అచ్యుతాపురం (అనకాపల్లి): అతనిది గాజువాక..ఆమెది అగనంపూడి. ఇద్దరివీ వేర్వేరు కులాలు...ఇద్దరూ ఇష్టపడ్డారు...పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. అయితే మూడు నెలల్లోనే ప్రేమ కాస్తా ఆవిరైపోయింది. ఆమెకు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దానికి భర్త వేధింపులు తోడయ్యాయి. దీంతో మూణ్ణెళ్లకే వారి ప్రేమ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటైంది. విసిగి వేసారిన భార్య విడాకులు కోరడంతో ప్రేమించిన భర్త పగబట్టాడు. భార్య ఉసురు తీశాడు. అచ్యుతాపురంలోని లాడ్జిలో గత నెల 29వ తేదీన మహాలక్ష్మి అనే వివాహిత హత్య కేసులో వెలుగు చూసిన విషయాలివి. ఈ కేసులో మృతురాలు తండ్రి ఎస్.సాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ సత్యనారాయణ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గాజువాక బీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్, అగనంపూడిలో నివాసముంటున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సాంబ కుమార్తె మహాలక్ష్మి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం లేనప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం మూడు నెలల వరకూ సజావుగా సాగింది. ఎస్టీ లంబాడీ కులానికి చెందిన మమహాలక్ష్మికి వంటలు రావని, కట్నం తేలేదని శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు చిన్నచూపుతో వేధించడం మొదలుపెట్టారు. దీనిని భరించలేక మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా శ్రీనివాస్ వేధింపులు మానలేదు. రాంబిల్లి మండలంలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న మహాలక్ష్మిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు.
అతని వేధింపులు తట్టుకోలేని మహాలక్ష్మి దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు మృతురాలు తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోరడంతో ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోమని సూచించారు. దీంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించిన మహాలక్ష్మిపై శ్రీనివాస్ పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం గత నెల 29న అచ్యుతాపురంలోని లాడ్జిలో రూం తీసుకొని మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. మంచిగా మాట్లాడి లాడ్జికి రమ్మని కోరాడు. అతని మాటలు నమ్మిన మహాలక్ష్మి భర్తను కలవడానికి వెళ్లింది. అప్పటికే రెండు కత్తులు, మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్‌లెట్లు సిద్ధం చేసుకున్న శ్రీనివాస్ మహాలక్ష్మిపై సాయంత్రం 4 గంటలకు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి పొడిచాడు. ఆమె అరుపులు విని పక్కరూంలో ఉన్న వారు లాడ్జి మేనేజర్‌కు తెలపగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగి లాడ్జి తలుపులు తోసి లోపలకు వెళ్లగా రక్తపు మడుగులో మహాలక్ష్మి, బాత్‌రూంలో శ్రీనివాస్ పడి ఉన్నారు. వెంటనే ఇద్దరినీ అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా మహాలక్ష్మి మృతి చెందింది. శ్రీనివాస్ రెండు రోజుల తర్వాత కోలుకున్నాడు. ఈ నెల 8వ తేదీ ఉదయం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, జరిగినదంతా వెల్లడించాడని డీఎస్పీ విలేకరులకు తెలిపారు. విడాకులు ఇస్తే తన జీవితం నాశనం అవుతుందని, తన లాగే మహాలక్ష్మి జీవితం నాశనం కావాలనే కక్షతో శ్రీనివాస్ ఆమెను హత్య చేసినట్టు తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ మురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment