సినిమా చూసొస్తూ విద్యార్థి దుర్మరణం
యలమంచిలి రూరల్: స్నేహితులతో సరదాగా సినిమాకి వెళ్లి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన దారబోయిన దుర్గాప్రసాద్(14) శనివారం రాత్రి దుర్మరణం పొందాడు. దీనికి సంబంధించి మృతుని బంధువులు, యలమంచిలి ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. రేవుపోలవరంకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు ద్విచక్రవాహనాలపై యలమంచిలి పట్టణంలో పుష్ప సినిమా చూసి తిరిగి తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.
వీరిలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దుర్గాప్రసాద్, ప్రవీణ్ మినహా మిగిలిన వారంతా యలమంచిలి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద ఆగారు. ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం లైనుకొత్తూరు వద్ద పాల క్యారేజితో రైతు నడుపుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. వేగంగా ప్రయాణిస్తున్న బైకు పక్కనే ఉన్న భవనం గోడను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి ప్రవీణ్, రైతు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దర్నీ యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment