మాల్యా, నీరవ్ మోదీ వారసులు సుజనా,రఘురామకృష్ణరాజు, సీఎం రమేశ్, గంటా
బ్యాంకులకు దాదాపు రూ.4,563 కోట్లు ఎగ్గొట్టిన వైనం
వీళ్లు ఎక్కడున్నా చంద్రబాబు మనుషులే.. ఆయన కోసం పనిచేయడమే లక్ష్యం
తన బినామీలను బీజేపీలోకి పంపి టికెట్లు ఇప్పించుకున్న చంద్రబాబు
ప్రజల సొమ్మును దోచుకుని..అందులో టీడీపీకి కొంత వాటా
ప్రతిఫలంగా వారికి, వారు సూచించిన వారికి టికెట్లు ఇస్తున్న చంద్రబాబు
ఇలాంటి నేతలతో సమాజానికి తీవ్ర ప్రమాదం అంటున్న బ్యాంకింగ్ నిపుణులు
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య పోటీ.. ఆర్థిక నేరగాళ్లతో నిండిన టీడీపీ కూటమికి.. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జైత్రయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వానికి మధ్య పోటీ.. ఈ ఎన్నికల్లో ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడమే కాకుండా..తన బినామీలను పక్క పార్టీలోకి పంపి అక్కడ కూడా వారిని బరిలో నిలిపారు. వ్యాపార వేత్తల ముసుగులో బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఈ వైట్‌కాలర్ ఆర్థిక నేరగాళ్లు సూచించిన వారికీ చంద్రబాబు టికెట్లిచ్చారు.
రుణాల పేరుతో బ్యాంకులకు కన్నం పెట్టిన ఈ కేటుగాళ్లలో భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉండి నుంచి రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా.. 2019 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేశ్, సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపిన చంద్రబాబు.. వారికి టికెట్లు దక్కేలా ప్లాన్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి సీఎం రమేశ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ నలుగురు బ్యాంకుల నుంచి సుమారు రూ.4,563 కోట్ల రుణాలు ఎగ్గొట్టి, సీబీఐ ఈడీ, బ్యాంకు జప్తు కేసులు ఎదుర్కొంటున్నారు.
మోసాల్లో దిట్ట రఘురామకృష్ణరాజు
రుణాల ఎగవేతలో విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ సరసన నిలిచే కేటుగాడు రఘురామ కృష్ణరాజు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలు తీసుకున్నాడు. వీటిని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కదారి పట్టించాడు. వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి.
తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేశాడని, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వా«దీనం చేసుకున్నాయి. కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు.
ఇండ్–భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల్లో తీసుకున్న రుణాల్ని భారత్‌కు అక్రమంగా తరలించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్(ఉత్కళ్)కు తరలించేశారు.
ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మైయింటెనెన్స్ యాక్ట్(ఫెమా) దృష్టిలో పడింది. ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రూ.202 కోట్లు ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి అందినట్లు గుర్తించారు. మరుసటి రోజే బదిలీ చేసినట్లు నిర్ధారించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రఘురామ కంపెనీకి రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది.
సుజనా చౌదరి.. ఎగవేతలో నంబర్ వన్
బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకుని మోసగించిన ఘనుడు సుజనా చౌదరి. ఈ కేసులో ఈడీ దర్యాప్తుతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.1,289 కోట్ల జీఎస్టీ ఎగవేతతో పాటు రూ.700 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్ల ఇన్వాయిస్‌లు సుజనా కంపెనీలు తయారుచేశాయి.
ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నా్చ్ఠరు. దొంగ ఇన్వాయిస్‌లు చూపి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో గ్రూపునకు చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. బ్యాంకు రుణాలు తీర్చడం లేదని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంటును బ్యాంకులు సీజ్ చేశాయి.
విదేశీ బ్యాంకులకు కూడా సుజనా టోపీ పెట్టారు. మారిషస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకొని చెల్లించకపోవడంతో ఆ బ్యాంక్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు ఏకంగా అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టిన వారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇవ్వడానికి ప్రధాని మోదీ నిరాకరించినా చంద్రబాబు అతనికే ఇవ్వాలని పట్టుబట్టారు.
బీజేపీ తీర్థం పుచ్చుకొని విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నారు. రూ. 500 కోట్లు ఎగవేతకు సంబంధించి ఎన్‌సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో ఎస్‌బీఐ 2021లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్‌సీఎల్‌టీ ఆ పిటిషన్‌కు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులిచి్చంది.
బినామీ ‘బాబు’..సీఎం రమేశ్
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బినామీ సీఎం రమే‹శ్.. అతని అక్రమ లావాదేవీలను ఆదాయపన్ను శాఖ వెలికి తీసింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.800 కోట్ల నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లించారు. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు తీసుకుని వాటిని చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి ఆ కంపెనీల నుంచి సీఎం రమే‹శ్ సంస్థ నగదును వెనక్కి తీసుకుంది.
అతనికి చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపారు. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు.
రిత్విక్ ప్రాజెక్టులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, సీల్ దొరకడంతో గుట్టు రట్టయ్యింది. దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పార్టీకి ఇచ్చి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సీటు దక్కించుకున్నారనేది అందరికీ తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు.
గంటా శ్రీనివాసరావు.. రూ.390.7 కోట్ల ఎగవేత
టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.390.7 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో అతని ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు సంబంధించిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.390.7 కోట్లకుపైగా రుణం తీసుకొని ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు.
ఆస్తుల స్వాధీనానికి ఇండియన్ బ్యాంకు రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా హామీ ఉండడంతో ఆయనకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు జారీ చేసింది. గత నెలలో ఇండియన్ బ్యాంకు విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని గంటా స్థలాన్ని వేలం వేసేందుకు పత్రికా ప్రకటన ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment