యలమంచిలి: ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆటో డ్రైవర్ దుర్మార్గంగా ప్రవర్తించాడు. వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలో పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివి. ఈ నెల 2వ తేదీన అనకాపల్లి మండలం నర్సింగరావుపేట, చవితిని వీధికి చెందిన చవితిని చిలకమ్మ (70) రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో ఉన్న తన కుమార్తె మరపురెడ్డి భవానీ ఇంటికి వెళ్లడానికి అనకాపల్లిలో ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ ప్రయాణికులతో పాటుగా ఆమెను యలమంచిలి పట్టణానికి తీసుకొచ్చాడు.
అప్పుడు చిలకమ్మ పంచదార్ల వెళ్లడానికి ఆటోని యలమంచిలిలో నిలపమని డ్రైవర్‌కు చెప్పగా నేను కూడా పంచదార్ల మీదుగా వెళతానని ఆమెను మభ్యపెట్టి ఆటోను పురుషోత్తపురం సమీపంలో ములకలాపల్లి మీదుగా పోలవరం కాలువ వైపు పోనిచ్చాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరాక ఆమెను బెదిరించి ఆమె మెడలో గల మూడు తులాల బంగారు గొలుసు, రెండు తులాల తాడును లాక్కొని ఆమె తలపై రాయితో కొట్టి ఉడాయించాడు. దీంతో ఆమె సంఘటన స్థలంలో స్పృహ తప్పి పడిపోయింది.
కొంత సమయానికి కొత్తలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను గమనించి ఆటోలో యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ కె.సన్నిబాబు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డ ఆటోడ్రైవర్ యలమంచిలిలో ఒక మందుల దుకాణం వద్ద ఆటోను నిలిపి మందులు కొనడానికి షాపు దగ్గరకు వెళ్లగా అక్కడ ఉన్న సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి విచారణ చేశారు.
కొక్కిరాపల్లి సమీపంలో గురువారం ఆటోలను తనిఖీ చేస్తుండగా అనకాపల్లి బీఆర్‌టీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎర్రబోయిన రెడ్డప్ప ఆలియాస్ శేఖర్‌గా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించడంతో అతనితో పాటు మరో ఆటో డ్రైవర్ భర్నికాల గంగరాజు పాత్ర ఉండడంతో వారి వద్ద నుంచి బంగారం అమ్మిన నగదు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శుక్రవారం విలేకరులకు తెలిపారు.
పథకం ప్రకారమే చోరీ..
కాగా అనకాపల్లిలో ఆటో ఎక్కడానికి వచ్చిన వృద్ధురాలు చవితిన చిలుకమ్మ మెడలో బంగారంపై కన్నేసిన నిందితులు పథకం ప్రకారమే ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. రెడ్డప్ప వృద్ధురాలి నుంచి దొంగిలించిన బంగారాన్ని స్నేహితుడు గంగరాజుకు ఇవ్వగా, గంగరాజు దానిని విక్రయించి వచ్చిన నగదు పంచుకుందామనుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు ఇతర అలవాట్లకు బానిసైన గంగరాజు అప్పుల పాలై రెడ్డప్పను డబ్బు అడిగాడు.
స్నేహితుడు అడిగిన డబ్బు ఇవ్వడానికే ఈ దొంగతనం చేయాల్సి వచ్చిందని రెడ్డప్ప విచారణలో ఒప్పుకున్నట్టు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఎర్రబోయిన రెడ్డప్ప ఆలియాస్ శేఖర్ అనకాపల్లి వలస వచ్చి కొంతకాలంగా భార్యతో కలిసి బీఆర్‌టీ కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఇటువంటి ఘటనల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆటోల్లో ప్రయాణించేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు.
ఇవి చదవండి: సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment