గుంతకల్లులో నిరసన ర్యాలీలో పాల్గొన్న టీడీపీ మహిళా నాయకులు
రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగ
అభ్యర్థుల ఖరారుపైనా శ్రేణుల్లో ఆందోళన
డబ్బులు ఖర్చుచేయించి వెన్నుపోటు పొడిచారంటూ గగ్గోలు
కాకినాడ రూరల్‌లో శెట్టిబలిజ నేత పెంకే శ్రీనివాసబాబా కన్నీళ్లు
పోలవరం నియోజకవర్గంలో కార్యకర్త ఆత్మహత్యాయత్నం
తంబళ్లపల్లెలో బైక్ ర్యాలీకి నేతల డుమ్మా
యలమంచిలిలోనూ కార్యకర్తల నిరసన
గుంతకల్లులో గుమ్మనూరు గోబ్యాక్ అంటూ ర్యాలీ
కాకినాడ రూరల్/బుట్టాయగూడెం/బి.కొత్తకోట/అచ్యుతా పురం(యలమంచిలి)/గుంతకల్లు/భీమడోలు : తెలుగుదేశం పార్టీలో పొత్తులతోపాటు అభ్యర్థుల ఖరారు నిరసనల సెగ రేపుతున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ కోసం డబ్బులు ఖర్చుపెట్టి పనిచేస్తే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తమను వెన్నుపోటు పొడిచారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శెట్టిబలిజ నేత, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ పెంకే శ్రీనివాసబాబా ఆదివారం తన నివాసంలో రెండువేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటును జనసేనకు ఇచ్చిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం సత్యనారాయణకు కాకినాడ రూరల్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పదవిని, ఆయన అనుచరుడు కటకంశెట్టి బాబీకి కో కో–ఆర్డినేటర్ పదవిని కట్టబెట్టింది. దీనిపై తొలి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న తనకు కనీస సమాచారం ఇవ్వలేదని పెంకే శ్రీనివాసబాబా ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని అడిగితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేత యనమల రామకృష్ణుడు తన ముఖంలో కరిష్మా లేదని అవమానించారని శ్రీనివాసబాబా కార్యకర్తల సమక్షంలో కన్నీటిపర్యంతమయ్యారు.
పార్టీ కోసం హైదరాబాద్‌లో ఆస్తులూ అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా వేరేవారికి పదవులు కట్టబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజికన్యాయం గురించి మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీసీల సీటు లాక్కున్నారని విమర్శించారు. టీడీపీపై నమ్మకం పోయిందని, చంద్రబాబు నుంచి పిలుపు వస్తుందేమోనని, వారం పది రోజులు వేచి చూసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీనివాసబాబా వెల్లడించారు. టీడీపీ నేత కాకరపల్లి చలపతిరావు, మరికొందరు నేతలు మాట్లాడుతూ శ్రీనివాసబాబాతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి టీడీపీకి తమ సత్తాచాటుతామని పేర్కొన్నారు.
కాకినాడలో కన్నీరు పెట్టుకుంటున్న బీసీ నేత శ్రీనివాస బాబా
► ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు కేటాయిస్తున్నారని వస్తున్న వార్తలపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాసులు వర్గం ఆందోళన చెందుతోంది. ఈ మేరకు కార్యకర్తలు ఆదివారం బుట్టాయగూడెం, రెడ్డిగణపవరం గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. అంతర్వేదిగూడేనికి చెందిన ఆండ్రు శ్యామ్‌కుమార్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మిగతా కార్యకర్తలు పెట్రోల్ బాటిల్ లాక్కుని నిలువరించారు.
► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి బి.కొత్తకోటలో ఆదివారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆ పార్టీ నేతలు డుమ్మా కొట్టారు. జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులతోపాటు ముఖ్యమైన నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ర్యాలీ సమయంలో జయచంద్రారెడ్డి వర్గీయులు జ్యోతిచౌక్‌లో కాల్చిన టపాకాయలు పేలకపోవడంతో వాటిని అలాగే వదిలేశారు. అవి కొంతసేపటికి పేలి ప్రజలపై నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. కొన్ని రవ్వలు రోడ్డుపైనే ఉన్న టెలిఫోన్ స్తంభంపై పడటంతో తీగలు కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై
మంటలను ఆర్పారు.
► అనకాపల్లి జిల్లా యలమంచిలి టీడీపీలో ముసలం పుట్టింది. ఇక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావుకు సీటు లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. యలమంచిలిలో జరిగిన సమావేశంలో జై ప్రగడ అంటూ నినాదాలు చేస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గంలోనూ ఇన్‌చార్జ్ పీలా గోవింద్‌కు సీటు ఇవ్వకపోవడంతో అక్కడి కార్యకర్తలూ గుర్రుగా ఉన్నారు. వారిని సముదాయించేందుకు పార్టీ నేతలు యత్నిస్తున్నారు. యలమంచిలిలో పదేళ్లపాటు పార్టీ పటిష్టత కోసం పనిచేసిన ప్రగడను కరివేపాకులా పక్కన పెట్టేయడం వెనుక మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్టు కార్యకర్తలు అనుమానిస్తున్నారు. కార్యకర్తల నిరసనలతో పార్టీ అధిష్టానం తలపట్టుకుంటోంది.
► అరాచక నేత, పేకాట, లిక్కర్ డాన్ గుమ్మనూరు జయరాం గో బ్యాక్ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆదివారం టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి. స్థానిక బీరప్ప గుడి సర్కిల్ నుంచి ప్రధాన రహదారి మీదుగా గాంధీచౌక్ వరకు ప్రదర్శన సాగింది. గుమ్మనూరు అభ్యర్థిత్వాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు స్థానికుల మనోభావాలను పట్టించుకోకుండా జయరాంకు టికెట్ ఇస్తే ఓడించి తీరతామని మహిళా నాయకులూ స్పష్టం చేశారు.
►ఏలూరు జిల్లా ఉంగుటూరు టీడీపీ సీటును గన్ని వీరాంజనేయులుకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పార్టీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి కార్లలో తరలివెళ్లారు. అక్కడ ప్లకార్డులతో నినాదాలు చేశారు. చంద్రబాబు అందుబాటులో లేనందున పార్టీ ప్రతినిధి షరీఫ్‌కు వినతిపత్రం అందించి వెనుదిరిగారు. ఉంగుటూరు సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టు ప్రచారం జరగడంతో కొద్దిరోజులుగా టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment