కుమారుడి మృతదేహాన్ని పట్టుకొని రోదిస్తున్న తల్లి
యలమంచిలి/యలమంచిలి రూరల్: ఏ వ్యాధి సోకిందో? ఏం జరిగిందో తెలీదు కానీ.. తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న రెండేళ్ల బాబు అస్వస్థతకు లోనయ్యాడు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు తన చేతుల్లోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. విగతజీవిగా మారిన పసిబిడ్డను పట్టుకుని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.
యలమంచిలి ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది తెలియజేసిన వివరాలు.. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులో నివాసముంటున్న కర్రి కుమారి రెండేళ్ల కుమారుడు చెర్రీ కొంతకాలంగా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు తీసుకెళ్లి బస్సులో పెనుగొల్లు వస్తుండగా యలమంచిలి సమీపాన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. తల్లి కుమారి తన బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న తాపత్రయంతో యలమంచిలిలో బస్సు దిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది.
అయితే అప్పటికే చెర్రీ మృతి చెందినట్టు డ్యూటీ డాక్టర్ సుభాష్ ధ్రువీకరించారు. ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డకు చికిత్స చేయించినా రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయని తల్లి కుమారి గుండెలు బాదుకుంటూ విలపించింది. తన కొడుకుని బతికించమని వేడుకుంటూ చూపరులను కంటతడి పెట్టించింది. మృతి చెందిన చెర్రీ తండ్రి తాతాజీ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. భార్య కుమారితో విభేదాల కారణంగా కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి వచ్చేవరకూ చెర్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుదరదంటూ భర్త తరపు వారు ఆస్పత్రి వద్ద భార్య, ఆమె కుటుంబీకులతో వాగ్వాదానికి దిగారు. కారులో మృతదేహం తరలింపును అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment