కాకినాడ రూరల్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టరు పేలుడు ప్రమాదంలో కాకినాడ 2వ డివిజన్ సౌజన్యనగర్‌కు చెందిన చర్లపల్లి హారిక (22) మృతి చెందడంతో కాకినాడ నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హారిక బీటెక్ పూర్తి చేసి గత ఏడాది సెప్టెంబర్ నెలలో ట్రైనీ ఇంజినీర్‌గా ఫార్మా కంపెనీలో విధుల్లో చేరారు. ల్యాబ్‌లో పని చేస్తున్న ఆమె రియాక్టర్ పేలుడు ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందారు.
హారిక తండ్రి తాపీమేస్త్రిగా పనిచేస్తూ చనిపోయారు. సోదరుడు పదేళ్ల వయసులోనే ఇంటి నుంచి తప్పిపోయాడు. తల్లి అన్నపూర్ణ, నాన్నమ్మ ఆదిలక్ష్మితో ఆమె కలిసి ఉంటోంది. కాకినాడ రమణయ్యపేట 2వ డివిజన్ మున్సిపల్ స్కూల్‌లో చదువుకున్న హారిక మెరిట్ స్టూడెంట్ కావడంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది. అక్కడ ఇంజినీరింగ్ చదివింది. కెమికల్ ఇంజినీరుగా ఫార్మా కంపెనీలో ఎంపికవ్వడంతో గత సెప్టెంబరు నుంచి ట్రైనీగా పని చేస్తోంది.
ఉదయమే ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
రెండు రోజుల పాటు సెలవుపై పరీక్షలు రాసేందుకు ఇంటికి వచ్చిన హారిక బుధవారం ఉదయం కాకినాడ నుంచి తిరిగి విధులకు వెళ్లింది. మధ్యాహ్నం విధుల్లో ఉండగా రియాక్టర్ పేలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణ, నాన్నమ్మ ఆదిలక్ష్మి ప్రమాద స్థలం వద్దకు వెళ్లారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు సౌజన్య నగర్ చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment