింది. అప్పటికే రెండు కత్తులు, మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు సిద్ధం చేసుకున్న శ్రీనివాస్ మహాలక్ష్మిపై సాయంత్రం 4 గంటలకు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి పొడిచాడు. ఆమె అరుపులు విని పక్కరూంలో ఉన్న వారు లాడ్జి మేనేజర్‌కు తెలపగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాడ్జి తలుపులు తోసి లోపలకు వెళ్లగా రక్తపు మడుగులో మహాలక్ష్మి, బాత్రూంలో శ్రీనివాస్ పడి ఉన్నారు. వెంటనే ఇద్దరినీ అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా మహాలక్ష్మి మృతి చెందింది. శ్రీనివాస్ రెండు రోజుల తర్వాత కోలుకున్నాడు. ఈ నెల 8వ తేదీ ఉదయం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, జరిగినదంతా వెల్లడించాడని డీఎస్పీ విలేకరులకు తెలిపారు. విడాకులు ఇస్తే తన జీవితం నాశనం అవుతుందని, తన లాగే మహాలక్ష్మి జీవితం నాశనం కావాలనే కక్షతో శ్రీనివాస్ ఆమెను హత్య చేసినట్టు తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ మురళి పాల్గొన్నారు. -
ఆవగింజంతైనా శ్రద్ధ లేదు!
అచ్యుతాపురం, న్యూస్‌లైన్: కొండకర్ల ఆవలోని నీటి నిల్వలపై 3 వేల ఎకరాల ఆయకట్టు రైతులు, 200 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆవను అభివృద్ధి చేస్తామని పదేళ్లుగా ప్రజాప్రతినిధులు చెబుతూనే ఉన్నా, కార్యాచరణ లేకపోవడంపై రైతులు, మత్స్యకారులు నిరాశ చెందుతున్నారు. అడుగడుగునా ఆక్రమణలు కొండకర్ల ఆవ 2400 ఎకరాల్లో విస్తరించి వుంది. ఆక్రమణలతో 14వందల ఎకరాలకు కుదించుకుపోయింది. ప్రస్తుతం సర్వే నిర్వహిస్తే వెయ్యి ఎకరాలు కూడా ఉండకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఆవ గర్భంలో సుమారు మూడడుగుల ఎత్తు పూడిక పేరుకు పోయింది. దీంతో గతం కంటే నీటినిల్వలు తగ్గాయి. దీనిపై ఆధారపడి ఎగువ దిగువ ఆయకట్టు రైతులు రబీ, ఖరీఫ్ సాగు చేస్తున్నారు. చీమలాపల్లి, వాడ్రాపల్లిలో రెండు ఎత్తిపోతల పథకాలతో నీటిని వినియోగిస్తున్నారు. సాగునీటి వినియోగం పెరగడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్యకారులు ఆవలో ఏటా రూ.2 లక్షల విలువైన చేప పిల్లలను పెంచుతారు. వర్షాకాలంలో నీరు చేరినప్పుడు చేప పిల్లల్ని వేస్తారు. ఆరునెలల పాటు పర్యాటకుల్ని దోనె షికారు చేయించి ఆదాయం పొందుతారు. ఆ తరువాత చేపల వేట మొదలుపెడతారు. ఆరునెలల పాటు చేపలవేట సాగించి ఉపాధి పొందుతారు. ఆవ పరిసరాల్లో సౌకర్యాలు లేకపోవడం, సరస్సును చేరుకునేందుకు రోడ్డు నిర్మించకపోవడంతో ఏటా పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. హరిపాలెం, కొండకర్ల, వాడ్రాపల్లి గ్రామాలను కలుపుకొంటూ ఆవ చుట్టూ రహదారి, జట్టీలు, సేద దీరడానికి వ్యూపాయింట్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి మత్స్యకారులు ఉపాధి పొందే అవకాశం ఉంది. గత ఏడాది ఆవ అభివృద్ధికి రూ.16 కోట్లతో అధికారులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అభివృద్ధి చేయకపోవడంతో మత్స్యకారులకు మొదటి ఆరునెలల ఆదాయానికి గండి పడింది. నీటినిల్వలు తగ్గుముఖం పట్టగానే వేట మొదలు పెడతారు. ఫిబ్రవరి నెల నుంచి జూలై నెల వరకూ వేట సాగిస్తారు. రబీ సాగుకు రైతులు ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించడంతో మూడు నెలల్లోనే నీటి నిల్వలు తగ్గిపోతాయి. చేపలవేట సాగించే మత్స్యకారులకు నియమ నిబంధనలుండవు. ఎవరికి వారు తమకి దొరికినన్ని చేపల్ని పట్టుకోవచ్చు. నీటినిల్వలు తగ్గిపోవడంతో చేపల వేట జోరుగా సాగుతుంది. మూడు నెలల్లోనే చేపలవేట ముగిసిపోతుంది. ఈ సమయంలో ఎక్కువ సంఖ్యలో చేపల్ని మార్కెట్‌కి తరలించడం వల్ల గిట్టుబాటు ధర రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.