ఒడిశా: పట్టణంలోని విశాఖ–అరకు రహదారిలో ఉన్న చందన్ ఎ.సి లాడ్జిలో ఓ మహిళ హత్యకు గురైన విషయం ఆదివారం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా పట్టణవాసులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చందన్ లాడ్జి సర్వీస్ బాయ్ రూమ్ సర్వీస్ కోసం వెళ్లిన సమయంలో రూమ్ నంబర్ 103నుంచి దుర్వాసన వస్తోందని, చెప్పడంతో నిర్వాహకులు అనుమానంతో 100కి కాల్ చేశారు.
దీంతో పోలీసులు వచ్చి రూమ్ తలుపులు తెరిచి చూడగా లాడ్జి గదిలో మహిళ మృతదేహం పడి ఉండడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, క్లూస్‌టీమ్‌ను రప్పించారు. డీఎస్పీ గోవిందరాజు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రూమ్ తీసుకున్నది అల్లూరి జిల్లా వాసి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ మండలం పరిధి ఉరుముల గ్రామానికి చెందిన మాదల శ్రీరాములు ఈ నెల 24న పట్టణంలోని చందన్ ఎ.సి లాడ్జిలో రూమ్ నంబర్ 103ను బుక్ చేశాడు. 27 వరకూ ప్రతిరోజూ లాడ్జికి వచ్చి రోజువారీ అద్దె రూ.600 చెల్లించాడు. 29, 30 తేదీల అద్దె చెల్లించకపోవడంతో ఆదివారం ఉదయం 10.52గంటల సమయంలో కాల్‌చేస్తే ఫోన్‌పే చేస్తానని చెప్పినట్లు లాడ్జి సిబ్బంది తెలిపారు.
లాడ్జిలో లేని సీసీ కెమెరాలు
హత్య జరిగిన లాడ్జిలో ప్రవేశం వద్ద, రిసెప్షన్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల లాడ్జిలోకి వచ్చిన వారి వివరాలు నమోదు కాలేదు. హత్యలో ఎవరి ప్రమేయం ఉంది? ఎందరు ఉన్నారు? ఎప్పుడు జరిగింది? హత్యకు కారణం ఏమిటి? అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
హత్య జరిగి ఐదారు రోజులు
హత్య ఘటనపై కొత్తవలస సీఐ చంద్రశేఖర్ వివరణ ఇస్తూ... లాడ్జిలోని రూమ్ నంబర్ 103లో దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేయడంతో వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసి మహిళ మృతదేహం ఉండడం గమనించాం. బహుశా హత్య జరిగి ఐదారు రోజులు కావచ్చని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment