మార్చురీ వద్ద మిన్నంటిన రోదనలు
రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు
‘బాగా చదివి మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని చూస్తానన్నావు.. స్నేహితులతో సరదాగా సినిమా చూసొస్తానని వెళ్లి మాకు పుత్రశోకాన్ని మిగిల్చావు.. అయ్యో దేవుడా మేమేం పాపం చేశామని, మాకింత పెద్ద శిక్ష విధించావు.. ప్రసాదూ లేవరా.. 13 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి’.. అంటూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందిన రేవుపోలవరానికి చెందిన విద్యార్థి దుర్గాప్రసాద్ మృతదేహంపై పడి తల్లిదండ్రులు, తమ్ముడు గుండెలవిసేలా రోదించారు.
అనకాపల్లి: ఆదివారం యలమంచిలి మార్చురీ వద్ద ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. మృతుని స్వగ్రామం రేవుపోలవరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మండలంలో లైనుకొత్తూరు వద్ద శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఎస్సై ఎం ఉపేంద్ర తెలిపారు. ఎస్. రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన దారబోయిన గోవిందరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్(13), అదే గ్రామానికి చెందిన అర్జిల్లి ప్రవీణ్(14) శనివారం మధ్యాహ్నం యలమంచిలిలో సినిమా చూసేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. సినిమా చూసిన తర్వాత తమ గ్రామానికి తిరిగి వెళ్తున్నారు.
ఈ క్రమంలో యలమంచిలి మండలం లైనుకొత్తూరు వద్ద రోడ్డు దాటుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని విద్యార్థులు నడుపుతున్న బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై మృతి చెందిన విద్యార్థి తండ్రి గోవిందరావు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాన్ని నడపుతూ రోడ్డు దాటడం వల్లే ప్రమాదం జరిగి, తన కుమారుడు మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కుటుంబీకులకు విద్యార్థి మృతదేహం అప్పగింత
యలమంచిలి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం విద్యార్థి దుర్గాప్రసాద్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. సినిమా చూసొస్తానని వెళ్లిన కుమారుడు అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మార్చురీ వద్ద వారి రోదనలు మిన్నంటడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది.
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు, రవాణా శాఖాధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రులు ఆ హెచ్చరికలను విస్మరిస్తుండడంతో అనుకోని ప్రమాదాలతో తీరని విషాదం మిగులుతుంది. మైనార్టీ తీరని పిల్లలకు వాహనాలు ఇస్తే, వారు ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతోపాటు, ఎదుటి వారిని కూడా ప్రమాదాలకు గురి చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మైనర్లకు వాహనాలిచ్చే విషయంలో తల్లిదండ్రులు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
సినిమా చూసొస్తూ విద్యార్థి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment