అనకాపల్లి: ఇటీవలే వివాహమైంది. ఇంకా కాళ్ల పారాణి ఆరలేదు. ఇంటి ముందు పచ్చని పందిరి అలాగే ఉంది. ఇంతలోనే ఆ నవ వరుడు రాజమండ్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందడం ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. ఇంతలోనే ఎంత కష్టమొచ్చిందంటూ నవ వధువును పట్టుకుని బంధువులు విలపించడం చూపరులను కన్నీరు పెట్టించింది.
వివరాలివి. టి.అర్జాపురం గ్రామానికి చెందిన పడాల గణేష్ (23)కు కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన నాగమణితో మూడు నెలల క్రితం వివాహమైంది. ఆ పెళ్లికి వేసిన పచ్చని పందిరి ఇంకా అలాగే ఉంది. కాళ్ల పారాణి ఇంకా ఆరలేదు. ఆడపిల్ల ఇంటివారు, మగ పిల్లాడి బంధువులు అంతా ఆనందంగా ఉన్నారు. అయితే ఇంతలోనే విధి వక్రించింది. గణేష్ చుట్టపు చూపు నిమిత్తం రాజమండ్రి సమీపంలోని మడికిలో ఉన్న అతని చిన్నత్తగారి ఇంటికి నాలుగు రోజుల క్రితం వెళ్లాడు.
ఈ నెల 21న అక్కడ జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గణేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతనిని అక్కడే ఆస్పత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ గణేష్ మంగళవారం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం అంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కుటుంబీకులు, బంధువులు అంతా రాజమండ్రి తరలి వెళ్లి అక్కడే గణేష్ అంత్యక్రియలు నిర్వహించి, మంగళవారం రాత్రి గ్రామానికి తిరిగివచ్చారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment